iDreamPost

పోలీసుల నిర్బంధంలో పవన్..

పోలీసుల నిర్బంధంలో పవన్..

సోమవారం రాత్రి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సోమవారం ఉదయంనుంచి మూడు రాజధానుల ఏర్పాటుపై పరిణామాలు ఏర్పడిన నేపథ్యంలో పవన్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు.

తన ఆదేశాలను ఖాతరు చేయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విషయమై పీఏసీలో చర్చించారు. ఈలోపు రాజధాని ఏరియాలో టీడీపీ ఆందోళనలు చేస్తున్న విషయం తెలియడం, ఇతర పార్టీలు ఆ ఉద్యమంలో పాల్గొనడం, రైతులు ఆందోళన చేస్తున్నారని సమాచారం రావడంతో పీఏసీ సమావేశం తర్వాత రాజధాని పర్యటనకు వెళ్ళాలని పవన్ భావించారు.అయితే ఇంటెలిజెన్స్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు జనసేన కార్యాలయం చుట్టూ భారీ బలగాలను మొహరించారు. పవన్ కల్యాణ్ కార్యాలయం దాటి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం నుంచి బయటికి వస్తే.. అదుపులోకి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు.

Read Also: చంద్రబాబు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పార్టీ సీనియర్లతో సమావేశాన్ని కంటిన్యూ చేశారు. పార్టీ కార్యాలయం చుట్టూ పోలీసులను మొహరించడంతో పార్టీ వర్గాలు అభ్యంతరం పెట్టాయి. ఇద్దరు డీఎస్పీలతో పాటు సిఐ, ఎస్.ఐ. ఇతర సిబ్బంది రావడంతో జనసేన ఆఫీసు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తనను పోలీసులు బయటికి రానివ్వరని అర్థమైన పవన్ కల్యాణ్ సోమవారం రాత్రి 9 గంటలకు మీడియాతో మాట్లాడాలనుకుని మీడియా కార్యాలయాలకు సమాచారమందించారు.

అంతకుముందు జరిగిన జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో రాజధాని మార్పు, అమరావతిగా రాజధాని కొనసాగింపు పోరాట కార్యాచరణ వంటి అంశాలపై ప్రధాన చర్చించారు. రాత్రి 9 గంటల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం అనంతరం జనసేన ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు. జనసేన అభిమానులు, కార్యకర్తలు తో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి అంశంలో అందరూ ఆందోళనలకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాజధాని ప్రజల పోరాటానికి జనసేన అండగా ఉంటుందన్నారు. తన పార్టీ కార్యాలయం లోకి‌ వచ్చి పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని, ప్రభుత్వం నియంతృత్వ ధోరణివల్ల అనేక‌మంది మనోవేదనతో ప్రాణాలు‌ విడుస్తున్నారన్నారు.

అమరావతి తరలింపు తాత్కాలికమేనని, పర్మినెంట్ రాజధాని అమరావతే అని తెలిపారు. ఆనాడు అన్ని వేల ఎకరాలు అవసరమా అని టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, అయినా వినకుండా‌ 33వేల ఎకరాలు తీసుకున్నారన్నారు.

Read Also: ప్రజలు గమనిస్తున్నారు మంత్రివర్యా..!

అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా అమరావతికి అంగీకరించారని, కానీ నేడు జగన్ ప్రతీకార రాజకీయాలు‌ చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రపై నిజంగా ప్రేమ ఉంటే..‌ తుఫాన్లు సమయంలో జగన్ ఏమయ్యారని ప్రశ్నించారు. రాజధాని‌ అంశం రాజకీయ లబ్దికోసమే వాడుతున్నారని,ప్రజలు, రాష్ట్రం పై జగన్ కు ప్రేమ లేదన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఉంటుందని, కేంద్ర పెద్దలతో కూడా కలిసి మాట్లాడతానన్నారు.

జగన్ మంచి‌ చేయడం లేదు కాబట్టే కేంద్రం అపాయింట్మెంట్ లు ఇవ్వడం లేదన్నారు. రాజధాని మారుస్తున్నాం.. టపాసులు కాల్చండి అని‌ చెప్పడానికి సిగ్గుండాలన్నారు. డిఐజి స్థాయి అధికారులును పంపి నన్ను అడ్డుకుంటున్నారు.జగన్ చేసేది తప్పు అని ఆయనతో‌ సహా అందరికీ తెలుసన్నారు. అందుకే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని,రైతులు ఏమైనా ఉగ్రవాదులా.. వారిపై లాఠీ‌ఛార్జి‌ చేస్తారా అని ఆగ్రహించారు. ఒక్క రాజధానికే దిక్కులేదు. ఇప్పుడు మూడు రాజధానులు కావాలా.. బ్రిటీష్ వాళ్లు విడగొట్టి పాలించు అనే తప్పుడు ధోరణిలో జగన్ ఉన్నారన్నారు. ఇటువంటి దౌర్జన్యాలు ను జనసేన ఆపుతుందన్నారు. అమరావతి ప్రజలకు జనసేన అండగా ఉంటుందని, టిడిపి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే కేసులు నమోదు‌చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

Read Also: చేతులెత్తి వేడుకుంటున్నా.. చంద్రబాబు

ఉత్తరాంధ్రలో ఇప్పుడు భూములన్నీ ఎవరి స్వాధీనం లో ఉన్నాయో అందరికీ తెలుసని, సచివాలయం తరలిస్తే.. ప్రజల సమస్యలు పరిష్కారానికే జనసేన స్థాపించానని, కులతత్వం, విభిన్నమైన‌ వర్గాల వివాదం పెరిగిపోతుందన్నారు. వీటికి చరమగీతం పాడాలనే బిజెపి తో పొత్తు పెట్టుకున్నామని,టిడిపి, వైసిపి వంటి పార్టీ లను ఎదుర్కొనే సత్తా జనసేన కు ఉందన్నారు. ఇన్నివేల మంది పోలీసుల ను పెట్టి రాజధాని ని తరలించాలని‌ చూస్తుందని,ఆడపడుచుల శాపం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా తగులుతుందన్నారు.

నేడు జగన్ తీసుకున్న నిర్ణయం వారి‌ వినాశనానికి పునాదులు వేసుకున్నారన్నారు. ఐదు కోట్ల ప్రజలు అమరావతిని అంగీకరించారు.. ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు.. మరి అప్పుడు జగన్ అమరావతి వద్దని ఏనాడైనా పోరాడారా అని ప్రశ్నించారు. జగన్ తన స్వార్దం‌ కోసం పోలీసు వ్యవస్థను కూడా దిగజార్చారంటూ పవన్ విమర్శలు గుప్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి