ఈ మధ్య కాలంలో ఒక సినిమా మీద ఇంత చర్చ జరగలేదు. జార్జి రెడ్డి సినిమాలో జార్జి ఆదర్శాల గురించి,ఆనాటి సాంఘీక ,రాజకీయ పరిస్థితుల గురించి ,జార్జికి వర్గ శత్రువులు ఎందుకు తయారయ్యారో సినిమాలో చూపిస్తారా? అనుమానమే,బులెట్ పాట చూస్తే అర్ధమవుతుంది.
25 సంవత్సరాలు మాత్రమే జీవించి 47 సంవత్సరాల కిందట మరణించిన ఒక యువకుడి గురించి ఐదు దశాబ్దాల తరువాత కూడా ఎందుకు చర్చ జరుగుతుంది? జార్జి రెడ్డి తరువాత ఎవరూ చంపబడలేదా? వాళ్లెవరి గురించి జరగని స్థాయిలో జార్జి రెడ్డి గురించి ఎందుకు చర్చ?
ఒక మరణం ఒక ఉద్యమానికి ఊపిరి పోసింది, ఆ ఉద్యమం నాలుగు దశాబ్దాలు సమాజాన్ని ప్రభావితం చేసింది.మూడు దశాబ్దాల పాటు ఆ ఉద్యమం ప్రభావితం చెయ్యని ఊరు ఉమ్మడి రాష్టంలో లేదంటే అది అబద్దం కాదు. ఆ ఉద్యమం PDSU ,ఆ PDSU నుంచి సాయుధపోరాటంలో వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు,ఐఏఎస్ ,ఐపీస్ లాంటి పైస్థాయి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. ఆ ఉద్యమంలో పనిచేసిన వారు ఇప్పుడు రాజకీయల్లో చాలామందే ఉన్నారు.
ఆయన తల్లి తండ్రుల కులం,మతం గురించి కాదు.వారి ఆదర్శాల గురించి తెలుసుకోవాలి. తండ్రి చల్లా రఘునాథ్ రెడ్డి,తల్లి లీలా వర్గీస్ మద్రాస్ లో కాలేజ్ సహాధ్యాయులు. రఘునాథ్ రెడ్డి సోదరుడు సి.కే.నారాయణరెడ్డి సిపిఐ తరుపున చిత్తూర్ జిల్లా పీలేరు నుంచి 1962లో ఎమ్మెల్యేగా గెలిచారు.1967లో సిపిఎం తరుపున పోటీచేసి ఓడిపోయారు. దీన్ని నుంచి తెలుసుకోవలసింది జార్జి రెడ్డి కుటుంబం కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్నదని. తల్లి తండ్రులు మతాంతర వివాహం చేసుకోవటం పిల్లలు కార్ల్ రెడ్డి,జార్జి రెడ్డి,సిరిల్ రెడ్డి,జాయ్ – ఈపేర్లు చూస్తేనే అర్ధమవుతుంది, అభిప్రాయాలను రుద్దలేదని.
తల్లి,తండ్రి ఉద్యోగ రీత్యా అనేక ఊర్లు తిరిగిన జార్జి రెడ్డి వరంగల్లో చదివినప్పుడు ఆయన ఆలోచనలకు ఒక క్రమపద్దతి ఏర్పడింది. వరంగల్లో సెయింట్ గాబ్రియల్ స్కూల్లో జార్జి చదువుకున్నప్పుడు కేజీ సత్యమూర్తి ఆ స్కూల్లో టీచర్ గా పనిచేశాడు. కొండపల్లి సీతారామయ్య ఫాతీమా స్కూల్లో టీచర్ గా పనిచేశేవాడు.అసలు వరంగల్ ఉద్యమం కేంద్రం… ఉద్యమ పరిచయాలకు, ప్రభావాలకు కొదవలేదు.
జార్జి హైదరాబాద్ లో PUC చదివాడు, స్టేట్ 2nd ర్యాంక్ సాధించాడు. కానీ ముల్కి (లోకల్) నిబంధనల వలన మెడిసిన్ సీట్ రాలేదు. నిజాం కాలేజీలో B.Sc మొదటి సంవత్సరం చదివి రెండవ సంవత్సరానికి ఉస్మానియా యూనివర్సిటీ కి మారాడు. అప్పట్లో OU లో డిగ్రీ కూడా ఉండేది.
విశ్వవిద్యాలయం పెద్ద వేదిక , చదువుకైనా, రాజకీయాలకైనా! జార్జి కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినా ఆయన మొదట సోషలిస్ట్ గా ఉండేవాడు. కాంగ్రెస్ లో Young Turks గ్రూపు, సోషలిస్ట్ ఫోరమ్ ఉండేవి. దీనికి అనుబంధంగా సోషలిస్ట్ యూత్ వింగ్ అని ఉండేది. మాజీ కేంద్ర మంత్రి,పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ K.V. రఘునాథ్ రెడ్డి Young Turk గ్రూప్ నుంచి సోషలిస్ట్ ఫోరమ్కు మారాడు. K.V. రఘునాథ్ రెడ్డి కొడుకు శ్రీనాథ్ రెడ్డి (Cardiologist -AIMMS) జార్జికి మిత్రుడు. జార్జి సోషలిస్ట్ యూత్ వింగ్లో క్రియాశీలకంగా ఉండేవాడు.
నెహ్రు బతికున్నంతకాలం ఆయన సోషలిస్టు ధోరణి వలన కమ్యూనిస్ట్ శక్తులు నెహ్రు పట్ల మిత్ర ధోరణి కలిగివుండేవారు. నెహ్రు మరణం తరువాత కాంగ్రెసులో జరిగిన ఆధిపత్య పోరు ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ,రాజ భరణాల రద్దు,సంక్షేమపథకాలు ప్రవేశపెట్టినందుకు ఇందిరా, మొరార్జీ వర్గాల మధ్య జరిగిన వర్గపోరు పర్యవసానముగా సరిగ్గా 50 సంవత్సరాల కిందట ఇందిరను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్లో క్రమంగా సోషలిస్ట్ ధోరణి బలహీనపడింది.
1964లో సిపిఐ నుంచి చీలి సిపిఎం ఏర్పడింది. 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరిలో కాను సన్యాల్ సాయుధపోరాటాన్ని మొదలుపెట్టాడు. 1969 నాటికి సాయుధపోరాటాన్ని సమర్ధించే వారందరు సిపిఎం నుంచి బయటకొచ్చి సిపిఐ(ఎం ) ను ఏర్పాటు చేశారు. మరో వైపు దేశ విభజన తరువాత 1969లో పెద్ద మత ఘర్షణలు గుజరాత్లో జరిగాయి.అద్వానీ ,జనసంఘ్ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి.
అంతర్జాతీయంగా చేగువేరా మరణం,ఫ్రాన్స్ లో విద్యార్థుల తిరుగుబాటు,వియాత్నం యుద్ధం…ఇలా అనేక సంఘటనలు ఆ దశాబ్దంలో జరిగాయి.
ఈ చరిత్ర తెలియకుండా భారతీయ సమాజ ఆలోచనలలో వచ్చిన మార్పును అర్ధంచేసుకోలేము. స్వాతంత్రం తమ బతుకులు మార్చదని సామాన్యులు నమ్మటం మొదలయింది. ఈ రాజకీయం పనికి రాదు ,సోషలిజం ఈ దేశ సమస్యలకు పరిష్కారాం చూపలేదు అని యువకుల్లో అభిప్రాయం ఏర్పడింది…. కమ్యూనిజమే పరిష్కార మార్గం అని అప్పటికే వివిధ సంఘాలలో పనిచేస్తున్న యువకులు నమ్మటం మొదలయ్యింది. ఈ క్రమంలోనే జార్జి పూరిస్థాయి కమ్యూనిస్టుగా మారాడు. కమ్యూనిస్ట్ పుట్టడు , తయారవుతాడు అనటానికి జార్జి జీవితం సాక్షం గా నిలబడుతుంది. 1971 నాటికి జార్జి తానూ మార్కిస్ట్ ను అని ప్రకటించుకున్నారు.MLC నీలం రామచంద్రయ్య జార్జికి మార్గదర్శకులు.
జార్జి ఎదిగిన క్రమం చూస్తే జార్జి కమ్యూనిస్ట్ కావటం అనివార్యం. హత్యకు గురి కాకుండా ఉంటే బహుశా నక్సల్ నాయకుడు అయ్యుండే వాడు. ఎన్కౌంటర్లో మరణించిన మాజీ MLC నీలం రామచంద్రయ్య,జంపాల చంద్రశేఖర్, మధుసూదన్‌రాజు, ఆది రెడ్డి,సంతోష్‌రెడ్డి, మారోజు వీరన్న, రంగవల్లి లాంటి విప్లవకారుల పేరు పక్కన జార్జి పేరు చేరి ఉండవొచ్చు లేక గణపతి లాగా పెద్దస్థాయిలో అజ్ఞాతంలో ఉండేవాడు.
విద్యార్థి రాజకీయాల్లో ఘర్షణలు సహజం. విద్యార్థి రాజకీయాల్లో గొడవలు పడ్డోళ్లంతా రౌడీలు కాదు. జార్జి సిద్ధాంతం ఉన్న నేత. అతని మీద రౌడీ ముద్ర వెయ్యటం ,దౌర్జన్యంగా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు లాంటి ఆరోపణలు హాస్యాస్పదం. జార్జి PUC స్టేట్ 2nd ర్యాంకర్,సోదరులలో ఒకరు ఐఏఎస్ ,మరొకరు డాక్టర్. గోల్డ్ మెడల్ భయపెట్టి తెచ్చుకున్నాడు అన్నంత సులభం కాదు ఆ వాదనను నిర్మాణాత్మకంగా వినిపించటం.
జార్జికి ప్రేమ కథలు లేవు,బులెట్ లేదు. జార్జి నడిచాడు, సైకిల్ తొక్కాడు,బస్సులో తిరిగాడు, మిత్రుల స్కూటర్ వెనక సీటు మీద ప్రయాణం చేశాడు ,చివరికి హత్యకు గురైన రోజు కూడా స్కూటర్ వెనుక సీటు మీద వెళ్లే హత్యకు గురయ్యాడు. హవాయి చెప్పులేసుకొని తిరిగిన జార్జి నిజంగానే సింపుల్ లివింగ్ హై థింకింగ్.
జార్జి 1972 ఏప్రిల్ 14న హత్యకావించబడటానికి ముందు ఒక హత్యాప్రయత్నం నుంచి తప్పించుకున్నాడు. 1972 ఫ్రిబ్రవరిలో తన ఇంటికి సమీపంలోనే జార్జి రెడ్డి మీద ప్రత్యర్ధులు దాడిచేశారు.ఆ దాడిలో కత్తిపోట్లకు గురైన జార్జి కొన్ని వారాలపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. చావు తనను అంత సులువుగా చేరలేదు అనే జార్జి ప్రత్యర్థుల కుట్రను ఊహించలేక పోయాడు.
జార్జిని రామచంద్రా రెడ్డి అనే మిత్రుడు స్కూటర్ మీద తీసుకెళుతుండగా ప్రత్యర్ధులు కాపు కాసి చంపారని ఒక వాదన. రామ చంద్రా రెడ్డి ప్రత్యర్థులకు సహకరించాడా? అన్న అనుమానం ఉంది కానీ నిర్ధారణ లేదు. వర్గ శత్రువులు అంటే ఎవరు ? కేసు నమోదయ్యింది ఏబీవీపీ నాయకుల మీద, ధూల్ పేట కు సంబంధించిన కొందరు కిరాయి హంతకుల మీద. జార్జి ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ప్రస్తుత బీజేపీ అగ్రనాయకులు విద్యాసాగర్ రావ్,ఇంద్రసేనా రెడ్డి కూడా OU లో చదివారు. కానీ వారి మీద కేసు నమోదు కాలేదు. జార్జి మిత్రులు కూడా వారి మీద ఆరోపణలు చెయ్యలేదు. సిరిల్ క్లాసుమేట్ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేసిన లఖన్ సింగ్ మీద ఆరోపణలు ఉన్నాయి,కేసు కూడా నమోదయ్యింది.అప్పటి ఏబీవీపీ నాయకులు సూర్దాస్ ,నరసింహా రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగిందని శవం సాక్షం చెబుతుంది కానీ హంతకులు ఎవరు అన్నది కోర్టు తేల్చలేక కేసు కొట్టేసింది. అసలు హత్య అక్కడ జరగలేదు,ఎక్కడో చంపి శవాన్ని అక్కడ పడేశారని ప్రాసిక్యూషన్ ఆర్గుమెంట్ చేసింది.
జార్జి రెండున్నర గంటల సినిమా హీరో కాదు రెండు తరాల స్ఫూర్తి. ఆయన సిద్ధాంతంతో ఏకీభవించవచ్చు లేక విబేధించ వచ్చు కానీ జార్జిని ఇగ్నోర్ చేయలేము.
జార్జి రెడ్డి హత్య తరువాత ఆయన తమ్ముడు సిరిల్ మరియు ఇతర మిత్రులు కలిసి PDSU ను స్థాపించారు. సిరిల్ వృత్తి రీత్యా డాక్టర్. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను స్థాపించాడు. సిరిల్ మరణం తరువాత ఆయాన భార్య గీతా రామస్వామి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను నడుపుతున్నారు.
జార్జి తరం Declassify -జీవన విధానాన్ని,భావాలను తాను పనిచేస్తున్న వర్గాలకు అనుగుణంగా మార్చుకోవటంతో ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ప్రపంచీకరణ ప్రభావంలో re-classify అంటే కింద నుంచి పై వర్గంలోకి మారే ప్రయత్నం చేస్తున్న రోజుల్లో మరో జార్జి రాకపోవచ్చు కానీ జార్జి ప్రభావం మరొకొన్ని దశాబ్దాలు ఉంటుంది.