iDreamPost
iDreamPost
పాలకులు విధానాలు రూపకల్పన చేస్తారు. అధికారులు వాటిని అమలు చేస్తారు. కానీ వర్తమానంలో అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి అధికారులు అడుగు ముందుకేసే పరిస్థితి వచ్చేసింది. నేరుగా రాజకీయ నేతల రూపం దాల్చేసి అధికారిగా విధానాల విషయమై జోక్యం చేసుకునే స్థితి వచ్చేసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రయోజనాల కోసం హఠాత్తుగా ఎన్నికలు వాయిదా వేసిన నాటి నుంచి, పార్క్ హయత్ హోటల్లో సుజనా, కామినేనితో చాటుగా భేటీ అయిన వ్యవహారం వరకూ ఫక్తు పొలిటీషియన్ గా నిమ్మగడ్డ పరిణామం కనిపిస్తోంది.
తాజాగా పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలలో కూడా అదే పరంపర గమనించవచ్చు. ఏపీలో హైకోర్టుకి సంక్రాంతి సెలవులు ఇచ్చే ముందు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం వెనుక నిమ్మగడ్డ వ్యూహం అర్థమవుతోంది. దేశమంతా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ప్రభుత్వానికి దానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. పైగా ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ సాగుతోంది. అమ్మ ఒడి పథకం అమలుకి అంతా సిద్ధం చేశారు. అలాంటి సమయంలో ఎన్నికల కోడ్ ని అమలులోకి తీసుకురావాలనే సంకల్పంతో నిమ్మగడ్డ వేసిన ఎత్తుగడలు విశేషంగా కనిపిస్తున్నాయి.
సరిగ్గా కోర్టుకి సెలవు ఇస్తున్న సంగతి తెలుసుకుని నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా తన నిజరూపాన్ని బయటపెట్టుకున్నట్టు చెప్పవచ్చు. జనవరి 18న తిరిగి కోర్టు సంక్రాంతి సెలవుల అనంతరం తెరుస్తారు. అంతేగాకుండా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోర్టు ఆదేశాలున్నాయి. అయినప్పటికీ కేవలం సీఎస్ నేతృత్వంలోని బృందంతో ఓ పూట చర్చలు జరిపి, ఆ వెంటనే నోటిఫికేషన్ వరకూ వెళ్లడం విస్మకరంగా మారింది. కోర్టులు, ప్రభుత్వ నిర్ణయాలను తాను ఖాతరు చేసేది లేదనే సంకేతాలు నిమ్మగడ్డ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అన్నింటికీ తాను అతీతుడిననే అహంకారంతో ఆయన ఉన్నారనే అభిప్రాయానికి ఆస్కారమిస్తోంది.
స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఇటీవల తీర్మానం కూడా ఆమోదించారు. అయినా నిమ్మగడ్డకు ఒంటెద్దుపోకడ తప్ప, చట్ట ప్రకారం వ్యవహరించాలనే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఎస్ ఈ సీ తీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే సీఎస్ నేరుగా లేఖ రాశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది కూడా తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా ముందుకెళుతుందన్నది ప్రశ్నార్థకం. అయితే కేవలం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే యత్నమే తప్ప నిమ్మగడ్డకు మరో లక్ష్యం ఉన్నట్టు కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది.