iDreamPost

ఆస్కార్ సినిమాకు మూలం మహాభారతం – Nostalgia

ఆస్కార్ సినిమాకు మూలం మహాభారతం – Nostalgia

ఈ ఏడాది ఆస్కార్ ఆవార్డుల బరిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది కొరియన్ చిత్రం ‘పారసైట్’.  ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే కాకుండా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఈ సినిమా అకాడమీ పురస్కారాలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సినిమా ఆస్కార్ విజేతగా నిలిచిన సమయం నుంచి ఈ సినిమాకు మూలం ఆ సినిమా అని ఈ సినిమా అని సోషల్ మీడియాలో భారతీయులు చర్చలు జరుపుతున్నారు.

తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులు ఈ సినిమాకు మూలం తమ అభిమాన హీరో నటించిన ‘మిన్సార కన్న’1999’ అంటున్నారు. ఇక తెలుగువారైతే శ్రీకాంత్, రవితేజ హీరోలుగా నటించిన ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ అని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాలలో కీలకమైన పాయింట్ మాత్రం ఒకటే. తమ ఐడెంటిటీని దాచి ఏదో ఒక కారణంతో కాలం గడపడం. ‘పారసైట్’ సినిమా విషయం తీసుకుంటే.. ఒక డబ్బున్న ఆసామి ఇంట్లో వేర్వేరు ఉద్యోగాలలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు చేరతారు. యజమాని కుమారుడు పుట్టిన రోజు ఆ ఇంట్లో పనిచేసిన పాత వంటమనిషి వస్తుంది. ఈ కుటుంబం అసలు సంగతి కనుక్కుంటుంది. మరోవైపు ఈ వంట మనిషికి సంబంధించిన రహస్యం హీరో కుటుంబానికి తెలుస్తుంది.  ఇంతలో అసలు యజమాని కుటుంబం ఇంటికి రానుందని ఫోన్ వస్తుంది. ఇక తికమక హంగామా షురూ.

ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు వచ్చిందంటేనే ఇలాంటి కథ ఎక్కడ కూడా రాలేదని అనుకోవాలి. అయితే తమ ఐడెంటిటీని దాచిపెట్టి ఒక కుటుంబం ఇలా ప్రవర్తించడం అనే పాయింట్  చాలా సినిమాల్లో ఉండే అవకాశం ఉంటుంది.  అయితే ఈ పాయింట్ కు మూలం మాత్రం మహాభారతం లోని విరాటపర్వంలో పాండవులు విరాటరాజు కొలువులోని అజ్ఞాతవాస ఘట్టమేనని సోషల్ మీడియాలో కొందరు విశ్లేషిస్తున్నారు. ద్రౌపదితో సహా పాండవులు అందరూ తమ పేర్లను, వృత్తులను మార్చుకుని మరీ ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు.  నిజానికి ఈ ‘పారసైట్’ లోని బేసిక్ స్టోరీ లైన్ ఈ విరాట పర్వం ఎపిసోడ్ నుంచి ప్రేరణగా తీసుకున్నదేనని మన నెటిజన్లు తేలుస్తున్నారు. ఇక మిన్సార కన్నలు కన్సార మిన్నలు అంటారా..అవి కూడా అక్కడ నుంచి ‘ప్రేరణే’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి