iDreamPost

పంచాయతీ ఎన్నికలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పంచాయతీ ఎన్నికలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినూత్నమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళుతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. పరిపాలనా పరంగా అనేక సంస్కరణలకు నాంది పలికిన సీఎం వైఎస్‌ జగన్‌ తాజాగా ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నగదు, తాయిలాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే తన లక్ష్యమని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఆ దిశగా తొలి అడుగు వేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఎన్నికల సంస్కరణలకు పునాది వేస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియ కాలం ఎక్కువగా ఉంటే.. పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలం తగ్గితే తదనుగుణంగా ఖర్చు తగ్గుతుంది. ఇందుకు సంబంధించి పంచాయతీ రాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. దాని గడువు ముగియడంతో ఆగస్టులో మరో ఆర్డినెన్స్‌ జారీ చేశారు. అయితే గడువులోపు దాన్ని అసెంబ్లీ ఆమోదించకపోడంతో తాజాగా బిల్లు తెస్తున్నారు. దీనికి నిన్న మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు చట్ట రూపం రానుంది.

ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 21 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఆగస్టులో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలను 21 రోజుల్లో నిర్వహిచారు. పంచాయతీ రాజ్‌ చట్టానికి తాజాగా చేసిన సవరణతో 14 రోజుల్లోనే పంచాయతీ పోరు పూర్తికానుంది.

14 రోజులు.. ఏ రోజు ఏమిటి..?

1వ రోజు : ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

3వ రోజు : నామినేషన్ల స్వీకరణ

5వ రోజు : నామినేషన్ల స్వీకరణకు తుది గడువు

6వ రోజు : నామినేషన్ల తిరస్కరణ, అభ్యంతరాల స్వీకరణ

8వ రోజు : అభ్యంతరాల పరిష్కారం

9వ రోజు : నామినేషన్ల ఉపసంహరణ.. తుది అభ్యర్థుల ప్రకటన

14వ రోజు : పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి