iDreamPost
iDreamPost
తమిళ్ లో అగ్ర హీరోల్లో ఒకరి పేరు చెప్పమంటే రజనీకాంత్, అజిత్ తర్వాత గుర్తొచ్చే పేరు విజయ్. అయితే ఈ పేరుతోనే మూడు దశాబ్దాల క్రితం నాగార్జున ఓ సినిమా చేశారంటే ఆయన అభిమానులకు అవగాహన ఉంటుంది కానీ ఇప్పటి తరం సాధారణ ప్రేక్షకులకు తెలుసుండటం తక్కువే. ఆ విశేషం చూద్దాం. 1988వ సంవత్సరం. నాగ్ అప్పటికి ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు దాటింది. చేసిన 12 సినిమాల్లో 5 మాత్రమే మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న టైం. పరుచూరి సోదరులు చెప్పిన ఓ కథ నచ్చడంతో బి గోపాల్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించేందుకు సిద్ధమయ్యారు వెంకట్ అక్కినేని.
ఈ కాంబోలో 87లో వచ్చిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అది మరోసారి రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ‘విజయ్’కు శ్రీకారం చుట్టారు. విజయశాంతి హీరోయిన్ గా, జయసుధ మరో కీలక పాత్రలో, మోహన్ బాబు విలన్ గా నూతన్ ప్రసాద్, శరత్ బాబు, చలపతి రావు, అల్లు, సుత్తివేలు, నర్రా, పిఎల్ నారాయణ తదితరులు ఇతర తారాగణంగా పెద్ద బడ్జెట్ తోనే తెరకెక్కించారు. చక్రవర్తి స్వరాలు సమకూర్చగా ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. ప్రూవ్ అయిన కాంబినషన్ కాబట్టి నిర్మాణంలో ఉండగానే విజయ్ కు క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. క్యాస్టింగ్ కూడా అంచనాలు పెంచడానికి కారణమయ్యింది. సంక్రాంతి కానుకగా విజయ్ 1989 జనవరి 19న విడుదలయ్యింది.
నిజాయితీ కలిగిన మున్సిపల్ కమీషనర్ విలన్ల దుర్మార్గం వల్ల హత్యకు గురవుతాడు. అతని తమ్ముడే విజయ్. అన్నయ్య చనిపోవడానికి ముందే ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. విధవైన వదిన స్థైర్యం కోల్పోకుండా కష్టపడి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల విజయ్ వదిన ముందు జైల్లో దోషిగా ఉండాల్సి వస్తుంది. ఆపై ఏం జరుగుతుందో ఈజీగా ఊహించుకోవచ్చు. విజయ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కమర్షియల్ హంగులు అన్నీ జోడించినా సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువ కావడం, జయసుధ పాత్రకు అవసరానికి మించిన ప్రాధాన్యం దక్కడం ప్రేక్షకులకు రుచించలేదు. కానీ అదే ఏడాది విక్కీదాదా, గీతాంజలి, శివ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. ఆ కారణంగానే మరో డిజాస్టర్ ‘అగ్ని’ ఫలితాన్ని వాళ్ళు పట్టించుకోలేదు.