iDreamPost
android-app
ios-app

ఆఖ‌రి వీడ్కోలు క‌త్తి మ‌హేశ్‌!

ఆఖ‌రి వీడ్కోలు క‌త్తి మ‌హేశ్‌!

 క‌త్తి మ‌హేశ్ వెళ్లిపోయాడు. అంద‌రూ వెళ్లాల్సింది అదే దారి. కొంచెం దూకుడు క‌దా తొంద‌ర‌ప‌డ్డాడు. దేవున్ని దూషించ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగింద‌ని కొంద‌రు పోస్టులు పెట్టారు. మ‌రి దేవున్ని మూడు పూట‌లా పూజ‌లు చేసేవాళ్లు నూరేళ్లు బ‌తుకుతున్నారా? ప‌్ర‌మాదం లేకుండా జీవిస్తున్నారా?

మ‌నిషి ర‌క‌ర‌కాల జంతువుల్లా అర‌వ‌గ‌ల‌డు. ఒక్క జంతువు కూడా మ‌నిషిలా మాట్లాడ‌లేదు. మ‌నిషి రూపంలో జంతువులుంటాయి. క‌నీసం మ‌ర‌ణాన్ని కూడా గౌర‌వించే సంస్కారం లేనివి.

డిజిట‌ల్ యుగంలో జీవిస్తున్నామ‌నేది భ్ర‌మ‌. మ‌న‌ది శిలాయుగం. గుండెకి బ‌దులు శిల‌ని మోస్తూ తిరుగుతున్న మ‌నుషులం.

మ‌ర‌ణం అంటే సంపూర్ణ విశ్రాంతి. వివ‌క్ష వుండ‌దు, బెదిరింపులుండ‌వు. ట్రోలింగ్ వుండ‌దు. నిరంత‌ర పోరాటం వుండ‌దు. మ‌హేశ్ అభిప్రాయాలు ఏమైనా కావ‌చ్చు. కానీ ఆత్మ‌గౌర‌వం కోసం, అభిప్రాయ ప్ర‌క‌ట‌న కోసం నిల‌బ‌డిన విధానం, పోరాడిన‌ తీరు అసాధార‌ణం.

మ‌హేశ్ తండ్రిది మ‌రో దుక్కం. భుజాల‌పై నుంచి కొడుకుకి ప్ర‌పంచాన్ని చూపించిన‌వాడు. అదే భుజాల‌పై మోసి ఈ రోజు ప్ర‌పంచం నుంచి పంపించాడు. మ‌హేశ్ భార్యాబిడ్డ‌ల‌ది ఇంకో దుక్కం. పిడికెడు మ‌న్ను చ‌ల్లేట‌ప్పుడు వాళ్లు క‌న్నీటి జ‌ల‌పాతాలు.

కోలుకుంటున్నాడు, నో ప్రాబ్ల‌మ్ అని ఈ మ‌ధ్య వెంక‌ట‌సిద్ధారెడ్డి చెబితే సంతోషించాను. థియేట‌ర్లు తెరిస్తే ఆస్ప‌త్రి నుంచి ఒక్క దూకు దూకి వ‌చ్చేస్తాడ‌నుకున్నా. ప్ర‌సాద్‌లో శుక్ర‌వారం ఉద‌యం క‌నిపిస్తాడు. క‌లిసి టీ తాగుదాం అనుకున్నా. ఇది మోసం క‌దా? అన్యాయంగా వెళ్లిపోవ‌డం.

మ‌హేశ్‌తో కేవ‌లం ప‌రిచ‌య‌మే. గాఢ‌త‌లేదు. క‌లిసి ఒక్క‌సారి కూడా భోంచేయ‌లేదు. పార్టీ చేసుకోలేదు. అయినా ఎందుకు గౌర‌వం అంటే, ప‌రీక్షా స‌మ‌యాల్లో, చిక్కులు చుట్టిముట్టిన‌పుడు ఎంత గ‌ట్టిగా నిల‌బ‌డాలో, గొంతు ఎలా వినిపించాలో ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న నుంచి నేర్చుకోవాలి.

అయినా ఇపుడు ఎవ‌రికి వారే పాఠ్య‌పుస్త‌కాలుగా మారుతున్న కాలం. ఎవ‌డూ ఇంకొక‌డు చెప్పేది విన‌డు, నేర్చుకోడు. మూడు రోజులు ఇలా ఫేస్‌బుక్‌లో పోస్టింగులు పెట్టుకుని త‌ర్వాత ఎవ‌డి బుర‌ద‌లో వాళ్లు కూరుకుపోతాం.

స్వ‌ర్గ‌న‌ర‌కాలున్నాయో లేదో తెలీదు కానీ, వుంటే గ్యారెంటీగా మ‌హేశ్ నర‌కానికే పోతాడు. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ల‌ని స్వ‌ర్గంలోకి రానీయ‌రు. ఒక‌వేళ రానిస్తే మూడు పూట‌లా అమృతం తాగి, డాన్స్‌లు చేసే మీరు దేవ‌త‌లు ఎలా అయ్యారు? అడ‌వుల్లో కాయ‌క‌ష్టం చేసి బ‌తికేవాళ్లు రాక్ష‌సులుగా ఎలా మారారు! అని స్వ‌ర్గ నియ‌మావ‌ళినే మార్చి పారేస్తాడు.

న‌ర‌కంలో కూడా మ‌హేశ్‌ని పెద్ద‌గా శిక్షించ‌రు. రోజుకి 2 తెలుగు సినిమాలు చూపిస్తారంతే. వున్న‌ప్పుడూ శిక్షే, పోయినా శిక్షే. న‌ర‌క‌లోక ప్ర‌ద‌ర్శ‌న కోసమే కొంత మంది తెలుగు డైరెక్ట‌ర్లు దీక్షా కంక‌ణ బ‌ద్ధులై వున్నారు.

ఇలా ఒక సెటైర్ రాసి నిన్ను న‌వ్విద్దామ‌నుకున్నా. నువ్వేంది భ‌య్యా ఏడిపిస్తూ వెళ్లిపోయావ్‌. ఆఖ‌రి వీడ్కోలు మిత్ర‌మా!