iDreamPost
iDreamPost
సినిమా పుట్టినప్పటి నుంచి ప్రేమ అనేది ఎప్పటికీ వాడిపోని ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. భావోద్వేగాలను సరిగ్గా ఆవిష్కరించాలే కానీ కాసుల వర్షం కురిపించడం ఖాయం. మాస్ అంశాలను మిస్ కాకుండా లవ్ స్టోరీని సరిగా ప్రెజెంట్ చేయగలిగితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఋజువు చేసిన చిత్రాల్లో సింధూర పువ్వుది ప్రత్యేక స్థానం. 1988లో రాంకీ-నిరోషా జంటగా దేవరాజ్ దర్శకత్వంలో తమిళంలో సెంతూర పూవే వచ్చింది. ఓ పల్లెటూరిలో ప్రేమలో పడ్డ ఓ టీనేజ్ జంటకు(రాంకీ-నిరోషా) ఆ అమ్మాయి సవతి తల్లి(విజయ లలిత) నుంచి అడ్డంకులు వస్తుంటాయి. అదే సమయంలో జైలు నుంచి పారిపోయి ఆ ఊరికి వచ్చిన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్(విజయ్ కాంత్) వాళ్లకు అండగా నిలబడతాడు.
దానికో కారణం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఓ దుర్మార్గుడి(ఆనంద రాజ్) వల్ల తన భార్యాబిడ్డలతో పాటు తనకు సహాయకుడిగా ఉంటూ చనిపోయిన పనివాడి చెల్లెలే ఆ యువతి. అందుకే అక్కడే ఉంటూ తనకు చావు దగ్గరగా ఉన్న జబ్బు విషయాన్ని దాచిపెట్టి మరీ వాళ్ళ ప్రేమను గెలిపిస్తాడు. చివరికి ఇద్దరినీ ఒకటి చేసి కన్నుమూసి ఆమె అన్నయ్య ఋణం తీర్చుకుంటారు. చాలా లోతుగా అనిపించే ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. తమిళనాడులో ఏకంగా 200 రోజులు ఏకధాటిగా ఆడి ఆ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకుంది. కొత్త జంటగా రాంకీ-నిరోషాల స్క్రీన్ ప్రెజెన్స్ బ్రహ్మాండంగా పండింది. దెబ్బకు స్టార్లు అయిపోయారు. ఇది నిజంగానే ప్రేమకు దారి తీసి వాళ్ళు ఇంకో ఏడేళ్లలో దంపతులయ్యే దాకా దారి తీసింది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సంగీతం. మనోజ్ – గ్యాన్ జంట ద్వయం ఇచ్చిన ట్యూన్లు ఆడియోలో కొత్త రికార్డులు సృష్టించాయి.
ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఊరు వాడా హోరెత్తిపోయింది. సింధూర పువ్వా తేనె చిందించవా అంటూ పాడుకోని మ్యూజిక్ లవర్ అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. విజయ్ కాంత్ పాత్ర స్ఫూర్తితో ఇలాంటి కథలతో తర్వాత చాలా సినిమాలు వచ్చాయి.సమరసింహారెడ్డిలో బాలకృష్ణ-పృథ్విల ట్రాక్ కి ఇందులో విజయ్ కాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి దగ్గరి సారూప్యత ఉంటుంది. యజ్ఞం, జయం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి ఎన్నో సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్లకు మూలం ఇందులోనే గమనించవచ్చు. తెలుగులో సింధూర పువ్వు సూపర్ హిట్ అందుకుంది. కొన్ని కేంద్రాల్లో వందరోజులు కూడా ఆడటం విశేషం. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు దేవరాజ్ డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలే. 1995లో ఇళయ రాగం తీశాక ఆయన మళ్ళీ ఎందుకో ఇంకో చిత్రం తీయలేకపోయారు. 2016లో కన్ను మూశారు. ఇప్పటికే కల్ట్ క్లాసిక్ గా సింధూరపువ్వుకు కోలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది