మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ ఆవిష్కరణలో “మా”లో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రెండుగా చీలిపోయిందని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. సవ్యంగా సాగుతున్న సభలో రాజశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేతిలో ఉన్న మైక్ ని లాక్కుని రాజశేఖర్ మాట్లాడటంతో “మా”లో జరుగుతున్న లుకలుకలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చిరంజీవి,మోహన్ బాబు, కృష్ణం రాజు, మురళి మోహన్, సుబ్బిరామి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి మనందరం కలిసి “మా” అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా రాజశేఖర్ వేదిక పైకి వచ్చి ఆయన చేతిలో నుంచి మైక్ లాక్కుని సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. రాజశేఖర్ ప్రవర్తనకి సభలో ఉన్న చిరంజీవి, మోహన్ బాబుతో పాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
రాజశేఖర్ మాట్లాడుతూ “నిప్పును కప్పి ఉంచితే పొగ రాకుండా ఉండదు”. మనం సినిమాలో హీరోగా నటిస్తున్నాం. కానీ రియల్ లైఫ్ లో హీరోగా పని చేస్తుంటే తొక్కేస్తున్నారని ఆరోపించారు.”మా”లో 26మంది ఉంటే 18 మంది ఒక గ్రూప్ గా మరో 8 మంది మరో గ్రూప్ గా విడిపోయారని స్పష్టం చేసారు. మా అసోసియేషన్ వల్ల మా ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. మార్చిలో “మా” కొత్త కార్యవర్గం ప్రారంభమైన రోజునుండి ఈరోజు వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. “మా” కోసం ఎందుకు అంతలా పనిచేస్తున్నావని మా ఇంట్లో కూడా బాగా తిట్టారని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. కార్ ఆక్సిడెంట్ జరగడం కూడా మాలో ఉన్న గొడవల వల్లనే అని రాజశేఖర్ తెలిపారు.
చిరంజీవి vs రాజశేఖర్
కొన్ని సంవత్సరాల క్రితం నుండి రాజశేఖర్ వెంట వివాదాలు కూడా ప్రయాణం చేసాయి. గతంలో రాజశేఖర్ చిరంజీవి మధ్య కోల్డ్ వార్ నడిచింది. ముఖ్యంగా విజయ్ కాంత్ హీరోగా నటించిన రమణ రీమేక్ హక్కులను రాజశేఖర్ తీసుకోవడానికి ప్రయత్నించగా అల్లు అరవింద్ “రమణ” హక్కులను రాజశేఖర్ కు దక్కకుండా చేసి, చిరంజీవి హీరోగా ఠాగూర్ సినిమా రూపొందించారని రాజశేఖర్ అప్పట్లో ఆరోపించడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం రేకెత్తించింది.. ఆ సినిమా విషయంలో ఏర్పడిన విభేదాలు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత బయటపడ్డాయి.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరతారా అంటూ విలేఖరులు ప్రశ్నించగా సినిమాల్లో చిరంజీవి టాప్ స్టార్ కావొచ్చేమో కానీ, రాజకీయాల్లో మాత్రం గెలవలేరని రాజశేఖర్ వ్యాఖ్యానించడంతో చిరంజీవి అభిమానులు రాజశేఖర్ పై దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు చేసిన దాడికి రాజశేఖర్ కు క్షమాపణలు చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తాన్ని అమ్ముకుంటున్నారని రాజశేఖర్ ఆరోపించారు. రాజశేఖర్ పై పోలీస్ స్టేషన్ పక్కనే కొందరు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఆ తరువాత అనేక ఇంటర్వూలలో చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు రాజశేఖర్. తనపై ఉన్న కోపంతోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో తనను ఇమిటేట్ చేసారని రాజశేఖర్ ఆరోపించారు. కానీ సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో విలన్ పాత్రలు కూడా చేసేందుకు సిద్ధమని రాజశేఖర్ ప్రకటించారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ధ్రువ సినిమాలో విలన్ గా చేయడానికి చిరంజీవిని కలిసి ప్రయత్నాలు కూడా చేసారు. గరుడవేగ సినిమా సమయంలో రాజశేఖర్ కు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో చిరంజీవిని కలిశారు. గరుడవేగ ఫంక్షన్ లో చిరంజీవి సందడి చేయడం ఆ సినిమా హిట్ కావడంతో రాజశేఖర్ మళ్ళీ గాడిలో పడ్డారు.
“మా” ఎన్నికలలో చిరంజీవి సపోర్ట్ చేయడం వల్ల తమ ప్యానెల్ గెలిచిందని రాజశేఖర్ పలు ఇంటర్వూలలో తెలిపారు. కానీ ఎన్నికలలో గెలిచిన కొంతకాలం అనంతరం “మా”లో విభేదాలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇటీవల రాజశేఖర్ కు హైదరాబాద్ శివారులో జరిగిన కార్ ఆక్సిడెంట్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆ కార్ ఆక్సిడెంట్ కి కారణం “మా”లో ఉన్న విభేదాలే అని నేడు పేర్కొనడం కొసమెరుపు.