iDreamPost
iDreamPost
లాక్ డౌన్ వల్ల ఓటిటి విజృంభణ మాములుగా లేదు. థియేటర్ల మూసివేత దీనికి చాలా కలిసి వచ్చింది. హిందీ నుంచి తెలుగు దాకా ఇప్పటికే వీటి తాకిడి ఊపందుకుంది. సెప్టెంబర్ నుంచి పీక్స్ కు వెళ్ళిపోతుందని అంచనా. ఇది గాలి బుడగ లాగా కొంత కాలమే ఉంటుందా లేక సుదీర్ఘ ప్రయాణం చేస్తుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి . అయితే ఇప్పటిదాకా వీటిలో వచ్చినవాళ్ళంతా చిన్నా చితక మరియు మీడియం రేంజ్ హీరోలు హీరొయిన్లు. స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు ఎవరూ ఇంకా రాలేదు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు టాక్.
నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సన్ అఫ్ ఇండియా నేరుగా డిజిటల్ లోనే రిలీజ్ కానుందని సమాచారం. కరోనాకు ముందే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు వచ్చే నెల నుంచి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. డైమండ్ రత్నబాబు దీనికి దర్శకుడు. మంచు ఫ్యామిలీతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. ఈడో రకం ఆడో రకం, గాయత్రి లాంటి సినిమాలకు రైటర్ గా చేశారు. డైరెక్టర్ గా ఆది సాయికుమార్ తో చేసిన డెబ్యు చిత్రం బుర్రకథ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఈ సన్ అఫ్ ఇండియాతో వస్తున్నారు. రీజనబుల్ బడ్జెట్ లో దేశభక్తిని పెంపొందించే విధంగా స్క్రిప్ట్ రూపకల్పన జరిగినట్టుగా తెలిసింది.
మోహన్ బాబు గతంలో ఇలాంటి పాట్రియాటిక్ కథలతో పుణ్యభూమి నా దేశం, మేజర్ చంద్రకాంత్ సినిమాలు చేశారు. వాటికి మించి సన్ అఫ్ ఇండియాని తీర్చిదిద్దుతారట. హీరొయిన్ మిగిలిన తారాగణం లాంటి వివరాలు ఏవీ బయటికి రాలేదు. గత కొంత కాలంగా మేకప్ కు దూరంగా ఉన్న కలెక్షన్ కింగ్ తాజాగా సూర్య ఆకాశమే నీ హద్దురాలో కీలక పాత్ర పోషించారు. దాని తర్వాత స్వంత నిర్మాణంలో సన్ అఫ్ ఇండియా కమిట్ అయ్యారు. చిరంజీవి ఆచార్యలో కూడా చేస్తారని టాక్ వచ్చింది కానీ అది నిజమయ్యే సూచనలు లేవు. ఇప్పుడీ మూవీ డిజిటల్ లో రావడం నిజమైతే హర్షించాల్సిన నిర్ణయమే. థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు మునుపటిలా వస్తారన్న గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఇలా ఓటిటి రూట్లోకి వెళ్ళడమే కరెక్ట్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రావొచ్చు