తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ దగ్గరపడుతుండడంతో పాపం చంద్రబాబుకి శ్రీనివాసుడు గుర్తొచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తువచ్చేసింది. లేనిపోని మాటలు, అతను నమ్మశక్యం గాని ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులైన చంద్రబాబు మరోసారి తన అర్థం పర్థం లేని ఆరోపణలతో టీటీడీని మళ్లీ వివాదంలోకి లాగారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతోందని, అవినీతి జరుగుతుందని పెడబొబ్బలు పెట్టడం మొదలుపెట్టారు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని అందరికీ అర్థమవుతుంది. కానీ ఆయన మాత్రం జనం నమ్ముతున్నట్లు ఫీలై పోవడమే ఇక్కడ అసలైన విచిత్రం..
మీ హయాం అంత అక్రమమే కదా!
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో 2014 నుంచి 2019 వరకు జరిగిన అంత అక్రమాలు అవినీతి మరెప్పుడూ జరగలేదు. రెండేళ్ల వరకు కనీసం పాలకవర్గాన్ని నియమించడానికి సైతం చంద్రబాబుకు తీరిక లేకుండా పోయింది. తీరిక అనే కన్నా అక్కడ ఓ అధికారి చేత ఆయన సాగించిన అక్రమ వ్యవహారాలు కోకొల్లలు. టీటీడీ ఈవో లను సైతం లెక్క చేయకుండా ఓ జేఈఓ సాగించిన తతంగం గురించి ఇప్పటికీ ఉద్యోగులు,అధికారులు కథలు కథలు గానే చెప్పుకుంటారు. సదరు జేఈఓను అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చే వీఐపీలతో, వీవీఐపీలతో చంద్రబాబు పనులు చేయించే వారు. తమకు అనుకూలమైన వారిని ముందుగానే గుర్తించి, వారికి అద్భుతమైన దర్శన భాగ్యాన్ని కల్పించిన తర్వాత తాపీగా జేఈఓతో పనులు చక్కబెట్టడంలో చంద్రబాబు అప్పట్లో ఆరితేరారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే సదరు జేఈఓ చేతిలో చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు. కనీసం వసతిగృహం ఆయనకి ఇవ్వడానికి ఒప్పుకొని జేఈఓ తీరు మీద అప్పట్లో చంద్రబాబు చేసిన నానాయాగీ అంతా ఇంతా కాదు.అయితే అధికారంలోకి వచ్చాక ఆయననే అడ్డం పెట్టుకుని తిరుమల కొండ మీద చక్రం తిప్పారు.
ఎన్నో ఎన్నెన్నో!
తిరుమల కొండ మీద చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కనుసన్నల్లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఓ ఐపీఎస్ స్థాయి అధికారిని వేధించి ఢిల్లీకి పంపించిన తీరు ఎప్పటికీ టిటిడి ఉద్యోగులు గుర్తు చేసుకుంటారు. సదరు ఐపీఎస్ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తూ టీటీడీలో జరిగిన అక్రమాలపై నివేదికలు ఇవ్వడమే ఆయనపై వేధింపులకు కారణం. చెవిటి మూగ పిల్లల శ్రవణం ప్రాజెక్టు విషయంలోనూ విశాఖలో తన సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు ప్రాజెక్టు అప్పగించడం కూడా పెద్ద అవినీతిలో భాగం. ఆఖరకు మూగ చెవిటి పిల్లల ప్రాజెక్టును సైతం చంద్రబాబు వదల్లేదు. పింక్ డైమండ్ వివాదం దగ్గర నుంచి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల వరకు చంద్రబాబు హయాంలో వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అమ్మవారి కుంకుమ దగ్గరనుంచి స్వామి వారి ఆలయంలో నైవేద్యానికి పెట్టే నెయ్యి వరకు అవినీతిలో భాగమైపోయాయి. ప్రతి దానిలో ఆయన సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లదే పై చేయి. ఆఖరికి బాత్రూంలా నిర్వహణ కాంట్రాక్టును సైతం ఆయన కులానికి చెందిన వారికి అప్పగించారు అంటే చంద్రబాబు ఏ మేరకు తిరుమలని అపవిత్రం చేశారో అర్థం చేసుకోవచ్చు.
పాలకమండలి వచ్చిన!
తన పాలనా కాలం చివరిలో టీటీడీ పాలకమండలి వేసినప్పటికీ ఆ పాలకమండలి హయాంలోనూ అంతులేని అవినీతి చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆలయానికి చెందిన ఉన్నతాధికారికి లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడంతో పాలకమండలి సభ్యులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ పాలకమండలి వచ్చిన తర్వాత లడ్డూలు,ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణ వంటి అనేక విషయాల్లోనూ అవినీతి విషయాలు బయటపడ్డాయి.
ఆమెను అంటే శ్రీనివాసుడు ఊరుకోడు
ప్రస్తుతం చంద్రబాబు చెప్పిన ఓ విషయం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీటీడీ చైర్మన్ సతీమణి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నట్టు ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రతి రెండు రోజులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సేవలోనే గడిపే టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,ఆయన సతీమణికి శ్రీనివాసులు అంటే అమితమైన ఇష్టం. ఆమె నిత్యం కొండపై దైవ స్మరణలోను, స్వామివారి సేవలో గడుపుతూ కనిపిస్తారు. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ఆమెను గౌరవిస్తారు. అలాంటి మహిళపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. దీనిపై ప్రతిసారి చంద్రబాబు చిల్లర వ్యాఖ్యలు చేయడం తిరుమల పవిత్రతను ఆయన కాపాడినట్లు చెప్పుకున్ననమ్మేందుకు టీటీడీ ఉద్యోగులు కానీ అధికారులుగానీ మరీ ముఖ్యంగా సామాన్య భక్తులు కాని సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మేలు.