iDreamPost

చంద్రబాబు కరోనా సందేశం.. సోషల్‌ మీడియా సెటైర్లు..

చంద్రబాబు కరోనా సందేశం.. సోషల్‌ మీడియా సెటైర్లు..

  ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కరోనాపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో సందేశం ఇచ్చారు. ప్రభుత్వాలెన్ని చేసినా.. మన జాగ్రత్తలో మనం ఉండాలంటూ ఆయన సూచించారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నెటిజన్లు చంద్రబాబును తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి భయాందోళనలు నెలకొన్న వేళ శనివారం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని వారి స్వగృహానికి చేరుకున్నారు. జనతా కర్ఫ్యూ కూడా వారు అక్కడ నుంచే పాటించారు. తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ రోజు చంద్రబాబు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు.. ఎక్కడ రాజీ పడినా చాలా ప్రమాదం వస్తుందన్నారు. సమాజ హితం కోసం, మన భద్రత, మన బిడ్డల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ స్వియ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.

చంద్రబాబు ఇలా వీడియో విడుదల చేశారో లేదో సోషల్‌ మీడియాలో చంద్రబాబు, ఆయన కుమారుడిపై సెటైర్లు పడుతున్నాయి. ఏపీ ప్రజలు ఆపత్కాలంలో ఉంటే బాబు గారు రాష్ట్రాన్ని వదిలేసి హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శిస్తున్నారు. రాజకీయాలు ఏపీలో.. నివాసం తెలంగాణలోనా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ఎప్పుడు విపత్తు వచ్చినా.. చంద్రబాబు హైదరాబాద్‌కు జారుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గత ఏడాది వరదల సీజన్‌లో కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు కుటుంబం అంతా హైదరాబాద్‌కు వెళ్లిపోయిందని గుర్తు చేస్తూ మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా విజయవాడలో సొంత ఇళ్లు నిర్మించుకోవాలని పలువురు సలహాలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకోలేదు. విభజన తర్వాత రాష్ట్రానికి మొదటి సీఎం చంద్రబాబే అయినా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. కృష్ణా నది కరకట్ట వెంబడి నదిని ఆనుకుని ఉన్న లింగమనేని రమేష్‌ గెస్ట్‌ హౌస్‌నే తన నివాసంగా మార్చుకున్నారు. మరో వైపు వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

2019 సాధారణ ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు సొంత ఇళ్లు అంశం కేంద్రంగా రాజకీయాలు నడిచాయి. చంద్రబాబుకు రాజధానిలో ఇళ్లు లేదని, ఇలాంటి వ్యక్తి అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని వైసీపీ విమర్శలు సంధించింది. జూన్, జూలైలో వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్‌లోకి నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో ఆయన హైదరాబాద్‌ వెళ్లారు. వరదలు తగ్గాక తిరిగి వచ్చారు. ఇప్పుడు కరోనా వైరస్‌ సాకుతో ఏపీని వదిలి హైదరాబాద్‌కు వెళ్లారనే నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి