iDreamPost

అందువల్లే గ్యాస్ లీకేజి ప్రమాదం : ఎన్జీటీ కి కమిటీ నివేదిక

అందువల్లే గ్యాస్ లీకేజి ప్రమాదం : ఎన్జీటీ కి కమిటీ నివేదిక

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ఎన్‌జీటీలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందస్తుగా 50 కోట్ల రూపాయలు విశాఖ కలెక్టర్ వద్ద జమ చేయాలనీ ప్రమాదం జరిగిన సమయంలోనే ఎన్జీటీ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఎల్జీ కంపెనీ ఆ సొమ్మును జమ చేసింది.

కొద్దీ రోజులుగా ప్రమాద ఘటన పై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్నినివేదిక రూపంలో ఎన్జీటీ కి సమర్పించింది. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపారు. విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్‌జీటీ వెల్లడించింది.

విశాఖ సమీపంలోని ఆర్‌.వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌లో విషపూరిత వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, అస్వస్థతకు గురైన వారికి 10 లక్షల నుంచి 25 వేల రూపాయల వరకూ పంపిణీ చేసిన ప్రభుత్వం, ఆయా గ్రామాల్లో ఉన్న దాదాపు 20 వేల మందికి 10 వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది. ఉచితంగా వైద్యం అందించి వారందిరికీ అండగా ఉంది.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించిన వైసీపీ సర్కార్‌ ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే కంపెనీని మరో చోటుకు తరలిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర రాజ్యాగం బద్ధ సంస్థలకు చెందిన ఏడు కమిటీలు విచారణ చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి