రాను రాను విడుదల తేదీల క్లాష్ చాలా సంక్లిష్టంగా మారుతోంది. ఆరు నెలల ముందే డేట్లను నిర్మాతలు షెడ్యూల్ చేసి కర్చీఫ్ వేయడంతో కొత్త వాళ్లకు స్లాట్ దొరకడం మహా కష్టంగా ఉంది. అందుకే ఇటీవలి కాలంలో ఒకే రోజు పది సినిమాలు బాక్సాఫీస్ మీద దండెత్తే పరిస్థితి నెలకొంది. వీటిలో ప్రేక్షకులు ఎన్ని చూస్తున్నారన్నది పక్కనపెడితే అనివార్యమైన ఈ పరిణామం ఎవరినీ వదిలి పెట్టడం లేదు. తాజాగా బాబాయ్ అబ్బాయి వెంకటేష్ రానాలకు కూడా ఈ చిక్కు వచ్చినట్టు కనిపిస్తోంది. ముందు అనుకున్న ప్రకారమైతే విరాటపర్వం ఏప్రిల్ 30 నారప్ప మే 14న ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇందులో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కేవలం ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ఆచార్యతో పోటీ పడితే లేనిపోని రిస్క్ అని భావిస్తున్న నారప్ప దాని బదులు ఏప్రిల్ 30నే వద్దామనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆ రోజు విశ్వక్ సేన్ పాగల్ తప్ప ఇంకే సినిమా లేదు. అందులోనూ ఇది డిఫరెంట్ జానర్. అందుకే నారప్పకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని నిర్మాత సురేష్ బాబు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. నిన్నటితో నారప్ప డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. వెంకటేష్ తన పాత్రకు సంబంధించి వర్క్ ని ఫినిష్ చేశారు. బాలన్స్ ఉన్న ఇతర ఆర్టిస్టులతో ఇంకో వారంలో కంప్లీట్ చేసి నేరుగా సెన్సార్ కు సిద్ధమవుతారు. అంటే మార్చ్ లోనే ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవచ్చు.
మరోవైపు రానా విరాట పర్వం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా విడుదల విషయంలో తొందరపడేందుకు సిద్ధం లేదు. ఈ సినిమాతో పాటు నారప్పకు కూడా సురేష్ బాబే నిర్మాత కాబట్టి ఈ డేట్ అడ్జస్ట్ మెంట్లు జరగొచ్చని వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే విరాట పర్వం మే 21న వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. ఇదంతా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాకే అభిమానులకు కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. నారప్పకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కాగా విరాట పర్వంని వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. ఈ మార్పుల సంగతి ఎలా ఉన్నా అభిమానులు మాత్రం బాబాయ్ అబ్బాయి సినిమాలను అతి తక్కువ గ్యాప్ లో చూసుకోవచ్చు