iDreamPost

రాజధానిలో జాతీయ భద్రతా చట్టం.. గరీష్టంగా 12 నెలల పాటు నిర్బంధం

రాజధానిలో జాతీయ భద్రతా చట్టం.. గరీష్టంగా 12 నెలల పాటు నిర్బంధం

దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) అమలులోకి రానుంది. రేపటి నుంచి మూడు నెలల పాటు రాజధాని ఢిల్లీలో ఎన్‌ఎస్‌ఏ అమలులో ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌సీఆర్‌)లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో ఈ చట్టం అమలులోకి రావడం చర్చనీయాంశమైంది.

ఏవరైనా వ్యక్తి, వ్యక్తులు లేదా వారి చర్యల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిళ్లుతుందని పోలీసులు భావిస్తే వారిని వెంటనే నిర్బంధంలోకి తీసుకునే అధికారం జాతీయ భద్రతా చట్టం కల్పిస్తోంది. ఈ చట్టం ద్వారా వ్యక్తులను గరీష్టంగా 12 నెలల పాటు నిర్బంధంలో ఉంచొచ్చు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో ఈ చట్టాన్ని చేశారు. అప్పటి నుంచి దేశంలో అవసరమైన రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ ఎత్తివేత, కశ్మీర్‌ విభజన సమయంలోనూ అక్కడ జాతీయ భద్రతా చట్టం అమలు చేశారు.

చట్టం ప్రత్యేకత ఇదీ..

– సాధారణంగా ఏ కేసుల్లోనైనా వ్యక్తులను అరెస్ట్‌ చేయాలంటే పోలీసులుకారణం చెప్పాలి. బెయిల్‌ కూడా పొందొచ్చు. కానీ ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్ట్‌ చేస్తే కారణం చెప్పాల్సిన పని లేదు. బెయిల్‌ కూడా రాదు.

– ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్ట్‌ అయిన వ్యక్తికి ఆ సమయంలో ప్రాథమిక హక్కులు వర్తించవు.

– ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే నిర్బంధంలోకి తీసుకోవచ్చు.

– అరెస్ట్‌ అయిన విషయం సంబంధిత వ్యక్తి తాలుకూ వారికి వెంటనే సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐదు రోజులు లేదా పది రోజుల పాటు వారి అరెస్ట్‌ విషయం బయట ప్రపంచానికి తెలియదు.

– ఎంత మందిని అరెస్ట్‌/నిర్బంధంలోకి తీసుకున్నారో అధికారికంగా గణాంకాలు ఉండవు.

– నిరసన, ఆందోళనకారులు పోలీసులను దూషించినా, వారిపై దాడులకు దిగినా, వారి విధులకు ఆటంకం కలిగించినా కూడా జాతీయ భద్రతా చట్టం ప్రకారం నిరసనకారులను అరెస్ట్‌ చేయవచ్చు.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దేశ రాజధానితోపాటు దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజధాని డిల్లీలో ఈ నిరసనలు ఉద్రిక్తలకు దారితీస్తూ ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థుల మధ్య ఘర్షనలు చోటుచేకున్నాయి. పలు చోట్ల పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు కూడా జరపాల్సి వస్తోంది. ఈ హింసాత్మక ఆందోళనలలో నిరసనకారులతో పాటు పోలీసులకు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి.

ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడింది. ఈనెల 21వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ మరుసటి రోజునే నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరిపి, వచ్చే నెల 8వ తేదీన పోలింగ్‌ జరిపేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11వ తేదీన వెలువడనున్నాయి.

ఈ ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు ఢిల్లీలో కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఏ అమలు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని, ప్రతి మూడు నెలలకోసారి ఎన్‌ఎస్‌ఏ కింద వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకునే అధికారం ఢిల్లీ కమిషనర్‌కు ఇవ్వడం పరిపాటేనని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి