iDreamPost

భారత్ నుంచి ఆస్కార్​ బరిలో ‘2018’.. ఈ మూవీ ఎందుకంత స్పెషల్?

  • Author singhj Published - 03:29 PM, Wed - 27 September 23
  • Author singhj Published - 03:29 PM, Wed - 27 September 23
భారత్ నుంచి ఆస్కార్​ బరిలో ‘2018’.. ఈ మూవీ ఎందుకంత స్పెషల్?

ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డులను అత్యుత్తమ పురస్కారాలుగా చెప్పుకుంటారనేది తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, టెక్నీషియన్స్​ అందరికీ ఈ అవార్డు గెలుచుకోవాలని ఉంటుంది. కానీ అదంత సులువు కాదు. ఒక్కోసారి బెస్ట్ మూవీ, బెస్ట్ టెక్నీషియన్స్, యాక్టర్స్​కు కూడా అవార్డులు రాని సందర్భాలు ఉన్నాయి. దీన్ని బట్టే అక్కడ కాంపిటీషన్ ఏ రేంజ్​లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్ అవార్డులపై భారతీయుల్లోనూ ఎన్నో ఆశలు ఉన్నాయి. మన దేశం నుంచి వెళ్లే చిత్రాలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వస్తే బాగుంటుందని కోరుకోవడం మామూలే. కానీ ఈ విషయంలో ప్రతిసారి మనకు నిరాశే ఎదురవుతోంది. కానీ 95వ ఆస్కార్ అవార్డుల్లో మన దేశానికి రెండు అవార్డులు వచ్చాయి.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సాంగ్​ను అవార్డు వరించింది. ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే భారత డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా ఆ పురస్కారాలపై అందరి దృష్టి నెలకొంది. ఆస్కార్-2024 అవార్డుల కోసం మన దేశం నుంచి మలయాళం బ్లాక్​బస్టర్ ‘2018’ అధికారికంగా ఎంపికైంది. ‘బలగం’, ‘జ్విగాటో’ లాంటి సినిమాలను కాదని ఈసారి భారత్ నుంచి ఆస్కార్ రేసులో నిలిచింది ‘2018’. వచ్చే సంవత్సరం ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘2018’ని సెలెక్ట్ చేశారు.

ఆస్కార్​ అవార్డుపై గురిపెట్టిన ‘2018’ మూవీలో అసలు ఏం ఉంది? ఈ సినిమా ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ ఫిల్మ్​ను డైరెక్ట్ చేశారు. 2018లో కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న స్టోరీతో ఈ సినిమాను తీశారు. మొదటి నుంచి చివరి వరకు ఎమోషనల్​గా సాగే ఈ సినిమా మలయాళంతో పాటు ఇతర భాషల ఆడియెన్స్​ను కూడా కన్నీళ్లు పెట్టించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు లాభం తీసుకొచ్చింది.

‘2018’ ఫస్టాఫ్ వరకూ ఇదొక నార్మల్ మూవీనే. కానీ ఒక దశలో వచ్చీపోయే బోలెడన్నీ క్యారెక్టర్స్​తో అసలు ఇది ఎవరి కథ? ఇందులో ఏమేం చూపిస్తున్నారనే సందేహాలు వస్తాయి. కానీ ఒక్కసారి ఆ క్యారెక్టర్స్ వరల్డ్​ను ఆడియెన్స్​ మనసులకు దగ్గర చేశాక.. మెయిన్ స్టోరీ మొదలవుతుంది. ఒకేసారి వచ్చే ఎమోషన్​తో ప్రేక్షకుల్ని డైరెక్టర్ ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఆ వరదల్లో మనమే చిక్కుకుపోయామా అనుకేంత పకడ్బందీగా డైరెక్టర్ సీన్స్​ తీశాడు. ఒక క్యారెక్టర్​తో మరో క్యారెక్టర్​ను కనెక్ట్ చేస్తూ వెళ్లిన దర్శకుడు.. వాటిని వరదల్లో చిక్కుకొని నిస్సహాయ స్థితిలో చూపించడం ద్వారా ప్రేక్షకుల హృదయాలు బరువెక్కేలా చేశాడు.

‘2018’ మూవీని న్యాచురల్​గా తీయడానికి డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. ప్రతి సీన్​లోనూ సహజత్వం ఉట్టిపడేలా ఎంతగానో శ్రమించాడు. ఆయనకు మిగిలిన టెక్నీషియన్స్ చక్కటి సహకారం అందించారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా టాప్ రేంజ్​లో ఉన్నాయి. ఒకరకంగా అవి సినిమాకు ప్రాణం పోశాయి. వరదల నేపథ్యంలో వచ్చే సీన్స్ కెమెరామెన్ పనితనానికి అద్దం పడతాయి. సెకండాఫ్​లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల హృదయాల్ని కదిలించి కన్నీళ్లు పెట్టిస్తాయి. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే ఫలానా యాక్టర్ బాగా చేశాడని చెప్పలేం. ఎందుకంటే, క్యారెక్టర్స్ తప్ప యాక్టర్స్ ఎవరూ ఇందులో కనిపించరు. అంతగా వాళ్లు తమకు ఇచ్చిన క్యారెక్టర్స్​లో ఒదిగిపోయారు. మరి.. ఆడియెన్స్​ను ఎమోషన్స్​తో కట్టిపడేసి, కన్నీళ్లు పెట్టించిన ‘2018’ చిత్రానికి ఆస్కార్ వస్తుందనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రభాస్​ సర్జరీ సక్సెస్.. షూట్​లో జాయిన్ అయ్యేది అప్పుడేనట!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి