ఏపీలోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలు, ప్లాట్లు కేటాయించి వారి సొంతింటికలను సాకారం చేసే దిశగా జగన్ సర్కార్ పయనిస్తోంది.
మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్‌ఐజీ (మిడిల్ ఇన్‌కం గ్రూప్ లేఔట్) పథకం అమలు కానుంది. క్యాంప్ కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.
రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్రంలో వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్థలాల కేటాయింపు జరిగేలా చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో కేటాయించనున్నారు. అన్ని పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగాల నియామాల మేరకు ఒక ఏడాది కాలంలో ఈ లేఔట్లను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో డబ్బు చెల్లించే సౌకర్యం కల్పించనున్నారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లను అభివృద్ధి చేసి లబ్ధిదారులకు స్వాధీనపరుస్తారు.
దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో 10 శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేది లోపు ఏది ముందయితే అప్పటికి మిగిలిన 30 శాతం చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5 శాతం మేరకు ఆకర్షణీయమైన రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది.
లేఔట్ల ప్రత్యేకతలు ఇవే..
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్, గవర్నమెంటే లేఔట్ చేస్తుంది.కుటుంబాల అవసరాలను బట్టి 150,200 మరియు 240 చదరపు గజాల స్థలాలు ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది. పర్యావరణ హితంగా ఉండేలా లేఔట్ల విస్తీర్ణంలో 50 శాతం వరకు స్థలం సామాజిక అవసరాలకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్ మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ , వరద నీటి డ్రెయిన్లు, విద్యుదీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకు మరియు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేకంగా స్థలాల కేటాయింపు ఉంటుంది. లేఔట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరియు పట్టణాభివృద్ది సంస్థల ద్వారా సంయుక్త నిర్వహణ చేపడతారు.
Also Read : ఏపీలో జీతాభత్యాల వ్యయం ఎంత..? టీడీపీ ప్రచారంలో నిజమెంత..?