iDreamPost
android-app
ios-app

సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిశంసన వెనుక అసలు కారణమదేనా, నిమ్మగడ్డ ప్రతీకార చర్యకు పూనుకున్నారా ?

  • Published Jan 27, 2021 | 4:01 AM Updated Updated Jan 27, 2021 | 4:01 AM
సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిశంసన వెనుక అసలు కారణమదేనా, నిమ్మగడ్డ ప్రతీకార చర్యకు పూనుకున్నారా ?

ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి దూకుడు ప్రదర్శించింది. పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ విషయంలో బదిలీలకు సిద్ధపడినా ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఆ వెంటనే సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ని అభిశంసిస్తూ నిర్ణయం వెలువరించింది. అభిశంసన విషయాన్ని సర్వీసు రికార్డుల్లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల జాబితా సిద్ధం చేయాలనే ఆరోపించింది. వారికి విధుల నిర్వహణకు అర్హత లేదంటూ పేర్కొన్నారు. మొత్తం 8 పేజీల అభిశంసన పత్రంలో ఎస్ఈసీ తీవ్ర పదజాలంతో ఇద్దరు అధికారుల మీద మండిపడ్డారు.

పంచాయితీ ఎన్నికల్లో ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో 3.62 లక్షల మంది యువ ఓటర్లు నిరాశతో ఉన్నారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలయ్యింది. కొత్త ఓటర్లను దూరం పెట్టి పంచాయితీ ఎన్నికలు నిర్వహణపై అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఎన్నికలకమిషన్ ఈ తప్పిదాన్ని పంచాయితీరాజ్ అధికారుల పై నెట్టేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేసిన దశ నుంచి ఎన్నికల పూర్తి చేసే వరకూ పూర్తి బాధ్యత ఎస్ఈసీదే. అయినప్పటికీ ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో న్యాయపోరాటానికే ప్రాధాన్యతనిచ్చిన నిమ్మగడ్డ, ఈ విషయంలో కొంత అశ్రద్ధ చూపినట్టుగా కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం నెపం పంచాయితీరాజ్ శాఖ అధికారుల మీదకు తోసేస్తూ ఏకంగా అభిశంసనకు సిద్ధపడడం విశేషంగా మారింది.

ఓటర్ల జాబితా కోసం నిరంతరం పంచాయితీరాజ్ శాఖ అధికారులతో చర్చిస్తున్నా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారని నిమ్మగడ్డ ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన హామితో పాటుగా కోర్టుకి ఇచ్చిన మాట కూడా తప్పారని మండిపడ్డారు. దాంతో అభిశంసన నిర్ణయం తీసుకున్నారు. అయితే నిమ్మగడ్డ చర్యలను ఏపీ ప్రభుత్వం సరిదిద్దుతామని ప్రకటించింది. ఎన్నికల కమిషనరు ఓ పార్టీ తరుపున కుట్రదారుడిగా వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శులు చేశారు. ఏ తప్పు లేకపోయినా పంచాయితీరాజ్ అధికారులపై చర్యలు తీసుకున్నారని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు . ఎన్నికల కోడ్ ముగియగానే వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఏ అధికారికి అన్యాయం జరగదని, అందరికీ అండగా ఉంటామని వెల్లడించారు.

అభిశంసన విషయంలో కొందరు అధికారుల మీద ఎస్ఈసీ గురిపెట్టడం వెనుక పెద్ద ప్రణాళిక ఉన్నట్టుగా భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేరుగా గోపాలకృష్ణ ద్వివేదితో వాగ్వాదానికి దిగారు. అప్పట్లో ఆయన ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఆయన పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన మీద గురిపెట్టి చర్యలకు పూనుకోవం వెనుక పెద్ద వ్యూహామే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వాస్తవానికి అభిశంసన మూలంగా కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ అవకాశం గానీ, ప్రమోషన్ల విషయంలో గానీ కొంత సమస్య వస్తుంది. అయితే దానిని సర్వీసు రికార్డుల నుంచి తొలగించేందుకు తాము ప్రయత్నిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎస్ఈసీ తీసుకున్న చర్యల కారణంగా అది ఏమేరకు సాధ్యమోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ద్వివేది మీద నిమ్మగడ్డ చర్యలకు ఉపక్రమించడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేసేందుకు ముందుకొచ్చింది. వారి స్థానంలో పూనం మాలకొండయ్య తో పాటుగా మరో ప్రత్యామ్నాయం కూడా ప్రతిపాదించింది. అయినప్పటికీ బదిలీకి నిరాకరించి, అభిశంసనకు సిద్ధం కావడం ప్రతీకార చర్యగా కొందరు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఐఏఎస్ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

ఇద్దరు రాష్ట్ర స్థాయి అధికారులతో పాటుగా చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, తిరుపతి ఎస్పీలను కూడా ఎస్ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో జేసీలకు కలెక్టర్లుగానూ, చిత్తూరు ఎస్సీకి తిరుపతి ఎస్పీగానూ బాధ్యతలు అప్పగించారు. అయితే పంచాయితీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ తిరిగి వారికి యధాస్థానంలో అవకాశం కల్పించే దిశలో ప్రభుత్వం ఉన్నట్టు తాజా ప్రకటన చాటుతోంది.