iDreamPost

జగనే టార్గెట్‌.. అందుకే జనాలు పవన్‌ని నమ్మడం లేదా?

  • Published Aug 19, 2023 | 10:58 AMUpdated Aug 19, 2023 | 11:21 AM
  • Published Aug 19, 2023 | 10:58 AMUpdated Aug 19, 2023 | 11:21 AM
జగనే టార్గెట్‌.. అందుకే జనాలు పవన్‌ని నమ్మడం లేదా?

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తే ఆయనకు రాజకీయాలంటే ఇంకా పూర్తిగా అవగాహన రాలేదని అర్థం అవుతోంది. సినిమాల్లో ఆయన హీరోయిజం చూసి అన్ని మారినట్లే.. బయట కూడా అలానే జరుగుతుందనే భ్రమల్లో ఉన్నారు. ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటికి కూడా ఆయనకు తన పార్టీ విధానం ఏంటి.. తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి ఏమాత్రం ఐడియా లేదు. రాజకీయాల్లో తన టార్గెట్‌ ఏంటో పవన్‌కు ఇంకా క్లారిటీ లేదు. నేను సీఎం అవుతాను అంటాడు.. ఆ వెంటనే కేవలం తాను మాత్రమే అనుకుంటే సరిపోదంటాడు. అసలు పవన్‌ ఏం మాట్లాడాడో కనీసం ఆయనకైనా అర్థం అవుతుందా అని జనాలు చర్చించుకుంటున్నారు.

విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది అన్నారు. అది బీజేపీ-జనసేననా, టీడీపీ-జనసేననా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఇంకా ఏ పార్టీతో జనసేన పొత్తు అన్నది పవన్‌కే క్లారిటీ లేదు.. ఇక కార్యకర్తలు ఏం చేస్తారు. సరే పవన్‌ అన్నట్లే బీజేపీ-జనసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకుందాం. మరి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి.. దాని బలం ఎంత.. అనేది ఆలోచించారా. ఆ పార్టీ సంగతి పక్కకు పెడితే.. అసలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పోటీ చేయడానికి జనసేనకు పార్టీకి అభ్యర్థులున్నారా.. మరి ఏ నమ్మకంతో పవన్‌ జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని కలలు కంటున్నాడో అర్థం కావడం లేదు అంటున్నారు జనాలు.

చంద్రబాబు ఆ అవకాశం ఇస్తాడా..

ఇక రానున్న ఎన్నికల్లో పవన్‌ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు అని ఇప్పటికే స్పష్టం అర్థం అయ్యింది. మరి ఈ కూటమిలో టీడీపీకి ఎన్ని సీట్లు.. జనసేనకు ఎన్ని సీట్లు అనేది ఇంకా తేలలేదు. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం.. అసలు పవన్‌ను సీఎం చేయడానికి చంద్రబాబు అంగీకరిస్తాడా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అధికారం కోసం చంద్రబాబు ఎంత వరకైనా వెళ్లగలడు. ఇందుకు గత చరిత్రే సాక్ష్యం. అలాంటి చంద్రబాబు చేత తానే సీఎం అభ్యర్థి అని పవన్‌ చెప్పించగలాడా.. లేదు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా.. సీఎంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ తప్ప.. మిగతా ఎవ్వరిని సీఎం కుర్చి దరిదాపుల్లోకి కూడా రానివ్వడు చంద్రబాబు. ఎన్నికలు ముగిసిన మరు నిమిషం చంద్రబాబు అసలు రంగు బయటపడుతుంది.

జగన్‌ని గద్దె దించడమే పవన్‌ ఎజెండా..?

పవన్‌కి క్లారిటీ ఉన్న ఏకైక అంశం.. జగన్‌ను గద్దె దించడం. అందుకోసం ఆయన ఏ రేంజ్‌లో కష‍్టపడుతున్నాడో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. కనీసం తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా పవన్‌ ఈ స్థాయిలో శ్రమించలేదు కదా అనుకుంటున్నారు జనాలు. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి.. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ ఏకైక అజెండ అన్నట్లు ఉంది ఆయన వ్యాఖ్యలు చూస్తే. జగన్‌ని గద్దె దించడం కోసం పవన్‌ ఏం చేయాడానికి అయినా రెడీగా ఉన్నారని అర్థం అవుతోంది. అదే చంద్రబాబుకు కలిసి వస్తోంది.

జగన్‌ విషయంలో పవన్‌ ఇంత కసిగా ఉన్నాడు.. దాన్ని వాడుకుని.. గద్దెనెక్కడానికి చంద్రబాబు ప్లాన్లు రెడీ చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ పవన్‌, చంద్రబాబు మర్చిపోయిన అంశం ఏంటంటే.. జనాలు అన్ని చూస్తున్నారు. చంద్రబాబు లక్ష్యం ఏంటో.. పవన్‌ ఎజెండా ఏంటో.. ఎవరికి ఓటు వేస్తే తమకు సంక్షేమ పాలన లభిస్తుందో జనాలకు తెలుసు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ మైకుల ముందు ఎంత ఆవేశంగా గొంతు చించుకుని అరిచినా తమకు నమ్మకం కలగడం లేదు అంటున్నారు జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి