iDreamPost

పాక్​కు భారత సర్కారు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్​కు వస్తున్న దాయాది జట్టు!

  • Author singhj Published - 01:20 PM, Tue - 26 September 23
  • Author singhj Published - 01:20 PM, Tue - 26 September 23
పాక్​కు భారత సర్కారు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్​కు వస్తున్న దాయాది జట్టు!

క్రికెట్​లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వన్డే వరల్డ్ కప్ మహాసంగ్రామం ఆరంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఈసారి కప్ ఎలాగైనా నెగ్గాలని అన్ని జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచ కప్​ బహుశా 50 ఓవర్ల ఫార్మాట్​లో చివరిదని అంటున్నారు. టీ20 క్రికెట్​ హవా నడుస్తుండటం, వన్డేలకు ఆదరణ తగ్గుతుండటం.. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా పొట్టి ఫార్మాట్​దేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రపంచ కప్​ను కైవసం చేసుకోవాలని టాప్ టీమ్స్ సమాలోచనలు చేస్తున్నాయి. దాయాది పాకిస్థాన్ కూడా భారత గడ్డ మీద జరిగే మెగా టోర్నీలో విన్నర్​గా నిలవాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో భారత్​కు వచ్చేందుకు సిద్ధమైన పాక్​ జట్టుకు వీసా సమస్య ఎదురైన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టుకు వీసా సమస్య తీరింది. వరల్డ్ కప్​ కోసం వచ్చే పాక్ టీమ్​కు లైన్ క్లియర్ అయింది. ఆ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత వీసాలు మంజురైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్థారించింది. పాకిస్థాన్ బృందానికి వీసాలు ఇచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. 48 గంటల్లో భారత్​కు బయల్దేరాల్సి ఉన్నా తమ వీసాలు మంజూరు కాకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సోమవారం పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది.

పాక్ జట్టు వీసాల విషయంలో సోమవారం సాయంత్రానికి పరిస్థితి చక్కబడింది. ప్రపంచ కప్​కు ముందు దుబాయ్​లో రెండ్రోజుల పాటు తమ టీమ్​కు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని పీసీబీ ప్లాన్ చేసింది. అయితే వీసా సమస్య కారణంగా దీన్ని రద్దు చేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం లాహోర్ నుంచి బయల్దేరే పాకిస్థాన్ జట్టు దుబాయ్ మీదుగా సాయంత్రానికి నేరుగా హైదరాబాద్​కు చేరుకుంటుంది. దాయాది జట్టు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్​తో తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి