iDreamPost
android-app
ios-app

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

  • Published Sep 11, 2021 | 10:47 AM Updated Updated Sep 11, 2021 | 10:47 AM
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

ముఖ్యమంత్రులను అర్థాంతరంగా మార్చేసే దుస్సంప్రదాయం గతంలో కాంగ్రెసులో ఉండేది. ఇప్పుడు ఆ జాఢ్యం బీజేపీకి కూడా పాకింది. కేంద్రంలో అధికారాన్ని కాంగ్రెస్ నుంచి హస్తగతం చేసుకున్నట్లే.. సీఎంలను మార్చే అలవాటును కూడా చేజిక్కించుకుంది. బీజేపీ ఆడుతున్న వైకుంఠపాళీలో తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పావుగా మారారు. ఎవరూ ఊహించని రీతిలో శనివారం మధ్యాహ్నం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గాంధీనగర్ లో జరిగిన పార్టీ సమావేశం ముగిసిన వెంటనే రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ దేవవ్రత్ కు పంపడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

గత ఐదు నెలల్లో నాలుగో సీఎం

అధికారాన్ని కాపాడుకునే క్రమంలో బీజేపీ ఆడుతున్న సీఎం కుర్చీల ఆటలో కుర్చీ కోల్పోయిన నాలుగో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. ఆయనకు ముందు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మూడు నెలల వ్యవధిలోనే అక్కడి సీఎంలు త్రివేంద్ర సింగ్, తీరథ్ సింగులను మార్చి పుష్కర్ సింగ్ దమీని పదవిలో కూర్చోబెట్టారు.

గత జూలైలో 75 ఏళ్ల వయసు నిబంధన పేరుతో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను గద్దె దించేశారు. తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీని పదవి నుంచి తప్పించారు. ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు కలకలం రేపుతున్నాయి.

Also Read:మిథున్ ప్రత్యేకమైన యువనాయకుడు

కాగా 2017 ఎన్నికలకు దాదాపు 16 నెలల ముందు ఇదే గుజరాత్ లో అప్పటి సీఎం ఆనంది బెన్ పటేల్ ను ఇలాగే తప్పించి విజయ్ రూపానీని కూర్చోబెట్టారు. సరిగ్గా అదే రీతిలో ఎన్నికలకు 15 నెలల ముందు రూపానీని తప్పించడం విశేషం. ఆనంది పటేల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు.

2017 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని స్థాయిలో పుంజుకొని ఏకంగా 78 స్థానాలు గెలిచింది. బీజేపీ 99 స్థానాలు గెలిచింది. 182 సీట్లు ఉన్న గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 92 కావడం గమనార్హం. అంటే భారీ విజయం మీద నమ్మకం పెట్టుకున్న బీజేపీ జస్ట్ గట్టెక్కింది. 17 స్థానాలున్న ఆరు జిల్లాలో బీజేపీకి ఒక్క స్థానం కూడా రాకపోవటం ఆ ఎన్నికల్లో పెద్ద విచిత్రం . అహ్మదాబాద్ లోని 21 స్థానాల్లో 17,వడోదరాలోని 10 స్థానాల్లో 9,సూరత్లోని 12 స్థానాలకు గాను 12 గెలవటం వలన బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అంటే బీజేపీ గెలుపు రాష్ట్ర వ్యాపితం అనటం కన్నా కేవలం అతికొద్ది పట్టణాలకే పరిమితమైన గెలుపు. ఆ ఎన్నికల్లో యువ త్రయం హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ ప్రభావం బిజెపికి వ్యతిరేకంగా బాగా పనిచేసింది.

గత 2017 ఎన్నికల అనుభవం దృష్ట్యా ఈసారి బలమైన, ప్రజాదరణ ఉన్న నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి 2022 చివరిలో జరిగే ఎన్నికలకు సిద్దమవ్వాలన్న ఆలోచనతోనే రూపానీని రాజీనామా చేయించారన్న ప్రచారం జరుగుతోంది.

Also Read:సదస్సులు కాదు.. కార్యకర్తల మీటింగ్‌ పెట్టాలంటున్న జేసీ

విజయవంతమైన సీఎం

రాష్ట్ర పాలనలో వైఫల్యం, పార్టీలో వర్గపోరును కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో రూపానీని పదవి నుంచి దించేసినట్లు తెలుస్తోంది. కానీ వాస్తవానికి ఆయన విజయవంతమైన సీఎం 2016 నుంచి ఐదేళ్లు సీఎంగా పని చేశారు. తాను సీఎం అయ్యేనాటికి పాటీదార్ రిజర్వేషన్ల ఉద్యమం, మద్దతు ధరల కోసం రైతుల ఉద్యమాలు జోరుగా సాగుతుండేవి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా 2017 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురాగలిగారు.

నరేంద్ర మోదీ తర్వాత గుజరాత్ కు ముఖ్యమంత్రులైన ఆనందిని ,ఓజాయ్ రూపాని ఇద్దరు కూడా ఐదేళ్ల పూర్తికాలం సీఎంగా పనిచేయలేకపోవటం గమనార్హం. గతంలో స్థిరమైన నాయకత్వం నినాదంతో ఎన్నికలు వెళ్లినా బీజేపీ ఈ మధ్య తరచుగా సీఎంలను మార్చటం పరిపాటయ్యింది.

Also Read: WTC ట్విన్ టవర్స్,లాడెన్,సద్దాం,ఐసిస్ ,మళ్ళీ తాలిబన్- 20 ఏళ్ళలో జరిగింది ఇదే