iDreamPost
iDreamPost
ఎంత సృజనాత్మకత ఉన్న దర్శకుడు, ఇమేజ్ ఉన్న హీరో అయినా కథల ఎంపికలో లేదా చెప్పే విధానంలో చేసే పొరపాట్ల వల్ల ఒక్కోసారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. 1992. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ మంచి పీక్స్ లో ఉన్న టైం. రాజేంద్ర ప్రసాద్ తో చేసిన ఏప్రిల్ 1 విడుదల సూపర్ హిట్ అయ్యి ఈయన మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అప్పటికే లేడీస్ టైలర్, సితార, చెట్టు కింద ప్లీడర్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఆ టైంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కాంబో అనౌన్స్ చేయగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం వరుస విజయాలతో ఆయన మంచి ఊపుమీదున్నారు.
టైటిల్ డిటెక్టివ్ నారదగా ప్రకటించారు. అప్పటికి ఆ ట్రెండ్ తెలుగులో అంత ఉదృతంగా లేదు. చిరంజీవి చంటబ్బాయి చేశాడు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. హాలీవుడ్ లో మంచి ఆదరణ ఉండే డిటెక్టివ్ తరహా కథతో ప్రయోగం చేయాలనీ వంశీ కాస్త విభిన్నంగా ఆలోచించి దీన్ని రాసుకున్నారు. హీరోయిన్ గా ఆదిత్య 369తో పేరు తెచ్చుకున్న మోహినికి తీసుకుని మరో కీలక పాత్రలో నిరోషాను సెట్ చేసుకున్నారు. సీనియర్ తారాగణం జగ్గయ్య, మల్లికార్జున రావు, రాళ్ళపల్లి, ప్రసాద్ బాబు, జయలలిత, శివాజీ రాజా తదితరులు ఇందులో భాగమయ్యారు. ఇది దెబ్బ తినడానికి కారణం స్టోరీలోని పాయింటే. నిరోషాకు ఎవరో గర్భం తెప్పిస్తే అది ఎవరో పసిగట్టే డిటెక్టివ్ గా మోహన్ బాబు రంగప్రవేశం చేస్తాడు.
ఇదంతా ఓ ప్రహసనంలా మారి సిల్లీ క్లైమాక్స్ తో ముగుస్తుంది. ఒకే ఇంట్లోనే సాగుతూ ఎంతకీ ముందుకు వెళ్లని ఫీలింగ్ కలుగుతుంది. నటుడు కృష్ణభగవాన్ సంభాషణలు కూడా అంతగా పేలలేదు. ఏదో పెద్ద మిస్టరీ బిల్డప్ తో సాగుతుంది కానీ సరైన టెంపో ఎక్కడా ఉండదు. ఉన్నంతలో ఇళయరాజా పాటలు రిలీఫ్ ఇస్తాయి. గుండమ్మ కథలో ప్రేమయాత్రలకు బృందావనంని రీమిక్స్ చేయడం వెరైటీగా క్లిక్ అయ్యింది. ఆడియో పేరు తెచ్చుకుంది కానీ సినిమా మాత్రం బోల్తా కొట్టేసింది. ఇలా ఫస్ట్ టైం క్రేజీ కాంబినేషన్ గా వంశీ-మోహన్ బాబుల కలయికలో వచ్చిన డిటెక్టివ్ నారద ఫైనల్ గా డిజాస్టర్ అనిపించుకుంది. అందుకే క్రియేటివ్ టీమ్, యాక్టర్స్ ఎంత బాగా సమకూర్చుకున్నా అసలైన కథ విషయంలో ప్రేక్షకుల అభిరుచిని గుర్తించి మసలుకోకపోతే ఎలాంటి ఫలితం దక్కుతుందో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ