iDreamPost
android-app
ios-app

భార‌త ర‌క్ష‌ణ శాఖ అమ్ముల‌పొదిలో… సుఖోయ్ యుద్ధ విమానాలు

భార‌త ర‌క్ష‌ణ శాఖ అమ్ముల‌పొదిలో… సుఖోయ్ యుద్ధ విమానాలు

భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ఒక‌వైపు.. పాకిస్తాన్ ఉగ్రవాదుల చొర‌బాటు మ‌రోవైపు.. ఇరువైపులా కుట్ర‌ల‌ను భ‌గ్నం చేసేందుకు భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అచంచెల శ‌క్తితో కూడిన ఆయుధ బాంఢాగారాన్ని స‌మ‌కూర్చుకుంటోంది.

రక్షణశాఖ అమ్ముల పొదిలోకి మరిన్ని అధునాతన అస్త్రాలను చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్ర‌మంలోనే… రక్షణ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మ‌రిన్ని యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత విమానాల అధునీకరణకు డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) అనుమ‌తి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో రూ.38,900 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం లభించింది. వీటిలో రూ.31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు. అలాగే, 21 మిగ్‌-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే రష్యా నుంచి అత్యాధునిక ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత యుద్ధ విమానాల ఆధునీకరణకు రూ.7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా, రూ.10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. గత కొంతకాలంగా యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని భారత వాయుసేన కోరుతోంది. ఈ మేర‌కు రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధ విమానాలకు ఆమోదం తెల‌ప‌డం శుభ ప‌రిణామం. దీంతో పాటు భారత వాయుసేన, నౌకాదళానికి అదనంగా 248 అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిసైల్స్‌ను సమకూర్చనుంది. వెయ్యి కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్‌ తయారీకి రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. ఈ క్షిపణులను డీఆర్డీవో తయారుచేయనుంది. ఇవి త్రివిద దళాలకు చేరితే భారత రక్షణ వ్యవస్థ ప‌టిష్ట‌త‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లేన‌ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.