చిత్తూరు నాగయ్య ఒక మహాయోగి, గొప్ప నటుడు. ఆకాశాన్ని, భూమిని రెండింటిని సమానంగా చూసినవాడు.
రేణుకా ఫిల్మ్, ప్రొడక్షన్స్ అంటే అది ధర్మసత్రం. ఆకలి వేళకి ఎవరైనా వచ్చి భోజనం చేయవచ్చు నిన్నెవరూ ప్రశ్నించరు. దాని యజమాని నాగయ్య ఠీవిగా వస్తే కష్టాల్లో ఉన్నవాళ్లు చుట్టూ చేరేవాళ్లు. జేబులో ఉన్న డబ్బుని లెక్క పెట్టుకోకుండా బయటకి తీసి సాయం చేసేవారు. 1940లో బంగారు తులం రూ.36. నాగయ్య పారితోషకం రూ.లక్ష.
డిసెంబర్ 30, 1973 నాగయ్య మరణించాడు. (ఈ రోజుకి 46 ఏళ్లు) నాగయ్య శవాన్ని చూడడానికి MGR వచ్చారు. ప్రశాంతంగా శాశ్వత నిద్రలో ఉన్న నాగయ్యని చూసి ఆయన కంటతడి పెట్టారు. నాగయ్య మేనల్లుడిని పిలిచి అడిగితే అంత్యక్రియలకు డబ్బులు లేవని తెలిసింది. రూ.5 వేలు ఇచ్చి MGR నాగయ్యని గౌరవించారు.
చిన్నతనంలో నాగయ్య అంటే భయం నాకు. ఆయన తెరమీద కనిపిస్తే గుండెపోటుతో పోయేవారు. పోతూపోతూ కథని ఏదో మలుపు తిప్పేవారు. పెద్దవాళ్లని గుర్తు పట్టడానికి మనకీ ఎంతోకొంత వయస్సు రావాలి.
యోగి వేమన చూసి నాగయ్యకి దండం పెట్టుకున్నా. ఒక సన్నివేషంలో పరుసవేది విద్య లభించిందనే సంతోషం, అన్న కూతురు చనిపోయిందనే కన్నీరు, ఏకకాలంలో ఆయన పలికించిన భావాలు, నాగయ్య మాత్రమే చేయగలరు.
భక్తపోతనలో పోతన ఇలాగే ఉంటాడా అనిపిస్తుంది. శ్రీనాథుడిగా గౌరీనాథశాస్త్రి, పోతనగా నాగయ్య పోటాపోటీగా ఉంటారు.
చిత్తూరులో పుట్టిన నాగయ్య, టీటీడీ వారి సాయంతో చదువుకున్నారు. తర్వాత జర్నలిస్టుగా పనిచేశారు. బీఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డి దృష్టిలో పడిన తర్వాత నాగయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.
జీవితంలో జురిగిన అనేక సంఘటనలు ఆయన్ని వైరాగ్యం వైపు నెట్టాయి. మొదటి భార్య చనిపోయారు, బిడ్డ కూడా చనిపోయింది. రెండో భార్య గర్భవతిగా ఉండి చనిపోయారు. జీవితం ఒక గాలి బుడగ లాంటిది, ఉన్నంతలో పది మందికి సాయం చేయాలని అనుకున్నారు, చేశారు.
తిరువాన్కూరులో ఏనుగు మీద ఊరేగి, రాజుగారి సింహాసనం మీద కూర్చొని సన్మానం అందుకున్న నాగయ్య, చివరి రోజుల్లో రూ.500కు కూడా వేషాలు వేశారు.
ఆయన ప్రతిభ గురించి తెలియని మూర్ఖులు ఉదయం 7 గంటలకు గడ్డాలు, మీసాలు అతికించి మేకప్ వేసి, సాయంత్రం షాట్‌కి పిలిచేవాళ్లు. ఆ రోజుల్లో గడ్డానికి వాడే గమ్ చాలా హింస పెట్టేది. అదంతా చిరునవ్వుతో భరించేవాడు.
తొలిరోజుల్లో హాస్యనటుడు పద్మనాభం, నాగయ్య ఇంట్లోనే భోజనం చేసి, అక్కడే ఉండేవాడు. వేషాలు లేని నటులకి నాగయ్య ఇల్లు ఒక దేవాలయం. తర్వాత రోజుల్లో పొట్టిప్లీడర్‌లో చిన్న వేషం వేసినందుకు పద్మనాభం రూ.10 వేలు ఇస్తే, ఇది చాలా పెద్ద మొత్తం నాయనా అన్నాడట.
ఈ డబ్బులు వేషానికి కాదు, దిక్కులేని నన్ను ఒకప్పుడు ఆదరించినందుకు అని పద్మనాభం అంటే “అప్పుడు నా ఇంట్లో నీకే ఇబ్బంది కలగలేదు కదా” అని అడిగాడట. దట్ ఈజ్ నాగయ్య.
ప్రపంచం దృష్టిలో నాగయ్య లౌక్యుడు కాకపోవచ్చు. బతకడం తెలియకపోవచ్చు. భోళా మనిషి, ముందు చూపులేని వాడు. ఇలా ఎన్ని మాట్లాడినా నాగయ్య ప్రపంచం వేరు. జీవితంలోని మకిలిని, కల్మషాన్నిఅంటించుకోకుండా జీవించిన వాడు. ఆకలితో ఉన్న ప్రతివాడికి అన్నం పెట్టిన వాడు.
అందుకే ఆ ముఖంలో అంత స్వచ్ఛత. లవకుశ చూస్తే వాల్మీకీ ఇలాగే ఉండేవాడా అనిపిస్తుంది. దుక్కపు జీరతో “కష్టాలు శాశ్వతంగా ఉంటాయా తల్లీ” అని సీతమ్మతో అంటాడు.
ఏదీ శాశ్వతం కాదని తెలిసిన నాగయ్య ఒక మహర్షి, మహానటుడు. చెన్నై పానగల్ పార్క్‌లో, ఫిల్మ్‌నగర్‌లో ఉన్న (హైదరాబాద్) నాగయ్య విగ్రహాలు ఈ రోజు ఒక చిన్న పూలమాలకైనా నోచుకున్నాయో లేదో!