iDreamPost

మూడు కాకుంటే ముప్పైమూడు …

మూడు కాకుంటే ముప్పైమూడు …

తిరుపతిలో జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజధాని భూములపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకి బదులిస్తూ అమరావతిలో రాజధాని కోసం రైతులిచ్చిన భూమి తిరిగి వాళ్ళకే వెనక్కిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలోనే చెప్పారని, అమరావతిలో కేవలం తెలుగుదేశం కార్యకర్తలే ధర్నాలు చేస్తున్నారని, విశాఖలో భూముల ధరలు జగన్ రాజధాని ప్రకటన వల్ల ఇప్పటికిప్పుడు అమాంతం పెరగలేదని, విశాఖలో అధికారులకి, సిబ్బందికి, ప్రజలకి ఇళ్లు అందుబాటులో ఉన్నాయని అదే అమరావతిలో అయితే చిన్న నివాస స్థలానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని, వైసిపి నేతలు విశాఖలో భూములు కొన్నారనే అంశంపై స్పందిస్తూ అవన్నీ కేవలం తెలుగుదేశం వాళ్లు చేస్తున్న రాజకీయ విమర్శలేనని తోసిపుచ్చారు. అసలక్కడ ఇప్పుడు కొనటానికి భూమే లేదని, అమరావతిలో ఒకే పార్టీ ఒకే సామాజిక వర్గం వాళ్ళే భూములు కొన్నారని వాళ్లంతా చంద్రబాబు సన్నిహితులేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

గతం లో చంద్రబాబు ప్రభుత్వం కేవలం హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టడంతో, రాష్ట్రం లో మరో మహా నగరం అభివృద్ధి చెందలేదని, ఇప్పడు అమరావతిలో కూడా ఆయన మొదలుపెట్టిన నిర్మాణాలన్నీ తాత్కాలికమైనవేనని అందుకే అమరావతి తాత్కాలిక రాజధాని అయ్యిందని, రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని బెళగావి కర్ణాటక రెండో రాజధాని చేసినా ఇందులో కేంద్రం ప్రమేయం ఏమి లేదని తెలిపారు. రాయలసీమకి హైకోర్టు వస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సాధారణంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విలేఖరుల సమావేశంలో ఆన్ లైన్ లో కంటే ఆఫ్ లైన్ లోనే ఎక్కువ ఛలోక్తులు విసురుతూ నర్మగర్భంగా మాట్లాడుతుంటాడు. అందుకే విలేఖరులు కూడా ఆయన సమావేశం ముగిసిన తరువాత ఆఫ్ ది రికార్డు ఏమి మాట్లాడుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో రాజధాని పై 33 వేల ఎకరాలు ఎందుకు, 3 కాకపొతే 33 రాజధానులు పెట్టుకుంటామని చేసిన ప్రకటనలో ఛలోక్తి పాలే ఎక్కువ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి