iDreamPost
android-app
ios-app

వాస్తవాలకు పాతర.. అబద్దాల జాతర – కొత్తపలుకులో వక్రభాష్యం

  • Published Mar 06, 2022 | 8:10 AM Updated Updated Mar 06, 2022 | 11:17 AM
వాస్తవాలకు పాతర.. అబద్దాల జాతర – కొత్తపలుకులో వక్రభాష్యం

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే అది ఒక చోట స్థిరంగా కూర్చుని తినదు. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుపైకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ పైకి దూకుతూ పండగ చేసుకుంటుంది. చివరికి ఆ కొబ్బరి చిప్పను మట్టిలోనో, మురికిగుంటలోనో పారేసుకొనే వరకు అది గెంతుతూనే ఉంటుంది. దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన మనసును నిలువనీయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో కుదేలైన పచ్చమూకలో కొత్త ఉత్సాహం నింపడానికి ఈ తీర్పును ఎలా వక్రీకరించాలి? చెదిరిపోయాయి అనుకుంటున్న పసుపు పచ్చ కలలు నిజం అయ్యే రోజులు వచ్చాయి అని వారికి ఎలా భరోసా కల్పించాలి అని తెగ తాపత్రయ పడుతున్నారు. అందుకే ఈ వారం కొత్తపలుకులో హైకోర్టు తీర్పుపై తనదైన శైలిలో వక్రభాష్యం చెప్పేసి సంబర పడిపోయారు.లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్న అమరావతి ఏకైక రాజధానిగా ఉండడం తనకు, తన బాస్ చంద్రబాబుకు ఎంత అవసరమో తన రాతల ద్వారా పరోక్షంగా బయట పెట్టుకున్నారు.

భావోద్వేగాలు.. పాదాభివందనాలు..

చిమ్మచీకట్లో వేగుచుక్కలా హైకోర్టు తీర్పును రాధాకృష్ణ అభివర్ణించారు. ఇది ఆంధ్రులకు ఊరట ఇచ్చిందని,
విభజనచట్టంలో ది క్యాపిటల్ అని ఉంది కనుక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుందని తేల్చి చెప్పిందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ది క్యాపిటల్ అన్నది సవరించకుండా మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని అభిప్రాయపడ్డారు. ఇంత విస్పష్టమైన తీర్పు ఇచ్చిన హైకోర్టుకు శతసహస్ర కోటి వందనాలు, న్యాయం కోసం పోరాడిన మహిళలకు పాదాభివందనాలు అంటూ రాధాకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు.

ఆ పోరాటం అసామాన్యమట..

మొక్కవోని దీక్షతో అమరావతి రైతులు 807 రోజులు చేసిన పోరాటం వంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొకటిలేదని రాధాకృష్ణ తీర్మానించేశారు. ఎందుకంటే భూములు ఇచ్ఛిన రైతులను ప్రభుత్వం వేధించినా, మహిళలను క్షోభకు గురి చేసినా, ఆందోళనను ముఖ్యమంత్రి గుర్తించక పోయినా క్రమశిక్షణతో వారు ఉద్యమాన్ని నిర్వహించడం, న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేయడం
వేమూరి వారికి పిచ్చిపిచ్చిగా నచ్చేశాయట! ఆ పోరాట వీరుల్లో ఒక భగత్ సింగ్ ను, చంద్రశేఖర ఆజాద్ ను, లాలాలజపతిరాయ్ వంటి వారెందరినో రాధాకృష్ణ దర్శించి ఉంటారు. అందుకే ఆ పోరాటాన్ని ప్రస్తుతించారు. ఈయన ఈ విధంగా రాశారు కనుక ఇన్నాళ్లూ జనం అనుకుంటున్నట్టుగా అది పెయిడ్ ఆర్టిస్టులతో నడిచిన పోరాటం అని, టీడీపీ వారు దాని వెనుక ఉండి నడిపించారని ఇక ఎంతమాత్రం మనం భావించకూడదు. 29 గ్రామాల రైతుల ముసుగులో అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారని మాట్లాడకూడదు. ఎందువల్లనంటే రాధాకృష్ణ ఏమి రాసినా అది చచ్చినట్టు నిజం అయిపోతుందంతే మరి! పైగా మిగిలిన మీడియా పట్టించుకోకపోయినా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు రైతుల పోరాటాన్ని కవర్ చేసి ఒక చారిత్రక కర్తవ్యం నిర్వర్తించిన విషయాన్ని కూడా రాధాకృష్ణ గుర్తుచేశారు. కనుక ఎలా చూసుకున్నా అమరావతి రైతులు చేసిన ఉద్యమం నిఖార్సైనది అనడంలో మనకు ఎటువంటి సందేహం ఉండకూడదు!

అమరావతా.. మజాకా..

అమరావతి విశిష్టత.. అది గుర్తించలేని ప్రభుత్వ అజ్ఞానం గురించి వివరించి రాధాకృష్ణ పాఠకుల కళ్లు తెరిపించారు. పనిలో పనిగా 30 వేల ఎకరాలకు పైబడిన భూమిని పైసా ఖర్చులేకుండా సేకరించారు అని రాసి చంద్రబాబు అఖండమైన మేధాశక్తిని మనకు గుర్తు చేశారు. అమరావతి అద్భుత నగరమని, తన వనరులను తానే సృష్టించుకోగలగడం దాని విశిష్ట లక్షణం అని కీర్తించారు. అయితే అమరావతి తన వనరులను తానే ఎలా సృష్టించు కుంటుందో రాధాకృష్ణ వివరించలేదు. వివరించినా మన బోటి వారికి అర్థంకాదని ఊరుకుని ఉంటారు. బహుశా కోడిగుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చినట్టు అమరావతి నుంచి వనరులు ఊడిపడతాయేమో!

తీర్పును అమలు చేస్తేనే సీఎం జగన్ కు విజ్ఞత ఉన్నట్టు!

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. విధి వక్రీకరించి అధికార మార్పిడి జరిగింది. జగన్ సీఎం అయ్యాక మూడుముక్కలాట మొదలైంది అంటూ రాధాకృష్ణ తన అక్కసును వెళ్లగక్కారు.
అయితే ఆ రెండు తాత్కాలిక కట్టడాలు అని, వానొస్తే నేరుగా నీళ్లు లోపలికి వచ్చే సౌకర్యంతో టీడీపీ సర్కారు వాటిని నిర్మించిన సంగతి ఆయన రాయడం మరచిపోయారు. విజ్ఞతతో హైకోర్టు తీర్పును అమలు చేస్తారా? అప్పీలుకు వెళతారా? అసెంబ్లీలో మళ్లీ చట్టం చేసి కోర్టుతో ఘర్షణకు దిగుతారా? చూడాలి అంటూ వ్యాఖ్యానించి తీర్పును అమలుచేయడమే విజ్ఞత అని వేమూరి వారు నిర్ధారించేశారు. అప్పీలుకు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని సన్నాయి నొక్కులునొక్కారు.
ఒకవేళ సీఎం జగన్ తీర్పును అమలు చేయకపోతే
ఆయనకు అధికారం ఇచ్చిన ప్రజలదే తప్పు అని కూడా తేల్చేశారు!

ఎప్పటిలా ప్రభుత్వంపై కడుపుమంట..

ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ తమవిధానం అని చెబుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై రాధాకృష్ణ తన కడుపుమంటను వెళ్లగక్కారు. వారు సీఎం జగన్ చెప్పిన అంతరంగాన్నే అవిష్కరిస్తున్నారని బాధపడిపోయారు. వారు మాట్లాడే తీరును తనదైన వికృత శైలిలో తప్పుపట్టారు. సీనియర్ ఐఏఎస్ శ్రీ లక్ష్మిపైనా తన అక్కసు వెళ్లగక్కారు. ఈ ప్రభుత్వంపై మంత్రులలో అసంతృప్తి ఉందని, ప్రైవేటు సంభాషణల్లో వారు బాధను వ్యక్తం చేస్తున్నారని రాసేశారు. ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళిన ఇద్దరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఓ తెలంగాణ నాయకుడితో మాట్లాడుతూ రెండు చేతులూ జోడించి
‘మేము ఓడిపోయినా ఫర్వాలేదు. మళ్లీ ఇలాంటి ప్రభుత్వం రాకూడదు’ అన్నారట. అంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై అటు మంత్రులలో, ఇటు ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది అని, అది ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు అని మనం అర్థం చేసుకోవాలన్న మాట!
ఎందుకంటే అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే పచ్చబ్యాచ్ ఉసురు, రాధాకృష్ణ రాతల మహత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పనిచేస్తాయి కదా!

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibomcasibomjojobet