కొబ్బరి అంటే కోనసీమ.. కోనసీమ అంటే కొబ్బరి. ఆ రెండూ అలా ముడిపడిపోయాయి. అందరికీ కొబ్బరి గుర్తుకొస్తే కోనసీమను గుర్తు చేసుకునేటంత స్థాయిలో ఉంటుంది. అంత క్రేజ్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యమే. వాస్తవానికి కోనసీమకు కూడా కొబ్బరి విదేశాల నుంచే వచ్చింది. సముద్రం ద్వారా తూర్పు ఆసియా దేశాల నుంచి కొట్టుకు వచ్చిన కొబ్బరి కాయల ద్వారానే కోనసీమలో కొబ్బరి ప్రస్థానం ప్రారంభమయ్యిందని అంతా చెబుతారు. ఆ తర్వాత రానురాను బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ, ఉద్దానం ప్రాంతాల్లోనే కొబ్బరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం అది బాగా విస్తరిస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
విస్తీర్ణం పరంగా కొబ్బరి సాగు ఏపీలో 2.25లక్షల ఎకరాల్లో సాగుతోంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఏపీలోనే కొబ్బరి పంట ఎక్కువగా ఉంది. ఉత్పాదకలో మాత్రం ఏపీ ఈ మూడు రాష్ట్రాలను తలదన్నేలా ఉంటుంది. కోనసీమలో సహజంగా ఏర్పడిన వాతావరణం, నేల స్వభావం రీత్యా దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దాంతో దేశంలోనే మిగిలిన రాష్ట్రాల కన్నా ఏపీ ముందంజలో ఉంది. కోనసీమలో నీటి కొబ్బరి బొండాలతో పాటుగా కురిడీ, టెంకాయల వంటివి ఎగుమతి అవుతూ ఉంటాయి. రాజస్తాన్, ఢిల్లీ, యూపీ, బీహార్ సహా వివిధ రాష్ట్రాలకు తరలిస్తారు.
వేసవికాలంలో కొబ్బరి బొండాల కు డిమాండ్ ఉంటుంది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి రైతులు తమ పొలాల్లో బొండాలు తీయటానికి ఇష్టపడరు. దీనికి కారణం కొబ్బరి దిగుబడి తగ్గిపోతుందని భావిస్తారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి బోండాలు తీయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కొబ్బరి మార్కెట్ కు పండగలకు మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. శ్రావణమాసం, వినాయక చవితి ,దసరా ,దీపావళి వంటి పండగల్లో కొబ్బరి మార్కెట్ ధర పలుకుతుంది. దీపావళి తర్వాత గుజరాత్ లో చాట్ పండగ నిర్వహిస్తారు. అక్కడ గంగానదికి కురిడి కొబ్బరి అధికంగా భక్తులు సమర్పిస్తారు.
ఉత్తర ప్రదేశ్, బీహార్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే పండగల ప్రభావం ఇక్కడ కొబ్బరి మార్కెట్ మీద ఉంటుంది. కొబ్బరి కి సంవత్సరమంతా ధర పలకదు. ధర లేని సమయంలో రైతులు కొబ్బరిని అట్టక మీదా పోస్తారు. ఇలా ఆరు నెలలు ఉంచిన కురీడి ధర వచ్చినప్పుడు అమ్ముతారునీటి కొబ్బరికాయను కొట్టి అరపలు మీదకు పేర్చి ఎండు కొబ్బరి తయారు చేస్తారు. దీనికి నిరంతరం ధర ఉంటుంది. కొబ్బరి నూనె కి అధికంగా వినియోగిస్తారు.
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు విషయంలో కోనసీమకు తగినంత ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపించడం లేదు. కేరళలో ఇది జోరుగా సాగుతోంది. కొబ్బరి పీచు పరిశ్రమలు కొన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నారు. ఇతర ఉప ఉత్పత్తులను కూడా తయారుచేసేందుకు తగిన ప్రోత్సాహం కోకోనట్ బోర్డ్ నుంచి దక్కడం లేదు. ఇక కోనసీమ రైల్వేలైన్ విషయంలో కూడా వ్యవహారం రెండు అడుగులు ముందుకు..మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. దానిని త్వరగా పూర్తిచేస్తే కొబ్బరి ఎగుమతులకు మార్గం సుగమం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ కే కొబ్బరి ఉత్పత్తి పరంగా కోనసీమ తలమానికంగా ఉంటుంది. దేశంలోనే కోనసీమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గోదావరి, పంట కాలువల నీటితో నిత్యం కళకళలాడుతూ ఉండే కోనసీమలో ఆక్వా సాగు విస్తరణ కొబ్బరి పంటకు కొంత సమస్యగా మారుతోంది. దీనిపై దృష్టి పెట్టాలని అంతా కోరుతున్నారు. ఆయిల్ కంపెనీల కార్యకలాపాలు కూడా కొబ్బరి సాగు మీద ప్రభావం చూపుతున్నాయి. ఏమయినా కోనసీమ కొబ్బరి ఇటీవల గోదారి గంగా, పావన గంగ వంటి రకాలతో మరింత ఉత్పత్తిని పెంచుకునే దిశలో ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడంతో కరోనా తాత్కాలిక సమస్య నుంచి గట్టెక్కగలమని కోనసీమ కొబ్బరి ఉత్పత్తిదారులు భావిస్తున్నారు.