iDreamPost
iDreamPost
స్టార్ హీరోల బాక్సాఫీస్ యుద్ధం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పరస్పరం తలపడినప్పుడు థియేటర్ల వద్ద వాతావరణం, అభిమానుల సందడి, కలెక్షన్లు రన్ గురించి ఒకరికొకరు గొప్పలు పోవడం ఇదంతా మంచి కిక్ ఇచ్చే టాపిక్. సోషల్ మీడియా వచ్చాక ఇది ఏ స్థాయిలో సాగుతుందో వేరే చెప్పాలా. తాజాగా బాలకృష్ణ బోయపాటి శీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీకి విడుదల తేదీ అనౌన్స్ చేశాక మరోసారి ఈ టాపిక్ చర్చలోకి వస్తోంది. కారణం రవితేజ ఖిలాడీ కూడా అదే మే 28కి రాబోతున్నట్టు గతంలోనే ప్రకటించడం. గతంలో ఈ కాంబో మూడు సార్లు తలపడింది. ఇది నాలుగో సారి. ఓ సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.
2008 సంవత్సరంలో జనవరి 11న వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ‘ఒక్క మగాడు’ విపరీతమైన అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఒక్క రోజు గ్యాప్ తో వివి వినాయక్ డైరెక్షన్ లో రవితేజ చేసిన ‘కృష్ణ’ సూపర్ హిట్ కొట్టేసి ఏకంగా వంద రోజుల పండగ చేసుకుంది. రెండూ కమర్షియల్ సినిమాలే అయినప్పటికీ మాస్ మహారాజాదే పై చేయి అయ్యింది. కట్ చేస్తే 2009లో మే 1వ తేదీ బాలకృష్ణ ‘మిత్రుడు’ వచ్చింది. ఫస్ట్ వీక్ దాటేలోపే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. వారం తిరక్కుండా మే 8న సురేందర్ రెడ్డితో రవితేజ చేసిన ‘కిక్’ ఊహించని రేంజ్ లో కెరీర్ బెస్ట్ అనిపించుకునే స్థాయిలో వసూళ్లు తెచ్చుకుంది.
తిరిగి 2011లో జనవరి 12న దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘పరమవీరచక్ర’ మరీ దారుణంగా బోల్తా కొట్టింది. అభిమానులకే కనీస స్థాయిలో నచ్చలేదు. అదే రోజు హరీష్ శంకర్ తో రవితేజ చేసిన ‘మిరపకాయ్’ మరోసారి సిక్సర్ కొడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోయింది. తమన్ పేరు గట్టిగా వినిపించడంలో దీని పాత్ర చాలా ఉంది. సో ఇక్కడ చెప్పిన మూడు సందర్భాల్లో రవితేజదే పై చేయి అయ్యింది. ఇప్పుడు నాలుగో సారి. బిబి3, ఖిలాడీ రూపంలో మరోసారి బాలకృష్ణ-రవితేజ ఫేస్ టు ఫేస్ ఆడబోతున్నారు. మరి ఈసారైనా పైన చెప్పిన సెంటిమెంట్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.