iDreamPost

ప్రజాస్వామ్యంలో గోప్యత ఏంటి నిమ్మగడ్డ రమేష్ గారూ?

ప్రజాస్వామ్యంలో గోప్యత ఏంటి నిమ్మగడ్డ రమేష్ గారూ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం కోర్టులో నడుస్తోంది. విచారణ మొదలవ్వలేదు. వాదనలు ఇంకా ప్రారంభం కాలేదు. ఫిర్యాదులు, ప్రతిపిర్యాదులు (petitions & counter petitions) దశలోనే ఉంది. ఈ దశలోనే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు తాను దాఖలు చేసిన పిటిషన్ లో చాలా అభ్యంతరకర అంశాలు లేవనెత్తారు.

“ఎన్నికల వాయిదా నిర్ణయం గోప్యమైనదని, సంప్రదింపులు అవసరం లేదని” నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వాదన రమేష్ కుమార్ లోని అప్రజాస్వామిక ఆలోచనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తుంది. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం మన మౌలిక ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికలో ప్రతి వ్యక్తీ, ప్రతి వ్యవస్థ మరో వ్యక్తితో, వ్యవస్థతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతిమ నిర్ణయం కీలకమైన వ్యక్తిదే అయినప్పటికీ ఆ నిర్ణయం తీసుకునేందుకు ఒక పద్దతి అనుసరించాల్సి ఉంటుంది. ఆపద్దితి ప్రకారమే నిర్ణయాలు జరగాల్సి ఉంటుంది.

సంప్రదింపులు అవసరం లేదు అని చెప్పడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియంత పదవిలో లేరు. ఒక ప్రజాస్వామ్య పదవిలో ఉన్నారు. నిర్ణయం తీసుకోవడానికి పద్దతి ఉన్నట్టే తీసుకున్న నిర్ణయానికి ఒక ఆధారం (Base) ఉండాలి. ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకున్నారో చెప్పాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ చెపుతున్నట్టు తాను కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాను అంటే కుదరదు. ఆ సంప్రదింపులకు రికార్డెడ్ ఎవిడెన్స్ చూపించాలి. అలా సంప్రదించడానికి దారితీసిన పరిస్థితులను చూపించాలి. ఇవేవీ నిమ్మగడ్డ రమేష్ అనుసరించినట్టు కనిపించడం లేదు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులతో పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వంతోనో, కేంద్ర ఎన్నికల సంఘంతోనో మాత్రమే సంప్రదించి పనిచేస్తానంటే కుదరదు. అంతటి స్వయం ప్రతిపత్తి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదు. పార్లమెంటు ఎన్నికలు ప్రధాని వాయిదా వేయలేరు. శాసనసభ ఎన్నికలు ముఖ్యమంత్రి వాయిదా వేయలేరు. కానీ స్థానికసంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి నిర్వహించగలరూ, వాయిదా వేయగలరు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి ఇప్పుడు రమేష్ కుమార్ చెప్పినట్టు ఉంటే 2018లో ఎన్నికలు వాయిదా వేయకుండా లేదా వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించి లేదా ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చి ఎన్నికలు నిర్వహించి ఉండాల్సింది. అప్పుడు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు.

ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంలో కనిపించని స్వయం ప్రతిపత్తి ఎన్నికల వాయిదాను ప్రశ్నిస్తే వచ్చిందా అనే ప్రశ్నకు నిమ్మగడ్డ జవాబివ్వాలి.

ఇక ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనా తర్వాత ఆయన చెపుతున్న ఇతర కారణాలు సమంజసంగా లేవు. శాంతి భద్రతల విషయం అయితే ఆయన రాష్ట్ర డీజీపీతో సంప్రదించి ఉండాల్సింది. కరోనాతో ఆరోగ్య సమస్య అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో సంప్రదించాల్సి ఉంది. అసలు మొత్తం ఎన్నికలే వాయిదా అంటే కనీసం ప్రధాన కార్యదర్శితో సంప్రదించాల్సి ఉంది. అవేమి జరగలేదు. అలాంటి సంప్రదింపులేమీ అవసరం లేదు అనే అభిప్రాయం అప్రజాస్వామికం.

ఎన్నికల వాయిదాకు కానీ, ఎన్నికల్లో హింస జరిగిందనటానికి కానీ ఆయన ప్రామాణికంగా తీసుకున్నది మీడియా రిపోర్టులు. అవి కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన లేఖలు ఇచ్చాయి. ఈ లేఖలు ప్రాతిపదికగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన లేఖపై స్పందించే ముందు రాజకీయంగా నిష్పాక్షికంగా ఉండే పద్దతిలో అధికార పక్షం నుండి కూడా లేఖ తీసుకుని ఉండాల్సింది. ఈ పని కూడా చేయలేదు అంటే ఆయన నిష్పాక్షికత ఎంతో, అది ఏవైపు ఉందో అర్ధం అవుతోంది.

ప్రజాస్వామ్య మూలసూత్రమైన సంప్రదింపులు అక్కర్లేదు అనుకోవడంతో పాటు కొన్ని పార్టీల అభిప్రాయాలు మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకోవడం ఆయన ఎంతవరకు నిష్పాక్షికంగా ఉన్నారో తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి