iDreamPost

బీజేపీ తో భేటీ తర్వాత రాజధానిపై పవన్ ఏమన్నారంటే..

బీజేపీ తో భేటీ తర్వాత రాజధానిపై పవన్ ఏమన్నారంటే..

రాష్ట్రంలో జనసేన బిజెపి పార్టీలు 2024 ఎన్నికల వరకు కలసి పని చెయ్యాలని ఇరు పార్టీలు ఒక అవగాహనకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీల సంయుక్త కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జనసేన బిజెపి కో ఆర్డినేషన్ భేటీ లో పాల్గొనడానికి నిన్న ఢిల్లీ కి జనసేన అధినేత పవన్ వచ్చారు. పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎపి కో-ఇంచార్జ్ సునీల్ దేవధార్ తో కలసి నిన్న పలువురు బిజెపి ప్రముఖులతో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులు జీవియల్ నరసింహారావు, పురందేశ్వరి తో కలసి ఆ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో భేటీ అయ్యారు. అనంతరం బయటకి వచ్చి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల ప్రతిపాదన సరికాదనే విషయాన్ని నడ్డా దృష్టికి తీసుకొచ్చామని, ఆయన కూడా ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారన్నారు. అయితే ఈ అంశాన్నిప్రధాని కి అమిత్ షా కి ముందుగానే తెలిపినట్టుగా వైసిపి ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టింస్తుందని ఆరోపించారు. వాస్తవానికి మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంభంధం లేదని పవన్ వ్యాఖ్యానించారు. నిన్నకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని కలసిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ రాజధానులకు, కేంద్రానికి సంబంధం లేదని, ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పుకొచ్చారు. అయితే రాజధాని మార్పునకు కేంద్రం సమ్మతి ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని అయితే అలాంటిదేమి లేదని,అసలు ఇందులో కేంద్రం జోక్యం లేదని అన్నారు.

అయితే నిన్నటివరకు అమరావతిని ఎవరు కదిలిస్తారో చూస్తాను, అమరావతి నుండి రాజధానిని అంగుళం కదిలించినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీతో పొత్తు కుదిరిన తరువాత తన స్వరంలో కొంత మార్పు రావడాన్ని గమనించవచ్చు. అమరావతి కేవలం చంద్రబాబు కోసమే అని గతంలో ప్రకటనలు చేసిన పవన్ తాజాగా అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం విశేషం. అయితే 2014 లో బిజెపి విజయం సాధించిన అనంతరం మొదటి సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ముఖ్య అతిధిల్లో ఒకరిగా కూర్చొన్న పవన్ కళ్యాణ్ కి మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తరువాత ఇప్పటివరకు ఎంత ప్రయత్నించినా కనీసం మోడీ దర్శన భాగ్యం కూడా లభించకపోవడం గమనార్హం. మళ్ళీ బిజెపి తో పొత్తు కుదిరిన నేపథ్యంలో మోడీ దగ్గరవుతారా.. లేదా. . వేచి చూడాలి.

ఈ నేపథ్యంలో తన ఢిల్లీ పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర రాజధానుల అంశంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుందని చెప్పవచ్చు. ఈ సందర్భంలో రాజధాని అంశం ఏమైనా ఉంటే కేంద్రం చూసుకుంటుంది కాబట్టి, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఎదుగుదామనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇకనైనా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజా సమస్యల విషయంలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే తన రాజకీయ భవిష్యత్ కి మంచింది. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తరుణంలో అమరావతి ప్రాంతంలో రైతులెదుర్కుంటున్న సమస్యలేమైనా ఉంటే వాటి పరిష్కారాలను ప్రభుత్వం దృష్టి కి తీసుకురావాల్సింది పోయి చంద్రబాబు తరహాలో రాజధాని ని ఇక్కడనుండి అంగుళం కూడా కదిలించదానికి వీలు లేదు, దానికి నేను ఒప్పుకోను అనే రీతిలో అర్థరహిత ఆవేశపూరిత ప్రకటనలు చెయ్యడం వల్ల పవన్ కళ్యాణ్ కి జనసేన కి కొత్తగా ఒరిగే రాజకీయ ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తే మంచింది. లేకపోతె 2019 లో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి