Idream media
Idream media
నిన్న (జూలై 3) ఎస్వీ రంగారావు పుట్టిన రోజు. కాలం అందరినీ మరిచిపోతుంది. జయంతి, వర్ధంతి తప్ప ఇంకేమీ గుర్తు ఉండవు. అది కూడా ఫేస్‌బుక్‌లో ఎవరో ఒకరు గుర్తు చేస్తారు కాబట్టి.
మా చిన్నతనంలో ANR, NTR కంటే SVR మాకు ఆప్తుడు. మాయబజారు చూస్తున్నప్పుడు నాగేశ్వరరావు విరహ గీతాలు బోరు కొట్టేవి. ఘటోత్కచుడు వచ్చినప్పటి నుంచే మజా. అది పిల్లలు, పెద్దలు ఇద్దరి కోసం కేవీ రెడ్డి తీశాడని అప్పుడు తెలియదు.
ఆయన ముసలి వేషాలే కాకుండా , స్టంట్ సినిమాల్లో కూడా చేశాడు. గూట్లే , డోంగ్రే ఇలాంటి ఊత పదాలతో కిక్కెక్కించాడు.
పులి అడవిలో ఉన్నా , బోనులో ఉన్నా పులి పులేరా డోంగ్రే – ఇది ఆ రోజుల్లో చాలా పాపులర్ డైలాగ్.
ఒకసారి ఒక షాట్‌లో SVR కిరీటం పెట్టుకుని నటించాడు. అదే కంటిన్యూటీ షాట్‌లో కిరీటం లేదు. ఈ తప్పుని గ్రహించిన డైరెక్టర్ రీటేక్ చేద్దామంటే
ఫ్రేమ్‌లో SVR ఉంటే కిరీటం ఎవరు చూస్తారు? అని రీటేక్‌కి ఒప్పుకోని మహానటుడు.
కెరీర్ బిగినింగ్‌లో ఇబ్బంది పడ్డాడు. వరూధిని తొలి సినిమా ఫ్లాప్. పల్లెటూరి పిల్లలో దొంగల నాయకుడిగా (విలన్) చేయాల్సిన వాడు అసిస్టెంట్‌గా ఒక ముసలోడి క్యారెక్టర్‌లో నటించాడు. టైం రాడానికి టైం పట్టింది. ఒకసారి వచ్చిన తర్వాత ఆగలేదు. యశోధాకృష్ణ ఆఖరి సినిమా. ఆ సినిమా ప్రారంభానికి ముందు ఆయన అంతిమ యాత్ర దృశ్యాలు కూడా చూపించారు.
నా చిన్నప్పుడు SVRతో నటించిన నా క్లాస్‌మేట్ ఒకడుండేవాడు. వాడి పేరు నారాయణస్వామి.
ఇదేట్లా జరిగిందంటే రాయదుర్గంలో కొంత మంది డబ్బు సంపాదించుకున్న వాళ్లకి పోగొట్టు కోవాలనే కోరిక పుట్టింది. దాంతో మద్రాస్ వెళ్లి సినిమా తీయాలనుకున్నారు. పేరు జీవితాశయం హీరో కృష్ణంరాజు, హీరోయిన్ విజయనిర్మల, SVR, జయంతి, నాగభూషణం ఇంకెవరో ఉంటారు.
చిన్నప్పటి కృష్ణంరాజు మావాడు. పేరు మాస్టర్ సందేశ్‌కుమార్ అని పేరు పెట్టారు. నిర్మాతకి బంధువు కావడంతో ఈ అవకాశం వచ్చింది. చదువు మానేసి సంవత్సరం మద్రాస్‌లో ఉన్నాడు. చైల్డ్ ఎపిసోడ్‌లో ఒక పాట కూడా (టిక్‌టిక్ చిలకమ్మా) ఉంది. ఈ సినిమా ఆడలేదు. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా దొరకదు.
నారాయణస్వామిని అందరూ సినిమా యాక్టర్‌గా చూస్తే నేను మాత్రం SVRతో నటించిన గొప్ప నటునిగా చూసేవాన్ని. మద్రాస్ నుంచి రాయదుర్గం వచ్చి ప్రభుత్వ హైస్కూల్లో బండల మీద కూచుని చదువు కోవడం వాడికి నామోషీగా ఉండేది. కానీ వేరే దారి లేదు.
SVR చనిపోయిన తర్వాత ఆయన నటించాల్సిన కొన్ని సన్నివేశాల్లో (చల్లని తల్లి సినిమా) మా మిత్రుడు రమణ (తిరుపతి సాక్షి మేనేజర్) తండ్రి నటించాడు. పాకాలలో స్కూల్ టీచర్‌గా ఉన్న ఆయన నాటకాల అనుభవంతో కొంత కాలం మద్రాస్‌లో ఉన్నాడు. తర్వాత ఉద్యోగం పోతుందనే భయంతో పాకాల వచ్చి రిటైర్డ్ అయ్యారు. ఆయన కల SVRకి డూప్‌గా మాత్రమే తీరింది.
SVR బోళా శంకరుడు. కొత్తగా కారు కొన్న రోజుల్లో పాండి బజార్‌లో కారు ఆపి, ఆటోవాడిలా గట్టిగా అరిచి చిన్న ఆర్టిస్ట్‌లకి లిప్ట్ ఇచ్చేవాడు.
పండంటి కాపురంలో బాబూ వినరా (Sad Song ) పాట షూటింగ్‌కి ఫుల్ బాటిల్ తాగి కూడా తొణక్కుండా నటించి కన్నీళ్లు పెట్టించాడు.
కథలు రాశాడు. పులిని వేటాడాడు. పెద్దపెద్ద అవార్డులు తీసుకున్నాడు. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. సంపూర్ణ రామాయణం సినిమాలో మనం చూసి కూడా కరెక్ట్‌గా పలకలేని పెద్దపెద్ద డైలాగుల్ని సింగిల్ టేక్‌తో OK అనిపించాడు. ఇవన్నీ 56 ఏళ్లలోనే చేసేశాడు.
ఈయన గొంతు విని స్వర్గంలోని ఇంద్రుడు కూడా భయపడి ఉంటాడు. యముడు కూడా జడుసుకుని ఉంటాడు తొందరపడి తీసుకెళ్లానని.
That Is SVR