సహజంగా ప్రతిపక్ష నేతలంటే ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేసే అంశాలను ప్రస్తావిస్తారు. కానీ చంద్రబాబు దానికి దూరం. బీజేపీ ఎజెండాను తాను భుజానకెత్తుకుంటున్నట్టుగా పదే పదే కనిపిస్తోంది. తాజాగా వినాయక చవితి విషయంలోనూ చంద్రబాబు ది అదే పరిస్థితి. ఓవైపు విద్యుత్ సర్థుబాటు ఛార్జీల మీద చర్చ సాగుతోంది. దానిని ఆయన పట్టించుకోకుండా చవితి పందిళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తయారయిన సందిగ్ధ స్థితిలో చంద్రబాబు కొట్టిమిట్టాడుతున్నట్టు ఈ పరిస్థితి చాటుతోంది.
నిజానికి విద్యుత్ ఛార్జీల గురించి చంద్రబాబు ప్రస్తావిస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలతో అమలవుతున్న సర్థుబాటు ఛార్జీలకు అసలు కారణం 2014 నుంచి 2019 వరకూ ఎదురయిన నష్టాలే. ఆనాడు విద్యుత్ కొనుగోళ్లకు, సరఫరా వ్యయానికి మధ్య వచ్చిన నష్టాలను నాటి ప్రభుత్వం ఖాతరు చేయలేదు. పైగా అప్పులను అమాంతంగా పెంచేసి డిస్కమ్ లను నష్టాల పాలుజేసింది. ఈ పరిస్థితుల్లో వాటి నుంచి గట్టెక్కడానికి ఆయా సంస్థలు ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు సిద్ధమయ్యాయి.
చంద్రబాబు వైఫల్యం మూలంగా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానిని ప్రస్తావిస్తే అది బాబు నిర్వాహకం అని బయటపడుతుంది. కనుకనే ప్రజలపై నేరుగా భారం పడిన ఈ అంశంలో సన్నాయి నొక్కులు తప్ప సూటిగా నిలదీయలేని స్థితిలో టీడీపీ నాయకత్వం ఉంది. అదే సమయంలో వినాయక చవితి పందిళ్ల విషయంలో చంద్రబాబు ఓ అడుగు ముందుకేశారు. గతంలో ఆలయాల్లో జరిగిన కొన్ని ఘటనల సందర్భంగా వ్యవహరించినట్టుగానే ఇప్పుడు కూడా బీజేపీ ఎజెండాకు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
Also Read : ఆ నియోజకవర్గంలో అధికారపార్టీలో లోల్లి ..టీడీపీ గురి..!
ఏపీలో ప్రస్తుతం మత రాజకీయాలకు ఆస్కారం లేదు. అయినప్పటికీ విధానపరంగా చర్చ వస్తే తన లోపాలు బయటపడతాయని ఆందోళనతో ఉన్న చంద్రబాబు జగన్ వ్యక్తిగతంగా విశ్వాసాల మీద దాడి చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా చంద్రబాబు వ్యవహారం ఉంటోంది. ఇది చివరకు బీజేపీ బలపడేందుకు దోహదపడే అంశమే తప్ప బాబుకి ఏమేరకు మేలు చేస్తుందన్నది అనుమానమే. బీజేపీ బలపడడం బాబు ఆశలకు గండికొట్టినట్టవుతుంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో తాము కలిసే పోటీ చేస్తాము కాబట్టి ఈ మత రాజకీయాల వల్ల వచ్చే మైలేజ్ తనకే మేలు చేస్తుందనే అంచనా చంద్రబాబు లో ఉన్నట్టు ప్రచారం.
అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం జాతీయ రాజకీయాల్లో బాబు కప్పదాట్లను గమనంలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానైనా బరిలో దిగాలి తప్ప బాబుకి మేలుచేసేలా వ్యవహరించకూడదనే లక్ష్యంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే బాబు తన వేలితో తన కంట్లో పొడుచుకుంటున్నట్టుగా భావించాలి. బీజేపీ మీద ఆశలతో మత రాజకీయాలు రాజేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలికకు దోహదపడుతున్నట్టు చూడాలి. తద్వారా జగన్ నెత్తిన పాలుపోసే ప్రయత్నంలో టీడీపీ అధినేత ఉన్నట్టు అంచనాకు రావాలి. ఏమయినా చంద్రబాబు బలహీనతలు ఇప్పుడు ఆయన చివరి దిశలో పెద్ద గుదిబండలుగా మారిన వైనం మాత్రం మరోసారి తేటతెల్లమవుతోంది.
Also Read : పండగ రాజకీయం : బీజేపీ తానా అంటే.. బాబు తందానా!