iDreamPost
android-app
ios-app

హర్షకుమార్ కలలు నెరవేరేనా?

  • Published Sep 05, 2021 | 4:42 AM Updated Updated Sep 05, 2021 | 4:42 AM
హర్షకుమార్  కలలు నెరవేరేనా?

జీవీ హర్షకుమార్. గోదావరి జిల్లాలకు చెందిన ఈ మాజీ ఎంపీ రాజకీయ ప్రస్థానం అంతా ఎగుడుదిగుడులే. అనేక ఆటుపోట్లతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. విద్యార్థి జీవితం నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించారు. చిన్న వయసులోనే అవకాశాలు దక్కించుకుని ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కానీ ఆయనకు విజయం దక్కడానికి రెండు దశాబ్దాల కాలం పట్టిందంటే ఆశ్చర్యమేస్తుంది. ఆ తర్వాత దశాబ్దకాలం పాటు తిరుగులేని అధికారం అనుభవించారు.

కానీ గడిచిన దశాబ్దకాలంగా ఆయనకు మళ్లీ గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఇప్పట్లో ఆయన కష్టాలు తీరేనా అనే సందేహాలు వస్తున్నాయి. భవితవ్యం చుట్టూ చీకటి అలముకున్నట్టుగా అనుచరులు సైతం సందేహిస్తున్నారు.

ఎస్సీ వర్గీకరణ కాలంలో హర్షకుమార్ తనదైన మార్క్ చూపించారు. మాల కులస్తుల్లో పట్టు సాధించేందుకు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం తోడ్పడింది. దాంతో ఆయనకు రాజకీయ అవకాశాలు ఏర్పడ్డాయి.

విద్యార్థిగా ఆంధ్రాయూనివర్సీటిలో ఎన్ఎస్ యూఐ నేతగా ప్రస్థానం ప్రారంభించిన హర్షకుమార్ కి యూత్ కోటాలో 1985లోనే తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పట్లో ఆయన పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆతర్వాత రాజమండ్రి కేంద్రంగా రాజకీయాలు నడిపినప్పటికీ మళ్లీ బరిలో దిగే అవకాశం దక్కలేదు. ఆకాలంలో ఓబీసీ నేతగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద గుర్తింపు దక్కించుకున్న వీ హనుమంతరావుకి ఫాలోవర్ గా హర్షకుమార్ మారారు. వైఎస్సార్ వ్యతిరేక వర్గీయుడిగా ముద్రవేసుకున్నారు.హర్ష కుమార్ మీద 90ల మొదటిలో హత్యాయత్నం జరిగింది. హర్ష చనిపోయాడనుకొని ప్రత్యర్ధులు వదిలేసి వెళ్లారు. చాలా నెలల చికిత్స తరువాత హర్ష కుమార్ కోలుకున్నారు.

రాజమండ్రి మునిసిపల్ కార్పోరేషన్ కి తొలిసారిగా జరిగిన ఎన్నికలలో మేయర్ స్థానం కోసం బరిలో దిగారు. కానీ టీడీపీ అభ్యర్థి చక్రవర్తి చేతిలో 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. చివరకు 2004 పార్లమెంట్ ఎన్నికలలో అమలాపురం నుంచి బరిలో దిగి తొలిసారిగా విజయం రుచిచూశారు. ఢిల్లీలో సోనియా గాంధీ అనుచరులకు దగ్గరయ్యారు. అధిష్టానం ఆశీస్సులు దక్కించుకున్నారు. చివరకు 2009 ఎన్నికల్లో నేరుగా సోనియా ఆదేశాలతో రెండోసారి టికెట్ ఆయనకు దక్కింది. విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత అనూహ్యంగా హర్షకుమార్ తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయాలకు పెద్ద అడ్డంకిగా మారాయి.

Also Read : పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…

తొలుత తెలంగాణా ఉద్యమానికి మద్ధతు ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగితే వర్గీకరణ సమస్య పరిష్కారమయిపోతుందనే సూత్రీకరణ చేశారు. చివరకు కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో చేరి సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కనిపించారు. ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం కోసం పార్లమెంట్ నుంచి సస్ఫెండ్ చేసిన ఆరుగురు లోక్ సభ ఎంపీలలో ఒకరిగా మిగిలారు. కానీ వైఎస్సార్ మరణం తర్వాతి పరిణామాల్లో జగన్ మీద, వైఎస్సార్ మీద చేసిన వ్యాఖ్యలు హర్షకుమార్ కి రాజకీయంగా తీవ్ర నష్టం చేసినట్టు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆయన ఎంపీగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడితే నేరుగా జగన్ రాజమండ్రి వెళ్లి ఆస్పత్రిలో ఉన్న హర్షకుమార్ ని పరామర్శించారు. అయినా పనిగట్టుకుని జగన్ మీద విమర్శలు చేయడం మానలేదు.

వైఎస్సార్ నేతృత్వంలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్న హర్షకుమార్ ఆ తర్వాత 2014 ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి చంద్రబాబు పాదాభివందనం చేయటం ఆయన అనుచరుల్లో వ్యతిరేకత తీసుకొచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కలేదు. దాంతో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల కాంగ్రెస్ నేతగా నిత్యం జగన్ మీద విమర్శలకు దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవల హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ వివాదాస్పద చర్యలతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

ఏపీసీసీ చీఫ్‌ గా శైలజానాథ్ స్థానంలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్న హర్షకుమార్ కి ఇది ఆటంకంగా మారింది. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో కీలకంగా మారాలని భావిస్తుంటే ఇలాంటి పరిణామాలు బ్రేకులు వేస్తున్న తరుణంలో హర్షకుమార్ ఆందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో విజయాల కన్నా ఎక్కవ ఓటములను చవిచూసిన హర్షకుమార్ కి ఇప్పుడు పరిస్థితి అంతా గందరగోళంగా కనిపిస్తోంది. దాంతో ఆయనలాంటి సీనియర్ నాయకుడు చివరకు మరో అవకాశం సాధిస్తారా లేదా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Also Read : చంద్రబాబు ఐదేళ్ళు, జగన్ రెండేళ్లు: ఆర్థిక పరిస్థితిపై ఎందుకీ రాద్ధాంతం?