iDreamPost
iDreamPost
ప్రధాని పర్యటనలో భద్రత వైఫల్యంపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని నియమించింది. గత శుక్రవారం వాయిదా పడిన ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం చేపట్టింది. కేంద్రం, పంజాబ్ రాష్ట్రాల వాదనలు విన్న అనంతరం బటిండాలో ఈ నెల ఐదో తేదీన ప్రధాని మోదీ కాన్వాయిని రైతులు అడ్డుకున్న ఘటన.. ఆ సందర్భంగా నెలకొన్న భద్రతా వైఫల్యాలపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. చండీగఢ్ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఐజీ, రిజిస్ట్రార్ జనరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డీజీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అంతకుముందు ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విచారణను సుప్రీంకోర్టు శుక్రవారమే నిలిపివేసింది.
కేంద్ర విచారణపై పంజాబ్ అభ్యంతరాలు
తొలుత వాదనలు వినిపించిన పంజాబ్ రాష్ట్రం తరపు న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వ విచారణపై తమకు విశ్వాసం లేదన్నారు. ఘటనపై వివరణ ఇవ్వాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర విచారణ కమిటీ తమ రాష్ట్ర అధికారులకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ కేంద్ర విచారణపై సందేహాలు వ్యక్తం చేశారు. విచారణ నిలిపివేయాలని తప్పు చెప్పిన తర్వాత కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఏమిటని జస్టిస్ హిమాకోహ్లీ ప్రశ్నించారు. మీరే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలనుకుంటే ఇక మేం ఎందుకని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. భద్రతా ఏర్పాట్లలో లోపం వాస్తవమే అయినా.. నెపాన్ని ఎవరో ఒకరి మీద నెట్టి వేయడం తగదని అన్నారు.
సోలిసిటర్ జనరల్ వివరణ
సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ వీవీఐపీల భద్రతకు సంబంధించిన బ్లూ బుక్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించలేదంటూ.. బ్లూ బుక్ ను కోర్టుకు సమర్పించారు. ప్రధాని కాన్వాయికి 100 మీటర్ల దూరంలోనే నిరసనకారులు ఉన్నారని.. ఆరోజు ఉదయం నుంచి ఆ మార్గంలో గుంపులు తిరుగుతున్నా డీజీపీ దృష్టికి ఆ విషయం రాలేదని, ఆ సమాచారం చేరవేతలో ఇంటెలిజెన్స్ ఐజీ విఫలమయ్యారన్నారు. నోటీసుల జారీపై మాట్లాడుతూ విచారణ నివేదిక ధర్మాసనానికి సమర్పిస్తామని, అంతవరకు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. దీనికి పంజాబ్ న్యాయవాదులు అంగీకరించలేదు. కేంద్ర విచారణ కమిటీలో కేబినెట్ కార్యదర్శి, ఎస్పీజీ ఐజీ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారని.. రాష్ట్రానిదే తప్పని వారు ఇప్పటికే నిర్ధారణకు వచ్చేశారని పేర్కొన్నారు. అందువల్ల స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని కోరారు. దాంతో ఐదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Also Read : భద్రతా వైఫల్యంపై సుప్రీం ఏం చెప్పబోతోంది..?