Idream media
Idream media
ప్రధాని మోడీ ప్రెస్‌మీట్.
‘కరోనాని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకి మీరేం సాయం చేస్తారు?’ అడిగారు విలేకరులు.
‘ధర్మం జయిస్తుంది. ధర్మాన్ని నమ్ముకుని రాష్ట్రాలు యుద్ధాలు చేయాలి అన్నాడు’ మోడీ.
‘యుద్ధం చేయాలంటే డబ్బులు కావాలి. మరి ధర్మంతో డబ్బులొస్తాయా? ’
‘ధర్మాన్ని రక్షిస్తే , ధర్మం నిన్ను రక్షిస్తుంది ’
‘కరోనాని ఎదుర్కొంటే , కరోనా భక్షించకుండా ఉంటుంది ’
‘దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ అని మన గ్రంథాల్లో చెప్పారు’
‘మీ వాక్యం తప్పు’
‘తప్పులతోనే గెలవాలి’
‘వలస కూలీల సంగతేంటి?’
‘ఈ జీవితమే ఒక వలస. వేరే లోకం నుంచి అందరం వలస వచ్చిన వాళ్లమే’
విలేకరులు తలగోక్కొని ‘ఫుడ్ కార్పొరేషన్ ధాన్యాన్ని పేదలకి పంచుతారా?’ అని అడిగారు.
‘అన్నం పరబ్రహ్య స్వరూపం. బ్రహ్మాన్ని ఎవరైనా దానం చేస్తారా?’
‘మీరు కార్పొరేట్ పక్షపాతి’
‘కూలీలు లక్షల మంది దొరుకుతారు. అంబానీలు దొరుకుతారా?’
‘లాక్‌డౌన్ తర్వాత మీ ప్రణాళిక ఏంటి? ’
‘నా దగ్గర ప్రణాళికలుండవు. నోట్ల రద్దుతో ఏం జరిగిందో అదే జరుగుతుంది. అన్నీ అవే సర్దుకుంటాయి’
‘రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌లేనా? ఆదుకునేది ఏమైనా ఉందా?’
‘ఆదుకునేది , ఆదరించేది అంతా పైవాడే. మనం నిమిత్తం మాత్రులం’
‘30 కోట్ల మందికి ఉపాధి పోతుంది’
‘నేనొక్క ఉపన్యాసం ఇస్తే జనం ఆకలిదప్పులు మరిచిపోతారా?’
‘చప్పట్లు , దీపాలు తర్వాత ప్రజలకి మీరిచ్చే కొత్త టాస్క్ ఏంటి?
‘శీర్షాసనం, దాని వల్ల లోకం కొత్తగా కనపడి , బతుకు మీద ఆశ పుడుతుంది’
‘ఆ తర్వాత ’
‘తాబేలులా నడవడం అందరూ ప్రాక్టీస్ చేయండి. అదే మన దేశ భవిష్యత్తు’
విలేకరులు తాబేలులా నడుస్తూ ఆఫీస్‌లకు వెళ్లారు.
అప్పటికే వాళ్లను ఉద్యోగాల్లో నుంచి తీసేశారని వాళ్లకి తెలియదు.