iDreamPost

ప్చ్‌.. మిస్సైంది..

ప్చ్‌.. మిస్సైంది..

ఇదే సరైన సమయం. కానీ మంచి అవకాశం చేజారింది. సీటు మనకు వచ్చుంటే గెలుపు పక్కాగా మనదే. గ్రామ సచివాలయం ప్రారంభం మొదటి సర్పంచ్‌ను నేనే అయ్యుండేవాడిని. ఇప్పుడు ఏం చేద్దాం. మన తరఫున ఎవరిని నిలబడెదాం. అతను మన మాట వింటాడా..? గెలిచాక అడ్డం తిరగడు కదా.?!. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశానువాహుల్లో జరగుతున్న చర్చ.

పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీ చేద్దామనుకున్న వారి కలలు కళ్లలయ్యాయి. రిజర్వేషన్లు ఖారారు తర్వాత మండలంలో ఏ పంచాయతీ ఎవరికి వచ్చిందో తెలియడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనగా ఆయా సామాజిక వర్గాల్లో పదవికి పోటీ చేద్దామనుకున్న వారు మాత్రం నిరుత్సాహానికి లోనవతున్నారు.

పంచాయతీ, ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖారారు చేస్తూ అధికారులు మొదటి ఒక జాబితా విడుదల చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో 1వ సాధారణ ఎన్నికలంటూ అధికారులు రిజర్వేషన్లు ఫైనల్‌ చేశారు. ఆ లిస్టు బయటకు రావడంతో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గం వారికి వచ్చిందో తెలిసింది. ఫలానా వ్యక్తి సర్పంచ్‌ అభ్యర్థి అని నిర్ణయాలు కూడా జరిగాయి. ముందు నుంచి సర్పంచ్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న వారిలో సంతోషం నెలకొంది.

ఈ సంతోషం రెండు రోజులు కూడా నిలవలేదు. రిజర్వేషన్ల జాబితాను తిరిగి తయారు చేయాల్సి వచ్చింది. 1994 పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ఇప్పటి వరకు నాలుగు సార్లు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరగబోయేవి 5వ సాధారణ ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఐదో సాధారణ ఎన్నికలలుగా పరిగణలోకి తీసుకుని రోటేషన్‌ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని పంచాయతీ రాజ్‌ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రోటేషన్‌ విధానం అమలు చేయడంతో అంతకు ముందు ఖరారు చేసిన జాబితాకు పూర్తి భిన్నంగా పంచాయతీ సర్పంచ్‌ రిజర్వేషన్లు మారిపోయాయి.

మొదటి సాధారణ ఎన్నిలంటూ రూపొందించిన జాబితాలో అన్‌రిజర్వ్‌డ్‌ వచ్చిన పంచాయతీ తర్వాత ఐదో సాధారణ ఎన్నికలంటూ తయారు చేసిన జాబితాలో ఆదే పంచాయతీ ఎస్సీలకు రిజర్వ్‌ అయింది. ఇలానే అన్ని పంచాయతీల రిజర్వేషన్లు తారుమారయ్యాయి. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు కూడా ఇలానే మారిపోయాయి. దీంతో ఆశానువాహులు నిరాశ చెందుతున్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, సంక్షేమ పథకాలు అర్హత ఆధారంగా ఇస్తుండడంతో పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరుమీద నడకేనని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు ఆ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అన్‌ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ముగ్గురు నలుగురు సర్పంచ్, ఎంపీటీసీ సీటు కోసం పోటీ పడుతున్నారు.

గడచిన అంసెబ్లీ ఎన్నికల్లోనూ, అంతక ముందు 9 ఏళ్లుగా పార్టీ కోసం ఆర్థికంగా ఖర్చు పెట్టుకుని పని చేసిన వారు సర్పంచ్, లేదా ఎంపీటీసీ పదవికి పోటీ చేయాలని భావించారు. రిజర్వ్‌ అయిన స్థానాల్లో తమకు అనుకూలమైన వారిని బరిలోకి దింపి వారు మాత్రం వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వార్డు సభ్యుడిగా గెలిచి పంచాయతీ ఉప సర్పంచ్‌ పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయా వార్డుల్లో గెలుపు గుర్రాలకు సీట్లు ఇచ్చి గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 12918 పంచాయతీలు ఉండగా కొత్తగా మరికొన్నింటిని ఇటీవల ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 13,066కు చేరింది. ఆయా పంచాయతీల్లో 1,33,726 వార్డులున్నాయి. 10,148 ఎంపీటీసీలు, 660 జడ్పీటీసీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం వెరసి 58.85 శాతం పదవులు ఆయా సామాజికవర్గాలకు రిజర్వ్‌ చేశారు. మిగిలిన 40.15 పదవులు అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో ఉన్నాయి. మొత్తం పదవుల్లో 50 శాతం ఆయా సామాజిక వర్గాల మహిళలకు రిజర్వ్‌ చేశారు.

రిజర్వేషన్ల జాబితాను రూపాందించిన అధికారులు ఇంకా వాటిని అధికారికంగా ప్రకటించలేదు. అయినా సమాచారం బయటకు రావడంతో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్‌ అయిందో తెలియడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి