iDreamPost

భారత్​లోకి చొచ్చుకొచ్చిన పాకిస్థాన్ విమానం.. ఆ 3 రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతూ..!

  • Author singhj Published - 06:45 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 06:45 PM, Sat - 29 July 23
భారత్​లోకి చొచ్చుకొచ్చిన పాకిస్థాన్ విమానం.. ఆ 3 రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతూ..!

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గురించి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేని విషయం విదితమే. సరిహద్దుల్లో నిత్యం కాల్పులకు దిగుతూ భారత సైన్యాన్ని పాక్ ఎప్పుడూ రెచ్చగొడుతూనే ఉంది. ఇండియా కూడా బోర్డర్​తో పాటు ఏకంగా వారి దేశంలోనే వారిని చిత్తు చేసొచ్చింది. అయినా పాక్ బుద్ధి మారడం లేదు. భారత్-పాక్ బోర్డర్ చాలా సున్నితమైన ప్రాంతంగా మారిపోయింది. ఈ సరిహద్దులో ఎలాంటి కదలికలు వచ్చినా ఇరు దేశాల సైనికులు వెంటనే అప్రమత్తమైపోతారు. కొన్నాళ్లుగా పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా జరుగుతున్న డ్రగ్స్, ఆయుధాల సరఫరాను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అడ్డుకుంటూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక పాకిస్థాన్​ విమానం భారత భూభాగంలోకి ప్రవేశించడం హాట్ టాపిక్​గా మారింది. ఇండియాలోకి చొచ్చుకొచ్చిన దాయాది దేశ విమానం 3 రాష్ట్రాల్లో గంటకు పైగా సమయం చక్కర్లు కొట్టింది. అయితే ఈ ఘటన మీద భారత వైమానిక దళం అధికారులు స్పందించారు. శుక్రవారం నాడు సాయంత్రం 4.30 గంటలకు పాక్​లోని కరాచీ నుంచి పీఐఏ-308 అనే ప్యాసింజర్ ఫ్లైట్ ఇస్లామాబాద్​కు బయల్దేరింది. అయితే అది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. దీంతో ఫ్లైట్ వెళ్లాల్సిన రూట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత సాయంత్రం 5.20 గంటలకు భారత్​లోకి ప్రవేశించింది.

పాక్ విమానం ఒక గంటకు పైగా భారత గగనతలంపై ఎగిరింది. రాజస్థాన్​తో పాటు హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించింది. చివరికి సాయంత్రం 6.14 గంటలకు తిరిగి పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్​ఫోర్స్ అధికారులు స్పందిస్తూ.. ప్రతికూల వాతావరణం కారణంగా అప్పుడప్పుడూ ఇలా పౌర విమానాలు దారి తప్పడం మామూలేనన్నారు. దారి తప్పిన విమానాలు సేఫ్ రూట్ కోసమే ఇలా వస్తాయని తెలిపారు. ఈమధ్య కాలంలో కొన్ని భారత విమానాలు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి