Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం చంద్రబాబునాయుడుకు మింగుడు పడడం లేదు. కారణం.. ఆ నిర్ణయం బీసీలను జగన్ కు మరింత దగ్గరగా.. బాబుకు మరింత దూరంగా చేస్తుందనే భయమే. టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబుకు రైట్ హ్యాండ్, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు బీసీ కార్డును వాడుకుని చంద్రబాబు రాజకీయాలు చేయాలని భావించారు. బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ హడావిడి చేసి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. కానీ.. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా బీసీలు ఎన్నడూ లేని రీతిలో లబ్ధి పొందుతుండడంతో బాబు ప్రయత్నాలు ఫలించ లేదు. దీనికి తోడు జగన్ ఆయా వర్గాలవారికి అనేక పథకాల్లో అధిక ప్రాధాన్యతనిచ్చి శాశ్వత లబ్దిని చేకూరుస్తూ పరిపాలిస్తున్నారు. బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించిన మొదటి వ్యక్తి గా జగన్ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఏడాదిలోనే 1,78,42,048 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు లబ్ది చేకూర్చారు. దుర్గ గుడి పాలక మండలిలో తొలిసారిగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. కృష్ణా ఏఎంసీలో కూడా వారికే స్థానం దక్కేలా చేశారు.
తాజా నిర్ణయంతో మరింత ఆసరా..
బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయంపై బీసీల కష్టాలు తెలుసుకునేందుకు అధ్యయన కమిటీ వేసిన జగన్ వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. 30 వేల జనాభా దాటిన ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు బీసీల కార్పొరేషన్ లకు ఆమోద ముద్ర వేశారు. మాటలు కాదు… ఇచ్చిన హామీ నిలబెట్టుకుని చేతల ముఖ్యమంత్రిగా మరో మారు రుజువు చేసుకున్నారు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేట్ పదవులు, నామినేట్ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. అలాగే క్యాబినెట్ లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. ఇప్పుడు 30 వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్, డైరెక్టర్లను నియమిస్తారు. త్వరలోనే కార్పొరేషన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తేడా చూపించారు…
తెలుగుదేశం బీసీ లను ఓటు బ్యాంకుగా వాడుకుంటే.. పాదయాత్రలో బీసీల కష్టాలు తెలుసుకున్న జగన్ వారిలో సంతోషం నింపేలా చర్యలు తీసుకుంటున్నారని ఆ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ బీసీల ఆత్మబంధు అని, బడుగు, బలహీన వర్గాల హృదయంలో నిలిచిపోతారని కొనియాడుతున్నారు. ఎప్పటికీ బీసీలంతా ఆయనే వెంట ఉంటామని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి బీసీలు టీడీపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వారు ఆరోపిస్తున్నారు. జగన్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం చంద్రబాబుకు షాక్ మీద షాక్ ఇస్తోంది. ఆయనకు పెరుగుతున్న మద్దతు చూసి టీడీపీ నేతలకు నిద్ర కరువవుతోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.