iDreamPost

వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ బలాలు, బలహీనతలు! రెండో కప్ గెలిచే ఛాన్స్?

  • By singhj Published - 02:26 PM, Mon - 2 October 23
వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ బలాలు, బలహీనతలు! రెండో కప్ గెలిచే ఛాన్స్?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్​లో ఆడేందుకు ఒక్కొక్కటిగా అన్ని టీమ్స్ ఇండియాకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు టీమ్స్ ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఆడేశాయి. ఈసారి కప్పుపై చాలా జట్లు కన్నేశాయి. వాటిలో ఒకటి ఇంగ్లండ్. ప్రపంచ కప్​లో హాట్ ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్న వాటిల్లో ఇంగ్లీష్ టీమ్ కూడా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్​గా బట్లర్ సేన బరిలోకి దిగనుంది. 2019లో జరిగిన ప్రపంచ కప్​ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కప్పు తమదేనంటున్న ఆ టీమ్​ బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గత రికార్డులు

క్రికెట్​కు పుట్టినిల్లుగా ఇంగ్లండ్​ను చెప్పుకుంటారు. ప్రపంచానికి జెంటిల్మన్ గేమ్​ను పరిచయం చేసిందే తామని గొప్పలకు పోతారు. ఎంతో మంది లెజెండరీ ప్లేయర్లను తాము అందించామని, చాలా రికార్డులు తమ పేరు పైనే ఉన్నాయని అంటారు.​ కానీ 2019 వరకు ఇంగ్లండ్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్​ను అందుకోలేదు. 1979, 1987, 1992 వరల్డ్ కప్స్​లో ఫైనల్స్​కు చేరుకుంది ఇంగ్లీష్ టీమ్. అయినా ఆ మూడు సార్లూ ఓడిపోయారు. ఆ తర్వాత 1996 నుంచి 2015 వరకు కనీసం సెమీస్​కు కూడా చేరుకోలేకపోయారు. కానీ ఐర్లాండ్​కు చెందిన ఇయాన్ మోర్గాన్ ఎప్పుడైతే ఇంగ్లండ్ టీమ్​ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి ఆ జట్టు రాతే మారిపోయింది.

తలరాత మార్చిన మోర్గాన్

ఇంగ్లీష్ టీమ్​కు దూకుడుగా ఆడటం అలవాటు చేశాడు మోర్గాన్. ఇంగ్లండ్ క్రికెట్ డీఎన్​ఏ, తలరాతను అతడు మార్చేశాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతవరకు సంప్రదాయబద్ధంగా ఆడుతూ వచ్చిన ఆ జట్టుకు అగ్రెసివ్​గా బ్యాటింగ్ చేయడం నేర్పాడు మోర్గాన్. ఎవరు ఎప్పుడు బౌలింగ్ చేయాలి, ఎప్పుడు బ్యాటింగ్ చేయాలనే దానిపై ప్లేయర్లకు రోల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ రకంగా మోర్గాన్ తీసుకొచ్చిన మార్పులు బాగా పనిచేశాయి. 2015 వరల్డ్ కప్​లో చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇంగ్లండ్.. 2019కి వచ్చేసరికి ఏకంగా కప్పును ఎగరేసుకుపోయింది.

జట్టు కూర్పు

ఈ వరల్డ్ కప్​లో ఇంగ్లండ్ జట్టు కూర్పు చాలా బాగుంది. ఆ టీమ్ ప్లేయర్ల లిస్ట్ విషయానికొస్తే.. జాస్ బట్లర్ కెప్టెన్​గా ముందుండి నడపనున్నాడు. జానీ బెయిర్​స్టో రూపంలో మరో కీపర్/బ్యాటర్ అందుబాటులో ఉన్నాడు. డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్​లు స్పెషలిస్ట్ బ్యాటర్లని చెప్పొచ్చు. ఆదిల్ రషీద్ రూపంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండగా.. మెయిన్ అలీ, లియామ్ లివింగ్​స్టన్ స్పిన్ ఆల్​రౌండర్ల పాత్ర పోషిస్తారు. మార్క్ వుడ్, గస్ అట్కిన్​సన్, రీస్ టోప్లేలు ప్రధాన పేసర్లు కాగా.. సీమ్​ ఆల్​రౌండర్లుగా బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లీలు అందుబాటులో ఉన్నారు.

బలాలు

ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ టీమ్​లో సామ్ కర్రన్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ రూపంలో ముగ్గురు నిఖార్సయిన లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నారు. కొత్త కుర్రాడు, మంచి పొడగరి అయిన గస్ అట్కిన్​సన్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను వణికించేందుకు రెడీ అవుతున్నాడు. ఎక్స్​పీరియన్స్ కలిగిన బట్లర్, బెయిర్​స్టో, రూట్ లాంటి బ్యాటర్లు ఉండటం ఇంగ్లీష్ టీమ్​కు ప్లస్ పాయింట్. అలాగే బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్​రౌండర్లు ఎక్కువ మంది ఉండటం మరో స్ట్రెంగ్త్ అని చెప్పాలి.

టీమ్​లో ఉన్న వారిలో ఆరు నుంచి ఏడు మంది బౌలింగ్ చేయగలగడం, తొమ్మిదో నంబర్ వరకు బలమైన బ్యాటర్లు అందుబాటులో ఉండటం ఇంగ్లండ్​ బలమనే చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్​లో డెప్త్ ఉంది కాబట్టే ఆ జట్టు ఇంత అగ్రెసివ్​గా క్రికెట్ ఆడుతోంది. ఈ టీమ్​లో ఉన్న చాలా మంది ప్లేయర్లకు ఐపీఎల్​లో ఆడిన అనుభవం ఉంది. అది కూడా వారికి కలిసొచ్చే అంశమే. ఇంగ్లీష్ టీమ్​లో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. బెన్​ స్టోక్స్, బెయిర్​స్టో, బట్లర్​లు తమదైన రోజున మ్యాచ్​ను వన్​సైడ్ చేసేస్తారు. మెయిన్ అలీ, సామ్ కర్రన్​లు కూడా తమ ఆల్​రౌండ్ ఎబిలిటీస్​తో మ్యాచ్​ను తారుమారు చేయగల సత్తా ఉన్నవారే. ఇన్ని బలాలు ఉన్నాయి కాబట్టే ఈ వరల్డ్ కప్​లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది.

బలహీనతలు

భారత గడ్డపై ఆడిన ఎక్స్​పీరియెన్స్ ఉన్న ప్లేయర్లు ఇంగ్లండ్ టీమ్​లో చాలా మందే ఉన్నారు. కానీ వారిలో ఒకరిద్దరు తప్పితే ఎవరూ అంతగా రాణించలేదు. హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్​స్టన్​లు ఇండియన్ పిచ్​లపై ఐపీఎల్​లో దారుణంగా ఫ్లాప్ అయ్యారు. వీళ్లు మిగతా దేశాల్లో ఆడినట్లుగా ఇక్కడ తమ బ్యాట్లతో సత్తా చాటలేకపోయారు. ఐపీఎల్​-2017లో ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ కూడా ఆ ఒక్క సీజన్​లోనే దుమ్మురేపాడు. ఆ ఏడాది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్​గా నిలిచిన ఈ ఇంగ్లీష్ ఆల్​రౌండర్.. ఆ తర్వాతి సీజన్లలో మాత్రం అంత స్థాయిలో ఆడలేకపోయాడు. కానీ భారత గడ్డపై వన్డేల్లో ఓవరాల్​గా అతడి పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది. ఈసారి అతడు ఎలా ఆడతాడో చూడాలి. భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్​లో సెకండాఫ్​లో పిచ్​లో నెమ్మదిస్తాయి.

స్లో డౌన్ అయిన పిచ్​ల మీద ఇంగ్లీష్ ప్లేయర్లు ఎంత మేర రాణిస్తారనేది సందేహమే. బ్యాట్ పైకి బాల్ వస్తే ఆడేందుకు మొగ్గుచూపే ఇంగ్లండ్ బ్యాటర్లు.. స్లో పిచ్​ల మీద తక్కువ ఎత్తులో వచ్చే బంతులను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఇంకో విషయం స్పిన్​కు సహకరించే భారత్ పిచ్​లపై వారికి ఆదిల్ రషీద్ రూపంలో ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్​లో గానీ భారత్​లో జరిగే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో గానీ అతడు అంతగా రాణించలేదు. ఆ టీమ్​లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కూడా లేడు. ఇంగ్లండ్ మరో బలహీనతగా ఫైనల్ ఫోబియా అని చెప్పొచ్చు. వరుసగా మూడు వరల్డ్ కప్ ఫైనల్స్​లో ఓడిన ఈ టీమ్.. 2019లో కూడా పడుతూ లేస్తూ ఆఖరికి సూపర్​ ఓవర్​కు వెళ్లడం.. ఆ తర్వాత బౌండరీల కౌంట్ ద్వారా ఛాంపియన్​గా అవతరించింది. 2016 టీ20 ప్రపంచ కప్​లోనూ ఫైనల్స్​లో గెలిచే స్థితిలో ఉండి ఓడిపోయింది.

ఇంగ్లండ్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్నా గాయాల బెడద ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. అనేక సార్లు గాయపడిన బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ లాంటి ప్లేయర్లకు గనుక ఇంజ్యురీ అయితే ఆ టీమ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. బెయిర్​స్టో గాయం నుంచి కోలుకొని కమ్​బ్యాక్ ఇస్తున్నాడు. అతడు ఎలా ఆడతాడో చూడాలి. ఇంగ్లీష్ టీమ్​ను భయపెడుతున్న మరో విషయం కెప్టెన్ బట్లర్ ఫామ్. భారత గడ్డ మీద బట్లర్​కు మంచి రికార్డు లేదు. ఇక్కడ ఆడిన వన్డేల్లో అతడి యావరేజ్ 11గా ఉంది. ఈసారైనా భారత పిచ్​లకు తగ్గట్లు తన బ్యాటింగ్​ను అడ్జస్ట్ చేసుకుంటాడేమో చూడాలి. గత రికార్డులు, బలాలు, బలహీనతల్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంగ్లండ్ సెమీస్​కు వెళ్లే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టు ప్రస్తుత ఫామ్​ను చూసుకుంటే రెండో సారి కప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. ఈసారి వరల్డ్ కప్​లో ఇంగ్లండ్ ఎంత వరకు వెళ్లగలుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​లో సౌతాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే..!