iDreamPost
iDreamPost
గోదావరి జిల్లాలో జరిగే తీర్థాలు… అమ్మవార్ల జాతర్లకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. కొంతమంది దేవుళ్లు, దేవతామూర్తుల ఆలయాలు గ్రామగ్రామాన్న ఉన్నప్పటికీ… కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. అటువంటి ఆలయాల్లో సుబ్రహ్మణ్వేశ్వర ఆలయం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఎన్ని ఉన్నా గోదావరి జిల్లాల్లో ఉన్న అత్తిలి, బిక్కవోలు ఆలయాలకు శతాబ్ధాల కాలం నాటి పురాణ చరిత్ర… ఇక్కడ జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తుల ఆదరణ ఉంది.
సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్టి అనగానే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గుర్తుకు వస్తుంది. మోపిదేవి తరువాత అతి పెద్ద ఆలయం ఇదే. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశర స్వామికి ఏటా జరిగే షష్ఠి తీర్థం అట్టహాసంగా జరుగుతుంది. నాగదోషం.. సంతానం లేనివారు.. వివాహం కానివారు ఎంతోమంది స్వామివారి దర్శనానికి వస్తుంటారు. దశాబ్ధాల కాలంగా ఇక్కడ జరుగుతున్న షష్ఠి తీర్థానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు షష్టిరోజున కనీసం లక్ష మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. మిగిలిన ఉత్సవాలు జరిగే కాలంలో రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు వస్తారు. ఆలయం విశేషం ఏమిటంటే గర్భాలయంలోకి సోమసూత్రం ద్వారా సర్పం స్వామి మూలవిరాట్ వద్దకు వస్తుందని, తరువాత రోజు ఉదయం బయటకు వెళుతుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు. ప్రతీ నెల సర్పం గర్భగుడిలో కాని, చెరువు గట్టు మీద కాని కుబుసం విడిచి వెళుతుంది. దీనిని స్వామి వారి పాదల వద్ద ఉంచుతారు.
Also Read : Vadapalli Venkateswara Swamy Temple – వాడపల్లి.. మరో జలియన్ వాలాబాగ్
తొలి రోజుల్లో ఇక్కడ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద పాముల పుట్ట ఉండేది. దీనికే ప్రజలు పూజలు చేసేవారు. తరువాత స్వామివారు వెలిశారు. ప్రతీ ఏటా మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామివారి కళ్యాణం, షష్టితీర్థం జరుగుతుంది. షష్టి కళ్యాణం రాత్రి స్వామివారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. నాగుల చీర కట్టుకుని, ముడుపులు కడతారు. తరువాత ఆలయం వెనుక భాగంలో కొద్దిసేపు నిద్రపోతారు. సంతానం కలిగిన ఎంతోమంది భక్తులు స్వామివారికి తమ పిల్లల తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.. అలాగే పిల్లల పై నుంచి బూరెలు పోస్తారు. ఈ ఏడాది షష్ఠి మహోత్సవాలు డిసెంబరు 8 నుంచి 22 తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఆలయం ఆవరణలో రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు దర్శనమిస్తాయి.
దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని సందర్శించారు. కోట్లాది రూపాయల వ్యయంతో భారీ కళ్యాణమండపాన్ని నిర్మించారు. షష్టి ఉత్సవాల సందర్భంగా ఏటా ప్రముఖులకు సన్మానం చేస్తారు. మరుగున పడుతున్న రంగస్థలం కళను ఉత్సవాల సందర్భంగా ఆదరిస్తుంటారు. ఎస్.వి.రంగరావు, రేలంగి నర్శింహరావు, అల్లురామలింగయ్య, చిరంజీవి, కృష్ణ, రాజనాల, బ్రహ్మానందం, శ్రీహరి వంటి నటులను ఉత్సవాల సందర్భంగా సత్కరించారు. ఆలయం అందించే సహకారంతోనే అత్తిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల నిర్మాణం జరిగింది. అత్తిలికి రైల్వే స్టేషన్ ఉంది. అత్తిలి సమీపంలో తణుకు మీదుగా ఎన్‌హెచ్ 216ఏ వెళుతుంది.
Also Read : Bhimavaram – ‘మావుళ్లమ్మ’ గురించి తెలుసా ..?
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సైతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉంది. ఈ ఆలయానికి సైతం గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇక్కడ కూడా వారం నుంచి పది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా నృత్యాలు, ఆఘోరా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయానికి 11 శతాబ్ధాల చరిత్ర ఉంది. ఆలయంలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బ్రహ్మచారిగా కొలుస్తారు. ఈ స్వామి అత్యంత తేజస్సు కలిగి చతుర్భుజుడై ఆభయ ముద్రలో దర్శనం ఇస్తారు. స్వామివారి కుడివైపున సహజ సిద్ధమైన పుట్ట ఉంది. ప్రతీ రోజూ పళ్లెంలో పాలు పోసి స్వామివారి పుట్ట వద్ద ఉంచడం ఆచారంగా వస్తుంది. ఇక్కడ కూడా వివాహాలు జరగనివారు, సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకుంటారు. అత్తిలి తరహాలోనే నాగుల చీర ధరించి రాత్రి ఆలయం వెనుకభాగంలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. బిక్కవోలు రాజమహేంద్రవరం, కాకినాడకు దగ్గర. ఈ గ్రామంలో రైల్వేస్టేషన్ ఉంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రం సమీపంలోని రాజమహేంద్రవరం, సామర్లకోట వద్ద ఆగుతాయి.