iDreamPost

ఇప్పుడైతే నో రామ్ అనేవాళ్ళు – Nostalgia

ఇప్పుడైతే నో రామ్ అనేవాళ్ళు – Nostalgia

సరిగ్గా 20 ఏళ్ళ క్రితం కమల్ హాసన్ నటించి దర్శకత్వం వహించిన హే రామ్ ఫిబ్రవరి 18న విడుదలైంది. విపరీతమైన వివాదాలు, సెన్సార్ అభ్యంతరాల మధ్య అతి కష్టం మీద వ్యయప్రయాసలు కోర్చి కమల్ దీన్ని తమిళ్ హిందీలో ఒకేసారి విడుదల చేయించగలిగాడు. 1940ల ప్రాంతంలో దేశ స్వాతంత్రానికి ముందు జరిగిన విభజన కాలంనాటి ఉద్రిక్త పరిస్థితులతో పాటు జాతిపిత గాంధీజీ మరణానికి దారి తీసిన సంఘటనలు కూడా ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు కమల్.

ఇందులో సన్నివేశాలు, కథ చెప్పే విధానం చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇంత సీరియస్ కథలోనూ తన మార్కు రొమాన్స్ ని వదిలిపెట్టకుండా జొప్పించిన కమల్ మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి కానీ వాటిని తను ఖాతరు చేయలేదు. సిద్ధాంతాల మధ్య వైరుధ్యాలను, మతం పేరుతో మనుషుల్లో పెరిగిపోతున్న పశుప్రవర్తను అద్భుతంగా చిత్రీకరించిన కమల్ ప్రతిభను విమర్శకులు సైతం ప్రశంసించారు. తెలుగులో డబ్ చేశారు కానీ ఆడియో విడుదలతోనే ఆగిపోయిందీ సినిమా.

కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, నసీరుద్దీన్ షా, హేమామాలిని. రాణి ముఖర్జీ, వసుంధర దాస్, గిరీష్ కర్నాడ్, ఓం పూరి, సౌరభ్ శుక్లా. అతుల్ కులకర్ణి, ఓం పూరి, ఢిల్లీ గణేష్, వైజి మహేంద్రన్ లాంటి ఎందరో హేమాహేమీలు ఇందులో నటించి జీవం పోశారు. ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది. ముందు అనుకున్న ప్రముఖ వియోలినిస్ట్ ఎల్ సుబ్రహ్మణ్యం ప్రాజెక్ట్ మధ్యలో తప్పుకోవడంతో అప్పటికే షూట్ చేసిన పాటలకు రాజా మళ్ళీ కొత్త స్వరాలు కట్టి అబ్బురపరిచారు.

ఒకవేళ హే రామ్ లాంటి సబ్జెక్టు కనక ఇప్పుడు తీస్తే ఖచ్చితంగా ఇప్పుడు నో రామ్ అనేవాళ్ళేమో. గత ఏడాది చెన్నై సత్యం థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్ వేసి చేసిన వేడుకలో కమల్ మాట్లాడుతూ తానెప్పుడో ఊహించి తీసిన విషాద సంఘటనలు ఇప్పుడు నిజంగా పునరావృత్తం కావడం బాధాకరమని చెప్పాడు. ఆ సందర్భంగానే ఈ చిత్రాన్ని హెచ్డి నాణ్యతలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసింది కమల్ టీమ్. హే రాంని అప్పుడు మిస్ అయినవాళ్లు ఇప్పుడు చూస్తే కమల్ ఆలోచనా శైలి ఎంత ముందుచూపుతో ఉండేదో అర్థమవుతుంది. అందుకే హే రామ్ క్లాసిక్ గా నిలిచిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి