Idream media
Idream media
జనాల్ని కొరుక్కు తినడానికి ఇండస్ట్రీలో రాంగోపాల్‌వర్మకి పేటెంట్ ఉంది. ఆయనతో పోటీ పడడానికి ఇప్పుడు ప్రశాంత్ వర్మ వచ్చాడు. అంతా ప్రేక్షకుల ఖర్మ! ఈ మధ్యనే పెద్ద వర్మ ఒక జాంబీ సినిమా తీసి వదిలాడు. దానికి కంటెన్యూటీగా చిన్న వర్మ జాంబీని వదిలాడు. కాకపోతే దీనికి కరోనా కలర్ ఇచ్చాడు.
కరోనా వ్యాక్సిన్ వికటించి ఒకడు జాంబీగా మారుతాడు. అందరినీ కరుస్తూ జాంబీలుగా మార్చేస్తాడు. అసలే కరోనా వ్యాక్సిన్ అంటే జనం హడలి చస్తున్నారు. ఈ సినిమా చూస్తే ఇంకెవడూ వ్యాక్సిన్ వేసుకోడు. ఈ జాంబీలంతా నార్మల్ ఎలా అవుతారంటే దేవుడు కోనేట్లో దూకితేనట! చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగిస్తే కరోనా పోతుందనుకునే దేశంలో ఈ రకం సినిమాలే కరెక్ట్.
అసలే జనాలు పిచ్చిలేచి చస్తున్నారు. ఒకావిడ డంబెల్స్‌తో పిల్లల్ని చంపుతుంది. రైతులు రోడ్డు మీదికి రాకుండా మేకులు నాటుతున్నారు. తుపాకులకి ఎదురొడ్డి సాధించిన విశాఖ ఉక్కుని గద్దలు ఎగరేసుకు పోతున్నాయి. సమస్యలు మరిచిపోదామని సినిమాకెళితే జాంబీలతో కనిపిస్తున్నారు.
ఆ! సినిమా మరీ గొప్పగా కాకపోయినా ఫర్వాలేదు. అది తీసిన ప్రశాంత్‌వర్మ కరోనా Background కథతో వచ్చాడు. కరోనా టైమ్‌లో ఎన్ని వింతలు జరిగాయి, అవన్నీ టచ్ చేయకుండా రాయలసీమ ఫ్యాక్షన్, దానికి జాంబీలని Add చేశాడు. ఫ్యాక్షన్ లేదురా సామీ బతకలేక వలసలు పోయి అవస్థలు పడుతాండం అని నెత్తినోరు మొత్తుకున్నా వదలడం లేదు.
హీరో బృందం ఒక పెళ్లికి వెళ్తారు. కర్నూలు దగ్గర పెళ్లి. అదో ఫ్యాక్షన్ గ్రామం. ఆ ఇంటికి కాబోయే అల్లున్ని చంపడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారట! వీళ్లకి తెలియంది ఏమంటే ఫ్యాక్షన్‌లో ప్రత్యర్థులు తేల్చుకుంటారే తప్ప, ఆ ఇంటికి కాబోయే పెళ్లి కొడుకుని చంపిన సంఘటన ఇంత వరకూ జరగలేదు. పెళ్లి కూతురు పసుపు కుంకుమ తీసే కుసంస్కారం , అనాగరికత ఎక్కడా లేదు. సినిమా వాళ్లు సీమ పేరుతో నానా చెత్త తీస్తున్నారు.
డైరెక్టర్లు జాంబీలుగా మారి కరవడం ఈ కరోనా కాలంలో న్యాయమా?