iDreamPost
android-app
ios-app

TDP, Chandrababu, Kuppam. Lokesh -కుప్పంలో అంత పట్టుఉంటే ఎందుకీ తిప్పలు?

  • Published Nov 12, 2021 | 5:16 PM Updated Updated Nov 12, 2021 | 5:16 PM
TDP, Chandrababu, Kuppam. Lokesh -కుప్పంలో అంత పట్టుఉంటే ఎందుకీ తిప్పలు?

కుప్పం ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైఎస్సార్‌ సీపీకి లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ  వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ఎప్పటిలా నిరాధార ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికార పార్టీ నేతలు ఎవరూ రాలేదని అన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు.

రెండున్నరేళ్లుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే గడచిన పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌ సీపీకి జనం ఎందుకు పట్టం కడతారు అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అలా పట్టం కట్టడం వల్లే కదా ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కడ పుట్టి మునుగుతుందో అన్న భయంతోనే కదా లోకేశ్‌ ప్రచారానికి వచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. నామినేషన్‌ దాఖలు చేయడానికి సైతం చంద్రబాబు రాకపోయినా ఏడుసార్లు ఎమ్మెల్యేగా కుప్పంలో జనం గెలిపించారు. అయినా నియోజకవర్గ జనాన్ని పట్టించుకోకపోవడం వల్లే పార్టీ గెలుపు ప్రశ్నార్థకం అయిందని వైఎస్సార్‌ సీపీ నాయకులు చేసే విమర్శలకు లోకేశ్‌ ఏం సమాధానం చెబుతారో?

ఏకగ్రీవాన్ని అవమానించడం తగునా?

25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో దొంగదారిన ఒక వార్డును వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. మిగిలినవన్నీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి ఆ పార్టీకి బుద్ది చెప్పాలని కోరిన లోకేశ్‌ ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికల ప్రక్రియను అవమానించారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ ఎన్నికల్లో ఏకగ్రీవం జరిగినా అధికార వైఎస్సార్‌ సీపీ నాయకులు దౌర్జన్యం చేశారని, దొడ్దిదారిన గెలిచారని చంద్రబాబు, లోకేశ్‌ తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల అక్కడి ప్రజలను, ఎన్నికల అధికారుల పనితీరును చులకన చేయడం అవుతోందన్న సంగతి గుర్తించడం లేదు. తాము గెలిస్తే అంతా సక్రమంగా జరిగినట్టు లేకుంటే దొంగదారిన గెలిచినట్టు ప్రచారం చేయడం భావ్యమా?

సేమ్‌ డైలాగ్‌ రిపీట్‌…

తనపై 11 కేసులు పెట్టారు.. మెుదటి కేసుకు కాస్త జంకాను.. ఆపై ప్రజల కోసమే కదా అని అలవాటు పడ్డానని లోకేశ్‌ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వింటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచుగా చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం వైఎస్సార్‌ సీపీ నాయకులు తనను ఎంతగా దూషించినా, అవమానించినా సహిస్తున్నాను అని బాబు అనేవారు. ఒక్కపక్క వైఎస్సార్‌ సీపీ నాయకులను తీవ్రమైన ఆవేశంతో దూషిస్తూనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ జనంలో సానుభూతి, సానుకూలత సంపాదించాలని ప్రయత్నించేవారు. అదే తరహాలో లోకేశ్‌ వ్యవహరిస్తూ అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనపై పెట్టిన 11 కేసులు ఏమిటి? అన్నది జనానికి చెబితే అవి ప్రజల కోసం పెట్టినవా? లోకేశ్‌ వాచలత్వం, నిబంధనల అతిక్రమణ వంటి వాటిపై పెట్టినవా అన్నది తెలిసేది.

ఆత్మ గౌరవ సమస్య ఏముంది?

కుప్పం ఎన్నికలు ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినవని, కచ్చితంగా వైఎస్సార్‌ సీపీకి ఓటుతో బుద్ధి చెబుతారని లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ అసలు ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం ఏముంది? టీడీపీని గెలిపించకపోతే అక్కడి ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతిన్నట్టా?

కుప్పంకు చెందిన సామాన్య ప్రజలు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రన్నను కలిసేందుకు వస్తే.. మంత్రులను కాదని వారితో మాట్లాడి.. వారి సమస్యలు విని.. తీర్చి పంపేవారని లోకేశ్‌ చెప్పిన గొప్పలు మరీ విడ్దూరంగా ఉన్నాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తన తండ్రి హయాంలో కుప్పం మున్పిపాల్టీలో చేసిన అభివృద్ధిని చెప్పకుండా ఆయనను ప్రజలను కలవడానికి అవకాశం ఇవ్వడమే మహద్భాగ్యం అన్నట్టు మాట్లాడటమేమిటి? ఇక్కడి ప్రజల గుండెల్లో దేవుడులా గూడుకట్టుకున్న చంద్రన్న ఉన్నంత వరకూ ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే… కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

నిజంగా కుప్పంలో చంద్రబాబుకు అంత పట్టు ఉంటే మున్సిపాల్టీ ఎన్నికల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని వస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారు. పార్టీ ఇన్‌చార్జులను నియమించడం, రోజుకు నాలుగైదు సార్లు వారితో ఫోన్‌లో మాట్టాడడం, హద్దులు మీరిన భాషను ప్రత్యర్థులపై ఉపయోగించడం వంటి తిప్పలు ఎందుకు అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.

Also Read : Kuppam Peddireddy -ఒక్క ఏక‌గ్రీవంతోనే కుప్పం టీడీపీలో క‌ల‌క‌లమా?