iDreamPost

టీచర్ నుంచి ఉపముఖ్యమంత్రి వరకు…

టీచర్ నుంచి ఉపముఖ్యమంత్రి వరకు…

పాముల పుష్ప శ్రీవాణి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అవసరం లేదు.. ముప్ఫై రెండు సంవత్సరాల వయసులోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన గిరిపుత్రిక పుష్ప శ్రీవాణి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక కేవలం అదృష్టం మాత్రమే కాదు.. భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు తోడ్పాటు, స్వయం కృషి ఉంది.

పశ్చిమగోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామానికి చెందిన పుష్ప శ్రీవాణి పదవ తరగతి దాకా స్థానిక గిరిజన పాఠశాలలోనే చదువుకున్నారు. బిఎస్సీ బిఇడి చేసి కొంతకాలం పాటు తాను చదువుకున్న గిరిజన పాఠశాలలోనే టీచర్ గా కూడా పని చేసారు. వివాహానంతరం భర్త సొంత నియోజకవర్గం జిల్లా కురుపాం నుంచి 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

రాజకీయాలు కొత్తయినా ప్రతిపక్షం లో ఉండి కూడా సమర్ధవంతంగా పని చేశారు. రాజకీయాలలో లొసుగులు పట్టుకుని సవాళ్ళను అధిగమించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ, ప్రతి గడపకూ తిరిగిన శ్రీవాణి ప్రజల్లో మంచి పట్టు సాధించారు.

పూర్తిగా వెనుకబడిన కురుపాం నియోజకవర్గంలో అడుగడుగునా కనిపించే సమస్యలు, వాటి పరిష్కారానికి సహకరించని అధికారులు, అన్నిచోట్లా అడ్డుతగిలే అధికారపక్షం నేతలు కొంత ఇబ్బంది పెట్టినా భయపడలేదు. మండల, జడ్పీ, జిల్లా అభివృద్ధి సమావేశాల నుంచి అసెంబ్లీ సమావేశాల దాకా అవకాశం ఉన్న ప్రతి చోట కురుపాం ప్రజల గొంతును వినిపించాలని ప్రయత్నించారు. అందుకే 2019 లో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అవకాశం చేజిక్కించుకున్నారు.

టీడీపీ నాయకత్వం పుష్ప శ్రీవాణి ని ఎలాగైనా వైసీపీ నుంచి టీడీపీలోకి రప్పించుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఆమె కుటుంబానికే చెందిన సొంత మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, పెద్దమామ శత్రుచర్ల విజయరామరాజు అప్పట్లో టీడీపీలోనే కొనసాగుతుండగా వారి ద్వారా కుటుంబంలోనూ తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చింది. అయితే ఇవేవీ కూడా పుష్ప శ్రీవాణి విశ్వసనీయతను సడలించలేకపోయాయి. తన ఊపిరి ఉన్నంతకాలం తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగానే ఉంటానని, కట్టె కాలేదాకా వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రజల మధ్య ప్రకటించడమే కాకుండా వైయస్ పట్ల తనకున్న ప్రేమాభిమానాలు శాశ్వతంగా నిలిచిపోయేలా తన మణికట్టుపై వైయస్సార్ అనే పచ్చబొట్టును కూడా వేయించుకున్నారు.

అబ్బురపర్చిన గుండెనిబ్బరం..

ఏప్రిల్ 5, 2019: సమయం ఉదయం10:55 గంటలు
కురుపాంలో నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న పుష్ప శ్రీవాణికి ఆమె చెల్లి వైజాగ్ నుంచి ఫోన్ చేసింది. ‘‘ అక్కా.. అమ్మ పరిస్థితి ఏమీ బాగాలేదు.. వెంటనే నువ్వు బయల్దేరి రా..’’ అంటూ ఒక్క ముక్క మాట్లాడిపెట్టేసిన చెల్లి గొంతులోని ఆందోళనతో ఆమె మనసుకీడు శంకించింది. ఆ ఊళ్లో ప్రచారం ముగించుకొని వెంటనే వైజాగ్ కు బయల్దేరింది.. ఏదో జరగరానిదే జరిగిందని ఆమె అంతరంగం చెబుతుండటంతో ఇక ఆగలేక తన బావకు ఫోన్ చేసారు పుష్ప శ్రీవాణి.

‘‘అమ్మ మనకింక లేదమ్మా..’’ అని ఆయన అసలు విషయం చెప్పేశాడు. ఆఖరుసారిగా తనను చూడాలన్న అమ్మ చివరి కోరికను తీర్చలేకపోయాననే బాధ ఆమె గుండెలను మెలిపెట్టింది. అమ్మ అంత్యక్రియలు ముగిసిన తరువాతపుట్టెడు దు:ఖంతో పుష్ప శ్రీవాణి కురుపాంకు తిరిగొచ్చారు. 

ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనున్న తరుణంలో దు:ఖంతో ఇంట్లో కూర్చోవటం అంటే చేచేతులా విజయాన్ని వదులుకోవడమే అవుతుంది.. అప్పటివరకూ అందరూ పడిన కష్టమంతా బూడిదపాలవుతుంది. అది గ్రహించిన పుష్ప శ్రీవాణి తన గుండెల్లో మండుతున్న బాధను అదిమిపట్టి మళ్లీ ఎప్పటిలాగే ఎన్నికల ప్రచారంలోకి దూకారు.. తన ముఖంలో ఎప్పుడూ కనిపించే చిరునవ్వును తిరిగి తెచ్చుకున్నారు.. కార్యకర్తలను ఉత్తేజపరిచారు..

అందరి కంటే తానే ముందు నడిచారు..

ప్రచారం గడువు ముగిసిపోతున్న చివరి నిమిషంలో కార్యకర్తలందరినీ ఉత్సాహపర్చడానికి ‘‘ గిరా..గిరా.. తిరుగుతుంది ఫ్యానూ, అయ్యా.. నేను వైయస్సారు ఫ్యానూ..’’ అనే పాటకు అందరితో కలిసి డ్యాన్స్ చేసారు. ఆ రోజున ఆమె ఇచ్చిన ఆ ఉత్సాహంతో కార్యకర్తలు పోలింగ్ లో విపక్షం దుమ్ముదులిపి రెట్టింపు మెజార్టీని తీసుకొచ్చారు. గిరా..గిరా తిరుగుతుంది ఫ్యానూ అనే పాటకు పుష్ప శ్రీవాణి అందరితో కలిసి స్టెప్పులేసిన వీడియో యూబ్యూబ్ లో ఇప్పటికీ ఉంది.

ప్రజలతో మమేకం.. పరిష్కారాలు అనేకం..

ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్విరామంగా పని చేసినా, వస్తున్న ప్రజలను కలుసుకుంటున్నా, గ్రామాలు తిరుగుతున్నా ముఖంలో ఉండే చిరునవ్వు, ప్రసన్నత చెరగకపోవడం పుష్ప శ్రీవాణి ప్రత్యేకత.. ఈ ప్రత్యేకతే ఆమెను ప్రతి ఒక్కరూ తమ కష్టాలను తీర్చే ఆత్మబంధువుగా భావించడానికి కారణమైయింది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా తనను కదిలించిన ఏ సమస్య అయినా పరిష్కారమయ్యేవరకూ తనకు ప్రశాంతత ఉండదు. చేస్తానని చెప్పిన హామీ నెరవేర్చేదాకా వదిలిపెట్టరు..

ఇదంతా ఎవరో సన్నిహితులు చెప్పేమాటలు కాదు.ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికలలో 19,083 ఓట్ల మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా పుష్ప శ్రీవాణి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆమె మెజార్టీ 19 వేల ఓట్ల నుంచి 26 వేల ఓట్లకు పెరిగింది.

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల చుట్టూ, వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులనే ప్రజల వద్దకు తీసుకెళ్లి వారితో ముఖాముఖి సమావేశాలను నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పనితీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. విజయనగరం జిల్లాలోని కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం తదితర మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండగా మారుమూలన ఉన్న గిరిజన గ్రామాలకు అధికారులు ఎప్పుడోగానీ వెళ్లని పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగానే గిరిజన ప్రాంతాల్లో కొన్ని చిన్న సమస్యల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోంది.

అలాగే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో వార్తాపత్రికలు చదివి, టీవీల్లో వార్తలు చూసి సమాచారం తెలుసుకొనే అవకాశాలు తక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకాలు, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా తెలియక అర్హత కలిగిన పేదలు కూడా నష్టపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేసిన రచ్చబండ కార్యక్రమం స్ఫూర్తతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా అధికారులనే ప్రజల వద్దకు తీసుకెళ్లి అటు ప్రజలకూ, ఇటు అధికారులకూ మధ్య సంధానకర్తగా తాను వ్యవహరించే ‘‘ప్రజలతో ముఖాముఖి’’ కార్యక్రమానికి పుష్ప శ్రీవాణి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి