iDreamPost

నిర్మాతలు సేఫ్ – మరి వీళ్ళు

నిర్మాతలు సేఫ్ – మరి వీళ్ళు

కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గిపోయింది. జనం ఎవరి పనుల్లో వాళ్లున్నారు. థియేటర్లు తెరుచుకోవడం గురించి ఇండస్ట్రీ పండితులకే అంతు చిక్కడం లేదు. మరోవైపు ఏప్రిల్ చివరివారం నుంచి మొన్నటి దాకా వేచి చూసిన నిర్మాతలు మెల్లగా ఓటిటి బాట పడుతున్నారు. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు సైతం వీటి వైపే మొగ్గు చూపడం ఇప్పటికే సెన్సేషన్ గా మారింది. సినిమా హాళ్లు తెరుచుకోవడం మరికొద్దిరోజుల్లో జరిగిపోతుంది కానీ ఇప్పుడిలా ఒక్కొక్కరు డిజిటల్ బాట పడితే రేపు కంటెంట్ లేక మళ్ళీ థియేటర్లు మూసుకోవాల్సిందేనా అని ఎగ్జిబిటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు.

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది థియేటర్ల మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. దశాబ్దాలుగా వీటినే నమ్ముకుని గడుస్తున్న యాజమాన్యాలు ఉన్నాయి. వీళ్లకు ఈ పని తప్ప మరొకటి తెలియదు. ఉదాహరణకు ఓ ముప్పై సంవత్సరాలు ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పని చేసిన వ్యక్తికి ఇప్పుడు ఉద్యోగం లేక వేరే పని వెతుక్కోవాలి అంటే అతను ఏ పని చేయగలడు. స్థాయిని మరిచి కూలీ నాలి చేసుకోలేడుగా. అతనికి తెలిసింది అదొక్కటే. ఇంత కష్టంలోనూ మనసును చంపుకుని వేరే వృత్తుల వైపు వెళ్లిన వాళ్ళు లేకపోలేదు. చాలీ చాలని సంపాదనతో బ్రతుకు భారంగా గడుస్తున్న వాళ్ళ లెక్క చెప్పడం కష్టం.

ఇక థియేటర్ ఓనర్ల పరిస్థితి ఇంకా అగమ్యగోచరం. ఫంక్షన్ హాళ్లల్లో కనీసం పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వాటికి అద్దెలు వసూలవుతున్నాయి. కానీ వీళ్లకు ఆ భాగ్యం కూడా లేదు. ఖాళీగా ఉన్న సీట్ల వంక బేలగా చూస్తూ నెలలు గడుపుతున్నా అంతకంతా నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయి. 2020 మార్చ్ నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకుంటే సుమారు ఐదు వందల థియేటర్లు మళ్ళీ తెరుచుకునే పరిస్థితిలో లేవని వాటి తాలూకు భూములు ఆస్తులు ఇతర రంగాలకు మళ్ళినా ఆశ్చర్యం లేదని ఒక రీసెర్చ్ చెబుతోంది. ఓటిటిలకు సినిమాలు అమ్ముకుని నిర్మాతలు సేఫ్ అయ్యారు సరే మరి వీళ్లందరి గమ్యం గమనం ఏమిటో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి