iDreamPost
android-app
ios-app

బాబును అందుకు మెచ్చుకోవాల్సిందే..!

బాబును అందుకు మెచ్చుకోవాల్సిందే..!

ఇతర విషయాలు ఎలా ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నిజం ఒప్పుకుంటారు. ఐదేళ్ల ముందు చేయనని చెప్పిన తప్పును మళ్లీ చేసి.. చేసిన తప్పును ఒప్పుకోవడం వల్ల నిజంగా చంద్రబాబును అందరూ మెచ్చుకోవాల్సిందే. అధికారంలో ఉండగా పార్టీని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. ఇకపై అలా జరగనివ్వను అని తాజాగా చంద్రబాబు నాయుడు అనంతపురం పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

చంద్రబాబు తీరును ఆది నుంచి గమనించని వారికి నిజంగా బాబులో మార్పు వచ్చింది.. అని అనుకుంటారు. కానీ బాబు ఇలా అనడం ఇది మొదటిసారి కాదన్న విషయం ఆయన తీరును గమనిస్తున్న వారికి తెలుసు. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చే వరకూ పదేళ్ల కాలంలో పలుమార్లు ఈ విషయం చెప్పారు. కారణాలు ఎమైతేనేమీ మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లు ఉన్నారు. మళ్లీ నాడు ప్రతిపక్షంలో ఉన్పప్పుడు చెప్పిన మాటనే నేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ చెబుతున్నారు.

పార్టీ కార్యకర్తల విషయంలోనే కాదు.. ప్రజల విషయంలోనూ బాబు ఇదే తీరులో వ్యవహరించారు. నేను మారాను. నన్ను నమ్మండి… అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు ప్రజలను పదే పదే వేడుకున్నారు. అనుకూల పత్రికలు.. ‘మారిన బాబు’ అంటూ శీర్షికలు పెట్టి బ్యానర్‌ కథనాలు కూడా రాశాయి. తన విధానాలు, ప్రవర్తనపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రియలైజ్‌ అయ్యే బాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ప్రవర్తించారు. అందుకే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఇప్పుడు దూరం అయ్యారు.

అందుకే మళ్లీ పార్టీ కార్యకర్తలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు. రేపో, మాపో.. ప్రజలనుద్దేశించి కూడా ఇలా మాట్లాడరని గ్యారెంటీ లేదు. రుణామాఫీ చేస్తానని చేయలేకపోయా, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చేయలేకపోయా.. కానీ ఈ సారి తప్పక చేస్తాను. నేను మారాను. నన్ను నమ్మండి అని 2024 ఎన్నికలకు ముందు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 2014కు కన్నా భారీ హామీలు ఇస్తూ.. నన్ను నమ్మండి అంటూ మళ్లీ బాబు తప్పక వస్తారని ఆయన గత చరిత్రను బట్టి చెప్పవచ్చు.

Read Also ; బాబు బాటలో సోము వీర్రాజు పయనిస్తున్నారా..?