iDreamPost

షాకింగ్: అంతర్జాతీయ న్యాయస్థానానికి నిర్భయ దోషులు

షాకింగ్: అంతర్జాతీయ న్యాయస్థానానికి నిర్భయ దోషులు

మరో నాలుగు రోజుల్లో నిర్భయ దోషులను ఉరి శిక్ష విధించనున్న నేపథ్యంలో ఉరిని తప్పించుకోవడానికి నిందితులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే మూడు సార్లు నిర్భయ నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడింది. ఉరి శిక్ష విధించిన ప్రతీసారి నలుగురు దోషులు క్యూరేటివ్ ,మెర్సీ పిటిషన్ లు ఉపయోగించుకుంటూ ఉరిని వాయిదా పడేలా చేసారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను నిర్భయ దోషులు వినియోగించుకోవడంతో ఈ నెల అనగా మార్చి 20న ఉదయం 5.30 కి నిర్భయ దోషులను ఉరి తీయాలని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

దీంతో తమకి విధించబడిన ఉరి శిక్షను మరోసారి వాయిదా పడేలా చేయడానికి నిర్భయ దోషులు విఫలయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముఖేష్ సింగ్ క్యూరేటివ్ ,మెర్సీ పిటిషన్ లుపునరుద్దరించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. కాగా సుప్రీంకోర్టు ముఖేష్ సింగ్ పిటిషన్ ను కొట్టివేసింది.

సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో నిర్భయ దోషులు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా తమకు శిక్ష విధించారని పిటిషన్ లో పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని నిర్భయ దోషుల తరపు న్యాయవాది AP సింగ్ అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటుగా ఐక్యరాజ్యసమితిలో కూడా నిర్భయ దోషులు పిటిషన్ దాఖలు చేసారు.

ఇదిలా ఉండగా తమను కారుణ్య మరణానికి అనుమతించమని నిర్భయ దోషుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి లేఖ రాసారు.పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని కూడా క్షమించారు . శిక్షించడమే అధికారం కాదు.. క్షమాభిక్ష పెట్టడంలోనూ అధికారం ఉందని నిర్భయ దోషుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశా దేవి. దోషులకు ఉరి శిక్ష అమలయ్యేవరకూ వారి తరపున పిటిషన్లు వేస్తూనే ఉంటారని ఆశాదేవి అన్నారు.

నిర్భయ దోషుల ఉరికి ఇంకా నాలుగు రోజుల గడువే ఉండడంతో తీహార్ జైలు అధికారులు ఉరిశిక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నాలుగు రోజుల ముందుగానే తలారి తీహార్ జైలుకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో తలారి తీహార్ జైలుకు చేరుకున్నాడు. నిర్భయ దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో వారికి 20 న ఉరి శిక్ష అమలవ్వడం ఖాయమని చెప్తున్నారు న్యాయనిపుణులు.కానీ నిర్భయ దోషులు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో శిక్ష అమలవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి