iDreamPost

మైత్రి మీద ఐటి దాడులు – పరిశ్రమలో హాట్ టాపిక్

మైత్రి మీద ఐటి దాడులు – పరిశ్రమలో హాట్ టాపిక్

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం మీద ఐటీ అధికారులు దాడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరో నెల రోజుల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ఇవి జరగడం గమనార్హం. మొన్నే స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెట్టి కార్యకలాపాలు షురూ చేస్తుండగానే ఇలా జరగడం మరో ట్విస్ట్. పది మందితో కూడిన అధికారుల బృందం, జిఎస్టి ఆఫీసర్లు క్షుణ్ణంగా తనిఖీలు జరిపి ఇన్కమ్ టాక్స్ దాఖలుకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను పరిశీలనకు తీసుకున్నట్టు సమాచారం.

మైత్రి ఏ ప్రొడక్షన్ హౌస్ లేనంత బిజీగా సినిమాల నిర్మాణం చేపట్టింది. చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే సుమారు రెండు వందల యాభై కోట్ల దాకా అయ్యిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఖుషి, నిన్నే ప్రారంభోత్సవం జరుపుకున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ ఒకేసారి తెరకెక్కుతున్నాయి. పుష్ప 2 రెగ్యులర్ షూట్ రేపటి నుంచి హైదరాబాద్ లో జరగనుంది. జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో, రామ్ చరణ్ సుకుమార్ ల సినిమాలు ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయి. భవిషత్తులో ప్రభాస్ తో ప్రాజెక్టు కెని మించే ప్యాన్ ఇండియా మూవీ తీసే ప్లాన్ ఉన్నట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. ఈలోగా ఇలా దాడుల ప్రహసనం.

మైత్రి సిబ్బంది పూర్తిగా సహకరించి అన్ని వివరాలు అందజేయడంతో ప్రస్తుతం ఐటి టీమ్ వాటిని పరీక్ష చేసే పనిలో ఉంది. ఊపిరి సలపని పనులతో సతమతమవుతున్న మైత్రికి ఇది ఒక రకంగా షాకే. అన్ని సవ్యంగా ఉన్నా హఠాత్తుగా జరిగిన రైడ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు లేకుండా పోవు. గత అయిదు సంవత్సరాల్లో ఈ బ్యానర్ సమర్పించిన రిటర్న్స్ తాలూకు పరీక్షలు కూడా జరుగుతున్నాయట. మొత్తానికి నాన్ స్టాప్ స్పీడ్ తో దూసుకుపోతున్న మైత్రి ఎక్స్ ప్రెస్ కి చిన్న బ్రేక్ వచ్చి పడింది. అంతా కరెక్ట్ గా ఉంటే ఇదేమంత తీవ్రమైన సమస్య కాదు కానీ పరిష్కారం అయ్యేంత వరకు టెన్షన్లు తప్పవుగా. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి