Idream media
Idream media
విద్య , సంద్య ఇద్దరు అక్కచెల్లెళ్లు. ఈ ఫొటో 1954లోది. ఎడమ వైపు విద్య, కుడివైపు సంద్య. వీళ్ల నాన్న బెంగళూరులో వకీలు. విద్య అసలు పేరు అంబుజం. ఇంటర్ పూర్తయిన తర్వాత బొంబాయిలో ఎయిర్‌హోస్టెస్‌గా చేరింది. ఒకరోజు విమానంలో లలిత, పద్మినీలు (అప్పటి ప్రముఖ డ్యాన్సర్లు, యాక్టర్లు) పరిచయమై సినిమాల్లోకి రమ్మని చెప్పారు. అంబుజం జెమినీ సంస్థకు అప్లికేషన్ పంపితే పిలుపు వచ్చింది. ఏడాది పాటు అగ్రిమెంట్‌లో సంతకం చేయించుకున్నారు. సినిమా మాత్రం తీయలేదు.
ఈ లోగా చిత్తూరు నాగయ్య “నా ఇల్లు” సినిమా తీస్తే అంబుజం పేరుని విద్యగా మార్చారు. విద్య తల్లితండ్రులు పక్కా సాంప్రదాయవాదులు. ఆ ఇంట్లో సినిమాలు చూడడమే నిషిద్ధం. దాంతో ఒంటరిగానే విద్య మద్రాస్‌లో ఉండాల్సి వచ్చింది. ఆమె అక్క సంద్యకి అప్పటికే భర్త పోయారు. ఇద్దరు పిల్లలు జైకుమార్, లలిత. ఆమె చెల్లికి తోడుగా వచ్చింది. భరణీ వారి చండీరాణిలో విద్య నటించిన తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసింది.
సంద్యకు కూడా సినిమాల్లో నటించాలని ఆసక్తి పుట్టి “కర్కోటై” తమిళ సినిమాలో యాక్ట్ చేసింది. ఇద్దరికీ అవకాశాలు ప్రారంభమై అడయార్‌లో ఇల్లు తీసుకుని ఉండేవారు. అమ్మానాన్న వీళ్ల దగ్గరికి రాలేదు.
సంద్య విజయావారి మాయబజార్‌లో ఎన్టీఆర్ పక్కన రుక్మిణిగా చేసింది. ఆ రోజుల్లో ప్రముఖ సినీ విమర్శకుడైన రామానుజం వీళ్లిద్దరు సినీ రంగంలో పైకొస్తారని ఒక వ్యాసం కూడా రాశారు. కానీ దురదృష్టం కొద్ది వీళ్లకి పేరు రాలేదు.
అయితే ఆ రోజు విద్య, సంద్య తెగించి మద్రాస్ రాకపోతే తమిళనాడు రాజకీయ చరిత్ర ఇంకోలా ఉండేది. ఎందుకంటే సంద్య కూతురు లలితే జయలలిత.
తల్లి, పిన్ని పరాజితులైన సినిమా రంగాన్నే కాదు, అత్యంత కుట్రలతో కూడుకున్న రాజకీయ రంగాన్ని కూడా జయ గెలిచింది. జీవితాల్లో సాధారణంగా జరిగే ఒక సంఘటన, అసాధారణ పరిణామాలకి దారి తీస్తుంది. విమానంలో విద్యకి లలిత, పద్మినీ కనపడకపోతే జయలలిత పేరు కూడా ఎవరికీ తెలిసేది కాదు.