iDreamPost

ఒక‌రోజు ఫొటోల ఖ‌రీదు రూ.5 ల‌క్ష‌లు

ఒక‌రోజు ఫొటోల ఖ‌రీదు రూ.5 ల‌క్ష‌లు

మ‌న‌కు ఇష్ట‌మైన దృశ్యాన్ని శాశ్వ‌తంగా బందించ‌డ‌మే ఫొటో. సెల్‌ఫోన్లు వ‌చ్చి ఫొటోకి విలువ లేకుండా పోయింది. ఒక‌ప్పుడు ఫొటో అంటే చాలా పెద్ద‌ప‌ని. స్టూడియోకి వెళ్లి, అక్క‌డ అద్దంలో త‌ల దువ్వుకుని, పౌడ‌ర్ పులిమి మ‌న‌కి కావాలంటే కోటు, టై కూడా స్టూడియోలోనే ఇచ్చేవారు. టిప్‌టాప్‌గా త‌యారై కూర్చుంటే, ఒక‌టికి నాలుగుసార్లు రెడీ అని చెప్పి, స్మైల్ అని అరిచి, పెద్ద‌పెద్ద లైట్లు వేసి కెమెరామ‌న్ న‌ల్ల‌టి దుప్ప‌టిలోకి దూరి క్లిక్‌మ‌నిపించేవాడు.

ఆ త‌ర్వాత వారం రోజులు స్టూడియో చుట్టూ తిప్పి, ఒక అట్ట‌ముక్క‌కి అతికించిన ఫొటోను ఇచ్చేవాడు. ఫ్రేమ్ క‌ట్టించుకోవాలంటే ఖ‌ర్చు అద‌నం.

పెళ్లిళ్లు జ‌రిగితే కాస్తా ఉన్న‌వాళ్లు అయితే ఫొటోగ్రాఫ‌ర్‌ని ర‌ప్పించుకునేవాళ్లు. మామూలు మ‌నుషుల‌కి జ్ఞాప‌కాలే ఫొటోలు. పెళ్లి ఆల్బ‌మ్ కొంత కాలం పాటు ఇంటికి ఎవ‌రొచ్చినా చూపిస్తారు. కాపురం పాత‌ప‌డే కొద్దీ ఆల్బ‌మ్ అల్మారాలోకి వెళ్లిపోయేది.

సొంతంగా కెమెరాలుంటే , రీల్ కొనుక్కుని ఫొటోలు తీసుకున్న త‌ర్వాత దాన్ని ల్యాబ్‌లో ఇచ్చి ప్రింట్స్‌ వేయించుకోవ‌డం అదో పెద్ద‌ప‌ని. ఒక‌ప్పుడు బ్లాక్ అండ్ వైటే. మ‌న తాత‌లు అమ్మ‌మ్మ‌లు న‌లుపు తెలుపు రంగుల్లోనే గోడ‌ల‌కి వేలాడేవాళ్లు. క‌ల‌ర్ రావ‌డం బాగా ఆల‌స్యం. ఇప్పుడు అస‌లు బ్లాక్ అండ్ వైట్ లేనేలేదు.

ఇపుడు కొత్త విష‌యం ఏమంటే పెళ్లికి ముందు వెడ్డింగ్ షూట్‌కి లక్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నారు. అబ్బాయి, అమ్మాయి ఒక పెద్ద టీంతో గోవా, మ‌నాలి వెళ్లిపోతున్నారు. కొంద‌రైతే ల‌డ‌క్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఫొటోగ్రాఫ‌ర్ల టీంకి ఖ‌ర్చుల‌న్నీ భ‌రించి రోజుకు రూ.ల‌క్ష నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లిస్తున్నారు.

చిన్న ఊళ్ల‌ల్లో కూడా సంగీత్‌, బ్యాచిల‌ర్ పార్టీలు న‌డుస్తున్న‌ట్టూ ఈ ఫొటోల పిచ్చి ఇపుడు అంద‌రికీ సోకింది. ఆశ్చ‌ర్యం ఏమంటే పెళ్లి Eventsకి ల‌క్ష‌ల ఖ‌ర్చు చేస్తున్న జంట‌లు , ఆరు నెల‌ల‌కే బోర్ కొట్టి విడిపోయి విడాకులు తీసుకుంటున్నారు.

ఆల్బ‌మ్ పాత ప‌డ‌క ముందే , పెళ్లి కోర్టు మెట్లు ఎక్కుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి